...
...
Next Story

ఓఆర్ఆర్ తరహాలోనే హైదరాబాద్ చుట్టూ వాటర్ రింగ్.. నీటి సరఫరా అంతరాయాలకు చెక్!

హైదరాబాద్ నగర ఔటర్ రింగ్ రోడ్డు మాదిరిగానే రింగ్ ఆకారంలో వాటర్ సప్లై కోసం ప్రభుత్వం ప్రణాళికలు వేస్తోంది. భాగ్యనగరం అంతటా నిరంతరాయంగా తాగునీటి సరఫరా కోసం పైపులైన్‌ను ఏర్పాటు చేయనుంది.

Published on: Jan 11, 2026, 14:16:47 IST
Advertisement

హైదరాబాద్‌లో నీటి ఇబ్బందలు తీర్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు వేస్తోంది. భారీ ప్రణాళికను సిద్ధం చేసింది. భాగ్యనగరానికి నీటిని అందించే కృష్ణా, గోదావరి, సింగూరు, మంజీరా, జంట జలశయాలైన ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌లను ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తోంది ప్రభుత్వం. ఓఆర్ఆర్ మాదిరిగానే నగరం చుట్టూ.. 140 కిలోమీటర్లతో రేడియల్ రింగ్ మెయిన్ పైపు‌లైన్ వ్యవస్థ కోసం ఏర్పాటు చేసేందుకు చూస్తోంది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ఈ ప్రాజెక్టులో భాగంగా ఔటర్ రింగ్ రోడ్డు వెంట ప్రధాన పైపులైన్స్ వేస్తారు. దానికి అనుసంధానంగా సిటీలోకి నీటిని సరఫరా చేయడానికి మరో 96 కిలోమీటర్లు అంతర్గత నెట్‌వర్క్ సృష్టిస్తారు. దీంతో నగరం నలుమూలలకూ నీటి సరఫరా వ్యవస్థను బలోపేతం చేస్తారు.

రూ.7,200 కోట్ల వ్యయంతో అంచనా వేసిన ప్రతిపాదిత వాటర్ రింగ్ ప్రధాన ప్రాజెక్టులో నగరం చుట్టూ 158 కి.మీ. పొడవైన క్లోజ్డ్ లూప్ పైప్‌లైన్ వేయడం జరుగుతుంది. ఇందులో 18 కి.మీ. ఇప్పటికే వేశారు. మిగిలిన 140 కి.మీ.లకు వివరణాత్మక ప్రాజెక్టు నివేదికతో పాటు ఆమోదం కోరుతూ ప్రతిపాదనలు సమర్పించారు.

ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం అన్ని ప్రధాన నీటి వనరులను అనుసంధానించడానికి రింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయడం. ఫేజ్-I పనులను ప్రారంభించే లక్ష్యంతో పరిపాలనా, ఆర్థిక అనుమతులు కోరుతూ ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఈ ప్రాజెక్ట్ మూడు దశల్లో అమలు చేస్తారు.

హైదరాబాద్‌కు సరఫరా చేసే ఐదు ప్రధాన తాగునీటి వనరులను ఒకే క్లోజ్డ్ లూప్ 'రింగ్ మెయిన్' వ్యవస్థ ద్వారా అనుసంధానించడం ప్రధాన లక్ష్యం. ప్రస్తుతం ఏదైనా ప్రధాన సరఫరా పైప్‌లైన్ దెబ్బతినడం వల్ల తరచుగా 24 నుండి 48 గంటలు లేదా అంతకంటే ఎక్కువ కాలం నీటి సరఫరాకు అంతరాయం కలుగుతుంది. ప్రస్తుతం ఉన్న వ్యవస్థతో అంతరాయాల సమయంలో నీటిని ఒక పైప్‌లైన్ నుంచి మరొక పైప్‌లైన్ ద్వారా నీటిని మళ్లించడానికి అనుమతి ఉండదు.

ఈ ప్రాజెక్ట్ కింద గోదావరి, కృష్ణా, మంజీర, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నుండి నీటిని ఒకే క్లోజ్డ్-లూప్ నెట్‌వర్క్‌లో కలిపేస్తారు. రింగ్ ప్రధాన వ్యవస్థ నగర నీటి సరఫరా వ్యవస్థకు వెన్నెముకగా పనిచేస్తుందని, అవసరమైనప్పుడల్లా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా నీటిని వెంటనే మళ్లించడానికి వీలు కల్పిస్తుందని అధికారులు తెలిపారు.

మెయిన్ రింగ్ పైప్‌లైన్‌తోపాటుగా ఔటర్ రింగ్ రోడ్ వెంబడి అంతర్గత ప్రాంతాలకు నీటిని సరఫరా చేయడానికి 98 కి.మీ రేడియల్ డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌లను నిర్మించాలని యోచిస్తోంది ప్రభుత్వం. మొత్తం 24 కొత్తగా పెద్ద భారీ స్టోరేజ్ రిజర్వాయర్లను కూడా నిర్మించనున్నారు. ఇది నగరం నీటి నిల్వ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతుంది.

ఈ ప్రాజెక్ట్ ద్వారా ఒకే నీటి వనరుపై ఆధారపడటం తగ్గుతుంది. తద్వారా నీటి అంతరాయం సమస్య ఉండదు. నగరం అంతటా సమానంగా పంపిణీ వ్యవస్థ ఉంటుంది. హైదరాబాద్‌కు భవిష్యత్తులో తాగునీటి డిమాండ్‌ను అంతరాయాలు లేకుండా తీర్చడంలో సహాయపడుతుందని అధికారులు తెలిపారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe