...
...
Next Story

వాహనాల సంఖ్య పెరిగినప్పటికీ.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ వేగం గంటకు ఎంతకు చేరిందంటే?

Hyderabad Traffic : హైదరాబాద్‌లో వాహనాల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అయితే దీనితో ట్రాఫిక్ మీద కూడా ప్రభావం చూపిస్తోంది. హైదరాబాద్‌లో ట్రాఫిక్ వేగం గంటకు ఎంత ఉందో తెలుసా?

Published on: Mar 24, 2026, 21:06:52 IST
Advertisement

హైదరాబాద్ రోడ్లపై వాహనాల సంఖ్య వేగంగా పెరుగుతున్నప్పటికీ.. 2025 నాటికి సగటు ట్రాఫిక్ వేగంలో గణనీయమైన మెరుగుదల నమోదైంది. Telangana Socio Economic Outlook 2026 ప్రకారం.. ట్రాఫిక్ నిర్వహణ, రోడ్డు ఇంజనీరింగ్ చర్యలలో సాధించిన పురోగతి కారణంగా.. నగర సగటు ప్రయాణ వేగం 2024లో గంటకు 20.1 కిలోమీటర్ల నుండి 2025 నాటికి గంటకు 23.4 కిలోమీటర్లకు పెరిగింది.

హైదరాబాద్ ట్రాఫిక్
హైదరాబాద్ ట్రాఫిక్

గత దశాబ్ద కాలంలో నగరంలో వాహనాల సంఖ్య రెట్టింపు కంటే ఎక్కువైంది. 2014లో 42.2 లక్షలుగా ఉన్న ఈ సంఖ్య, 2025 నవంబర్ నాటికి 94.16 లక్షలకు పెరిగింది. సగటున ప్రతిరోజూ 1,500కు పైగా కొత్త వాహనాలు హైదరాబాద్ రోడ్లపైకి వస్తున్నాయని, ఇది నగర మౌలిక సదుపాయాలపై ఒత్తిడిని తీవ్రతరం చేస్తోందని నివేదిక పేర్కొంది.

2019లో 22 కిలోమీటర్లు, 2016లో 19 కిలోమీటర్లుగా ఉన్న సగటు వేగం, 2021 నాటికి సుమారు 25 కిలోమీటర్లకు పెరిగినట్లు పోలీసు గణాంకాలు సూచించాయి.

నిబంధనల అమలు.. మౌలిక సదుపాయాల మెరుగుదల, ట్రాఫిక్ నియంత్రణ చర్యల కలయిక వల్లే వేగం పెరిగిందని అధికారులు పేర్కొంటున్నారు. అనుమతి లేని వేళల్లో భారీ వాహనాల రాకపోకలను నియంత్రించడం, ప్రధాన కూడళ్లలో ‘ఫ్రీ లెఫ్ట్’ టర్న్‌లను ప్రవేశపెట్టడం, రసూల్‌పురా, రెతిబౌలి వంటి అధిక ట్రాఫిక్ ఉన్న కారిడార్లలో రివర్సిబుల్ లేన్‌లను అమలు చేయడం వంటివి ఇందులో ఉన్నాయి.

సగటు వేగం పెరుగుతున్నప్పటికీ.. వాహనాల సంఖ్య పెరుగుతూనే ఉన్నందున సగటు వేగాన్ని నిలబెట్టుకోవడం, మరింత మెరుగుపరచడం ఒక సవాలుగానే మిగిలిపోతుందని అధికారులు అంగీకరిస్తున్నారు. నగరం అంతటా రద్దీని నియంత్రించడానికి, రహదారి సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి ట్రాఫిక్ పోలీసులు టెక్నాలజీ ఆధారిత అమలు, ప్రజా అవగాహన ప్రచారాలు, పౌర సంస్థలతో సన్నిహిత సమన్వయం వంటి వాటిపై ఎక్కువగా ఆధారపడుతున్నారు.

ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్(ITMS), డిజిటల్ కెమెరా ఆధారిత చలాన్‌ల విస్తృత వినియోగం వల్ల ఉల్లంఘనలపై మరింత చర్యలు తీసుకోవడానికి వీలయ్యిందని అధికారులు చెబుతున్నారు. అలాగే నగర రహదారులపై మొత్తం నిబంధనల పాటింపు కూడా మెరుగుపడిందని అంటున్నారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe