SIR Status Check : మీ SIR ప్రాసెస్ పూర్తయిందా...? మొబైల్ లో స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి
తెలంగాణలో ఓటర్ల సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ వేగంగా సాగుతోంది. మీ ఓటు హక్కు సురక్షితంగా ఉందో లేదో తెలుసుకోవడానికి మీ ఎన్యూమరేషన్ ఫారమ్ స్టేటస్‌ను మొబైల్ ద్వారా ఆన్‌లైన్‌లో సులభంగా ఎలా చెక్ చేసుకోవాలో ఇక్కడ వివరంగా తెలుసుకోండి.
Telangana SIR Status Check Online : రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం ఓటర్ల జాబితా సమగ్ర సవరణప్రక్రియ అత్యంత వేగంగా కొనసాగుతోంది. రాష్ట్రంలోని ప్రతీ పౌరుడు, అర్హులైన ప్రతి ఒక్క ఓటరు ఈ కార్యక్రమంలో తప్పనిసరిగా పాల్గొనాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ ప్రక్రియను నిర్లక్ష్యం చేస్తే లేదా పూర్తి చేయకపోతే భవిష్యత్తులో మీ ఓటు హక్కును శాశ్వతంగా కోల్పోయే తీవ్ర ప్రమాదం ఉంది. ఈ గడువు ఆగస్ట్ 10వ తేదీతో ముగియనుంది.

ఈ ప్రత్యేక సవరణ ప్రక్రియలో భాగంగా బూత్ లెవల్ ఆఫీసర్లు (BLOలు) స్వయంగా ప్రతీ ఇంటికీ వచ్చి ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారమ్‌ను అందించారు. ఇప్పటికే ఈ ప్రక్రియ రాష్ట్రవ్యాప్తంగా పూర్తి అయింది. అయితే పంపిణీ చేసిన ఫారమ్‌లో ఓటర్ వివరాలను స్పష్టంగా పూర్తి చేసి…. తాజా పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోను దానికి అతికించాలి.
సాధారణంగా ఫారమ్ ఇచ్చిన రెండు లేదా మూడు రోజుల వ్యవధిలో బీఎల్వోలు మళ్లీ మీ ఇంటికి వచ్చి పూర్తి చేసిన ఫారమ్‌ను తీసుకెళ్తారు. ఒకవేళ నిబంధనల ప్రకారం బీఎల్వో మీ వద్దకు రాకపోతే… మీరే స్వయంగా వెళ్లి వారికి ఆ ఫారమ్‌ను అందించవచ్చు. ఒకవేళ బీఎల్వోలు నిర్లక్ష్యం వహించినా లేదా ఫారమ్ తీసుకోకపోయినా సరే… సంబంధిత ఉన్నతాధికారులకు నేరుగా ఫిర్యాదు చేసే వెసులుబాటు కూడా ఓటర్లకు ఉంది.
మీరు పూర్తి చేసి అందించిన ఎన్యూమరేషన్ ఫారమ్‌లోని సమాచారాన్ని అధికారులు ఆన్‌లైన్ సిస్టమ్‌లో అప్‌లోడ్ చేసి డిజిటలైజేషన్ చేస్తారు. ఆపై భారత కేంద్ర ఎన్నికల సంఘం (CEC) అధికారిక డేటాబేస్‌లో మీ ఎస్‌ఐఆర్ వివరాల అప్‌డేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. అయితే మీ వివరాలను బీఎల్వో ఆన్‌లైన్‌లో సరిగ్గా అప్‌లోడ్ చేశారా….. లేదా? మీ ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తిగా ముగిసిందా లేదా? అనేది మీ వద్ద ఉన్న స్మార్ట్‌ఫోన్ ద్వారా చాలా సులువుగా చెక్ చేసుకోవచ్చు.
ఆన్‌లైన్ స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి…
- ముందుగా మీ మొబైల్ లేదా కంప్యూటర్ బ్రౌజర్‌లో కేంద్ర ఎన్నికల సంఘం అధికారిక పోర్టల్ https://voters.eci.gov.in/ ఓపెన్ చేయాలి.
- హోమ్ పేజీ ప్రత్యక్షమైన తర్వాత అక్కడ కనిపిస్తున్న 'Fill Enumeration Form' (ఫిల్ ఎన్యూమరేషన్ ఫారం) అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- ఆ తర్వాత ప్రత్యక్షమయ్యే డ్రాప్‌డౌన్ మెనూ నుంచి మీ రాష్ట్రాన్ని (తెలంగాణ) ఎంచుకోవాలి.
- ఇప్పుడు మీ ఓటరు గుర్తింపు కార్డుపై ఉండే 'EPIC నంబర్' (Voter ID Number) ను నిర్దేశిత గడిలో స్పష్టంగా నమోదు చేయాలి.
- వివరాలన్నీ నమోదు చేసిన తర్వాత చివర్లో ఉన్న 'Search' (సెర్చ్) బటన్‌పై క్లిక్ చేస్తే మీ ఎన్యూమరేషన్ ఫారమ్ ఏ స్థితిలో ఉందో స్క్రీన్‌పై స్పష్టంగా కనిపిస్తుంది.
- ఒకవేళ మీ స్క్రీన్‌పై "Your form has already been submitted" అని వస్తే మీ ఎస్‌ఐఆర్ ప్రాసెస్ విజయవంతంగా పూర్తయినట్లే, కాబట్టి ఓటు హక్కు విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
- అలాకాకుండా ఇంకా 'Pending' (పెండింగ్) అని చూపిస్తుంటే… వెంటనే మీ ప్రాంతీయ బీఎల్వో (BLO) ని నేరుగా సంప్రదించి ఫారమ్ వివరాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయించాల్సి ఉంటుంది.
ఈసీఐ సవరించిన షెడ్యూల్ ప్రకారం…. ఆగస్టు 10 వరకు బీఎల్‌ఓలకు గణన పత్రాలను సమర్పించవచ్చు. పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ, పునర్వ్యవస్థీకరణ ఆగస్టు 10 నాటికి పూర్తి చేస్తారు. ముసాయిదా ఓటర్ల జాబితాలు ఆగస్టు 17న ప్రచురిస్తారు. క్లెయిమ్‌లు, అభ్యంతరాలను దాఖలు చేయడానికి గడువు ఆగస్టు 17 నుండి సెప్టెంబర్ 16 వరకు ఉంటుంది.
క్లెయిమ్‌లు, అభ్యంతరాల పరిష్కారం ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 15 మధ్య జరుగుతుంది. తుది ఓటర్ల జాబితాను అక్టోబర్ 19న ప్రచురిస్తారు. తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియను జూన్ 25న చేపట్టగా…. తొలి గడువు జూలై 24గా నిర్ణయించారు. ఆ గడువును ఆగస్టు 3కి, ఆ తర్వాత ఆగస్టు 10కి సవరించారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

