ఫోన్ ట్యాపింగ్ కేసు : 'అవసరమైతే మళ్లీ పిలుస్తాం' - కేటీఆర్ విచారణపై 'సిట్' చీఫ్ కీలక ప్రకటన
ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ ను సిట్ విచారించింది. దాదాపు 7 గంటలకుపైగా ప్రశ్నించింది. గందరగోళానికి గురి చేసేలా కొన్ని వార్తలు బయటికి వచ్చిన నేపథ్యంలో సిట్ చీఫ్ సజ్జనార్ ఓ ప్రకటన విడుదల చేశారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు పెంచింది. ఇప్పటికే ఈ కేసులో మాజీ మంత్రి హరీశ్ రావుని విచారించగా… శుక్రవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడింట్ కేటీఆర్ ను కూడా విచారించింది. దాదాపుగా 7 గంటలకుపైగా ప్రశ్నించింది. అయితే కేటీఆర్ విచారణ వేళ కొన్ని వార్తలు బయటికి వచ్చాయి. ఈ కేసులో నిందితులుగా ఉన్న రాధాాకిషన్ రావుతో కలిపి కేటీఆర్ ను విచారిస్తున్నట్లు వార్తలు సర్క్యులేట్ అయ్యాయి. ఈ వార్తలను బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండించింది.

సిట్ చీఫ్ సజ్జనార్ ప్రకటన
మరోవైపు కేటీఆర్ విచారణపై సిట్ చీఫ్ సజ్జనార్ ఓ ప్రకటన విడుదల చేశారు. సిట్ నోటీసులకు అనుగుణంగా కేటీఆర్ విచారణకు హాజరయ్యారని తెలిపారు. కేవలం కేటీఆర్ ను మాత్రమే విచారించామని స్పష్టం చేశారు. ఈ మేరకు కొన్ని వివరాలను తన ప్రకటనలో పేర్కొన్నారు.
"పంజాగుట్ట పోలీస్ స్టేషన్ క్రైమ్ నంబర్ 243/2024 కేసు దర్యాప్తులో భాగంగా ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ కు నోటీసు జారీ చేయడం జరిగింది. దీని ప్రకారం, 2026 జనవరి 23న ఉదయం 11:00 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో దర్యాప్తు అధికారి ఎదుట హాజరు కావాలని ఆయనను ఆదేశించడం జరిగింది.
నోటీసుకు అనుగుణంగా కేటీఆర్ సిట్ /దర్యాప్తు అధికారి ఎదుట హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయనను విచారించడం జరిగింది. కేసుకు సంబంధించిన కీలక అంశాలను రాబట్టడంతో పాటు రికార్డులో ఉన్న సాక్ష్యాధారాలతో వాటిని విశ్లేషిస్తున్నాము. సాక్షులను ఎవరినీ సంప్రదించవద్దని లేదా ప్రభావితం చేయవద్దని ఆయనకు సూచించాము. అలాగే… అవసరమైతే విచారణకు మళ్లీ హాజరుకావాల్సి ఉంటుందని తెలియజేశాము.
ఈరోజు కేటీఆర్ విచారణ కేవలం క్రైమ్ నంబర్ 243/2024కి సంబంధించి మాత్రమే జరిగిందని స్పష్టం చేస్తున్నాము. రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, జర్నలిస్టులు, న్యాయమూర్తులు మరియు ప్రముఖులతో సహా వేలాది మంది పౌరుల ఫోన్లను అనధికారికంగా, చట్టవిరుద్ధంగా ఇంటర్‌సెప్షన్ (ట్యాపింగ్), నిఘా పెట్టారనే విస్తృత ఆరోపణలకు సంబంధించిన కేసు ఇది.
ఫోన్ ఇంటర్‌సెప్షన్ కేవలం భద్రతా కారణాల దృష్ట్యా మాత్రమే జరిగిందని, ఇందులో ఎలాంటి చట్టవ్యతిరేకత లేదని కొన్ని మీడియా వర్గాలు మరియు వ్యక్తులు నిరాధారమైన, తప్పుదోవ పట్టించే సమాచారాన్ని ప్రచారం చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. దర్యాప్తు సంస్థకు ఇటువంటి తప్పుడు కథనాలతో సంబంధం లేదు. ఈ దర్యాప్తు పూర్తిగా చట్టప్రకారం, నిష్పక్షపాతంగా మరియు వృత్తిపరమైన ప్రమాణాలతో జరుగుతోంది.
ఈ నేపథ్యంలో ధృవీకరించని లేదా తప్పుదోవ పట్టించే సమాచారాన్ని ప్రచారం చేయవద్దని ప్రజలను కోరుతున్నాము. చట్టబద్ధమైన, అధికారిక మార్గాల ద్వారా వెల్లడించిన వాస్తవాలను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము" అని సిట్ చీఫ్ సజ్జనార్ సూచించారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

