...
...
Next Story

Hyderabad Apple Store : హైదరాబాద్‌లో ఇక్కడ యాపిల్ స్టోర్.. డిసెంబర్ 10న గ్రాండ్ ఓపెనింగ్!

Hyderabad Apple Store : హైదరాబాద్‌లో యాపిల్ తన 7వ స్టోర్‌ను డిసెంబర్ 10న ప్రారంభించనుంది. ఈ స్టోర్ ప్రత్యేకతలు, ఇతర వివరాలు తెలుసుకోండి.

Published on: Nov 26, 2026, 11:05:04 IST
Advertisement

టెక్ దిగ్గజం యాపిల్ భారతదేశంలో తన రిటైల్ సామ్రాజ్యాన్ని మరింత వేగంగా విస్తరిస్తోంది. ముంబై, ఢిల్లీ, బెంగళూరు, పూణే నగరాల తర్వాత ఇప్పుడు హైదరాబాద్ వంతు వచ్చింది. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో యాపిల్ తన నూతన అధికారిక రిటైల్ స్టోర్‌ను ప్రారంభించేందుకు సిద్ధమైంది. యాపిల్ కూకట్‌పల్లి(Apple Kukatpally) పేరుతో రాబోతున్న ఈ స్టోర్ డిసెంబర్ 10వ తేదీన వినియోగదారులకు అందుబాటులోకి రానుంది.

హైదరాబాద్‌లో యాపిల్ స్టోర్
హైదరాబాద్‌లో యాపిల్ స్టోర్

కూకట్‌పల్లి వై-జంక్షన్ సమీపంలోని ప్రతిష్టాత్మక లేక్ షోర్-వై జంక్షన్ మాల్ వేదికగా ఈ సరికొత్త యాపిల్ స్టోర్ కొలువుదీరనుంది. భారతదేశంలో యాపిల్ ప్రారంభిస్తున్న ఏడవ అధికారిక స్టోర్ ఇది. భారత్‌లో యాపిల్ ఆఫ్‌లైన్ రిటైల్ ప్రస్థానాన్ని పరిశీలిస్తే.. తొలుత ముంబైలోని యాపిల్ బీకేసీ(Apple BKC)తో ప్రయాణం మొదలైంది. ఆ తర్వాత వరుసగా ఢిల్లీలోని యాపిల్ సాకేత్, బెంగళూరులోని యాపిల్ హెబ్బాళ్, పూణేలోని యాపిల్ కోరెగావ్ పార్క్ స్టోర్లు ప్రారంభమయ్యాయి.

అనంతరం ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో యాపిల్ నోయిడా, ముంబైలో యాపిల్ బోరివలి స్టోర్లను యాపిల్ అందుబాటులోకి తెచ్చింది. ఇప్పుడు దక్షిణ భారతదేశంలో బెంగళూరు తర్వాత హైదరాబాద్‌లో ఈ భారీ స్టోర్‌ను ఏర్పాటు చేయడం విశేషం.

యాపిల్ ఎక్కడ కొత్త స్టోర్ ప్రారంభించినా, అక్కడి స్థానిక సంస్కృతి, వారసత్వానికి పెద్దపీట వేస్తూ ప్రత్యేకమైన బారికేడ్ డిజైన్‌ను రూపొందిస్తుంది. హైదరాబాద్‌కు ఉన్న సిటీ ఆఫ్ పెర్ల్స్(ముత్యాల నగరం) గుర్తింపును ప్రతిబింబించేలా యాపిల్ కూకట్‌పల్లి స్టోర్‌ను తీర్చిదిద్దారు. ఇంద్రధనస్సు రంగుల ఛాయలతో మెరిసిపోయే ముత్యపు ఆకృతిలో యాపిల్ లోగోను ఇందులో పొందుపరిచారు. భాగ్యనగర వారసత్వానికి ఇది నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోందని యాపిల్ పేర్కొంది.

కేవలం ఉత్పత్తుల విక్రయాలకే పరిమితం కాకుండా కస్టమర్లకు మెరుగైన సేవలు అందించేందుకు యాపిల్ స్పెషలిస్ట్‌లు, క్రియేటివ్స్, జీనియస్‌లతో పాటు వ్యాపార అవసరాల కోసం ప్రత్యేక బిజినెస్ టీమ్స్ ఇక్కడ అందుబాటులో ఉంటాయి. అంతేకాకుండా ప్రతిరోజూ టుడే ఎట్ యాపిల్(Today at Apple) పేరుతో ఉచిత సెషన్లను నిర్వహించనున్నారు. ఐఫోన్, ఐప్యాడ్, యాపిల్ వాచ్‌లను సులభంగా ఎలా ఉపయోగించాలో నేర్పించడంతో పాటు ఫోటోగ్రఫీ, వీడియో ఎడిటింగ్, డ్రాయింగ్ వంటి సృజనాత్మక అంశాలపై నిపుణులతో ప్రత్యేక వర్క్‌షాప్‌లు ఉంటాయి. ఐటీ హబ్‌గా వేగంగా ఎదుగుతున్న హైదరాబాద్‌లో యాపిల్ స్టోర్ రాక టెక్ వర్గాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది.

 

ABOUT THE AUTHOR

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks