...
...
Next Story

Hyderabad : అక్రమ బోర్లపై 'హైడ్రా కొరడా' - కొన‌సాగుతున్న తొలిగింపు చర్యలు

అక్రమ బోర్లపై హైడ్రా చర్యలు కొన‌సాగుతున్నాయి. తాజాగా సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్‌లో అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న 7 అక్రమ నీటి బోర్లు, 6 సంపులను ధ్వంసం చేశారు. వాటర్ ట్యాంకర్లను సీజ్ చేసి కేసులు నమోదు చేశారు.

Published on: Nov 3, 2026, 08:11:23 IST
Advertisement

హైదరాబాద్ శివార్లలో అక్రమ నీటి వ్యాపారంపై ‘హైడ్రా’ (HYDRAA) ఉక్కుపాదం మోపుతోంది. ఎలాంటి అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా బోర్లు వేసి, భూగర్భ జలాలను తోడేస్తూ భారీ దందా నడుపుతున్న అక్రమార్కుల ఆటకట్టించేందుకు చర్యలు వేగవంతం చేసింది. ఇందులో భాగంగానే సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం తెల్లాపూర్ గ్రామ పరిధిలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో సోమవారం హైడ్రా అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు.

బోరు తొలగింపు
బోరు తొలగింపు

నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన 7 అక్రమ బోర్లను పైపులతో సహా అధికారులు తొలగించి, వాటిని పూర్తిగా పూడ్చివేశారు. వీటితో పాటు నీటిని నిల్వ చేసేందుకు ఏర్పాటు చేసిన 6 భారీ వాటర్ సంపులను జెసిబీల సహాయంతో పూర్తిగా ధ్వంసం చేశారు. అక్రమంగా నీటిని రవాణా చేస్తున్న పలు వాటర్ ట్యాంకర్లను సీజ్ చేయడంతో పాటు, ఈ దందా వెనుక ఉన్న బాధ్యులపై చట్టరీత్యా కేసులు నమోదు చేయించారు.

భూగర్భ జలమట్టం దారుణంగా పడిపోకుండా కాపాడటంతో పాటు, స్థానిక ప్రజలకు భవిష్యత్తులో తీవ్ర నీటి ఎద్దడి కలగకుండా చూడటమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. అనుమతులు లేకుండా వాణిజ్య అవసరాల కోసం వేసే బోర్లపై నిరంతరం నిఘా ఉంటుందని స్పష్టం చేశారు.

మరోవైపు తెల్లాపూర్, దాని పరిసర ప్రాంతాల్లోని గేటెడ్ కమ్యూనిటీలు, కాలనీల నివాసితులు అక్రమ వాటర్ ట్యాంకర్ల రాకపోకలతో తీవ్ర ఇబ్బందులు పడేవారు. నీటిని తోడేసి వీలైనంత వేగంగా అమ్ముకోవాలనే ఆరాటంలో ట్యాంకర్ డ్రైవర్లు జనావాసాల మధ్య ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటంపై గతంలోనే పలువురు ఆందోళనలు వ్యక్తం చేశారు.

చెరువుల చెంత బోర్లు వేసి అక్ర‌మంగా నీటి దందా చేస్తున్నార‌ని.. వెంట‌నే హైడ్రా రంగంలోకి దిగి వాటిని నియంత్రించాల‌ని ప‌లువురు హైడ్రా ప్ర‌జావాణిలో కోరారు. 600ల నుంచి వెయ్యి అడుగుల మేర భూగ‌ర్భంలో నీటిని తోడేసి.. ప‌క్కనే ఉన్న కాల‌నీల్లో నివ‌సిస్తున్న త‌మ‌కు నీరు అంద‌కుండా చేస్తున్నార‌ని ప‌లువురు వాపోయారు.

నాన‌క్‌రాంగూడ‌, ఫైనాన్షియ‌ల్ డిస్ట్రిక్ట్ త‌దిత‌ర ప్రాంతాల‌లో నీటిని అమ్ముకుని త‌మ‌కు నీరు లేకుండా చేస్తున్నార‌ని గోప‌న్న‌ప‌ల్లి జ‌ర్న‌లిస్టు కాల‌నీతో పాటు.. ప‌లు కాల‌నీవాసులు హైడ్రా ప్ర‌జావాణిలో ఫిర్యాదు చేశారు. గోప‌న్న‌ప‌ల్లిలో ప‌దుల సంఖ్య‌లో వాట‌ర్ ట్యాంక‌ర్ల దందా కొన‌సాగుతోంద‌ని.. వాపోయారు. ఇలా హైడ్రా ప్ర‌జావాణికి మొత్తం 39 ఫిర్యాదులు రాగా వాటిని హైడ్రా అడిష‌న‌ల్ క‌మిష‌న‌ర్ డి. ఆనంద్‌కుమార్ ప‌రిశీలించి ప‌రిష్కార బాధ్య‌త‌ల‌ను సంబంధిత అధికారుల‌కు అప్ప‌గించారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks