...
...
Next Story

వచ్చేవారం వేసవి ప్రారంభ సంకేతాలు.. రాత్రి ఉష్ణోగ్రతలు కూడా పెరిగే అవకాశం!

హైదరాబాద్‌లో వచ్చే వారం నుండి ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. వేసవికాలం ప్రారంభ సంకేతాలు చూస్తారని అంటున్నారు.

Published on: Jan 21, 2026, 14:54:41 IST
Advertisement

వచ్చేవారం హైదరాబాద్ వాసులు వేసవి కాలం ప్రారంభ సంకేతాలను చూడటం ప్రారంభించే అవకాశం ఉంది. రాత్రి ఉష్ణోగ్రతలు కూడా పెరిగే అవకాశం ఉంది. హైదరాబాద్‌లో వేసవి కాలం మొదటి సంకేతాలు వచ్చేవారం నుంచి అనుభవించే అవకాశం ఉందని తెలంగాణ వెదర్ మ్యాన్ అంచనా వేశారు. శీతాకాలం ఇంకా 14 రోజులు మాత్రమే మిగిలి ఉందని అన్నారు.

ప్రతీకాత్మక చిత్రం (pixabay)
ప్రతీకాత్మక చిత్రం (pixabay)

తెలంగాణ వెదర్ మ్యాన్ ప్రకారం, జనవరి చివరి నాటికి పగటి ఉష్ణోగ్రత 31-32 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది. రాబోయే 4-5 రోజులు రాత్రి ఉష్ణోగ్రతలు 14 నుంచి 16 డిగ్రీల సెల్సియస్ పరిధిలో ఉండే అవకాశం ఉందని, ఆ తర్వాత అది పెరుగుతుందని అన్నారు.

ప్రస్తుతం నగరంలో నమోదైన కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతలు 19.5, 29.5 డిగ్రీల సెల్సియస్. ఈ ఉష్ణోగ్రతలు ఖైరతాబాద్‌లో నమోదవుతున్నాయి. హైదరాబాద్‌లో త్వరలో వేసవి కాలం ప్రారంభమయ్యే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేసినప్పటికీ, భారత వాతావరణ శాఖ (IMD) ఈ సీజన్‌కు సంబంధించి ఎటువంటి సూచనను జారీ చేయలేదు.

జనవరి 24 వరకు నగరంలో ఉదయం లేదా రాత్రి వేళల్లో పొగమంచు/మబ్బు పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని ఐఎండీ హైదరాబాద్ తెలిపింది.

ఇక తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే చలి తీవ్రత కాస్త తగ్గింది. కానీ దట్టమైన పొగమంచు కమ్ముకుంటోంది. కొన్ని జిల్లాల్లో, పొగమంచు చాలా తీవ్రంగా ఉంది. రాత్రి, ఉదయం బయటకు అడుగు పెట్టడానికి ప్రజలు భయపడుతున్నారు. అధిక పీడన వ్యవస్థ వాతావరణ మార్పులకు కారణమవుతోంది. ఉత్తరం నుండి వీచే చల్లని గాలులు తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలను తగ్గిస్తున్నాయి. మరికొన్ని రోజులు దట్టమైన పొగమంచు ఏర్పడే అవకాశం ఉంది.

తెలంగాణలో చలి తీవ్రత తగ్గింది. ఇప్పుడు ఆదిలాబాద్‌లో అత్యల్ప ఉష్ణోగ్రత 13.7 డిగ్రీలు, మెదక్‌లో 13.8 డిగ్రీలుగా నమోదైంది. ఇతర కనిష్ట ఉష్ణోగ్రతలు 15.6 డిగ్రీలు నుండి 18.2 డిగ్రీలు వరకు ఉన్నాయి. ఆదిలాబాద్‌లో గరిష్ట ఉష్ణోగ్రత 33.8 డిగ్రీలుగా నమోదైంది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe