iBomma Ravi : నా దగ్గర డబ్బుల్లేవ్.. సీజ్ చేసిన 3 కోట్ల కోసం కోర్టు మెట్లెక్కిన ఐబొమ్మ రవి

iBomma Ravi : ఐబొమ్మ అనే సినిమా పైరసీ వెబ్‌సైట్‌ను నడుపుతున్నాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇమంది రవి కోర్టును ఆశ్రయించాడు. తన బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయడం వల్ల కుటుంబాన్ని పోషించలేకపోతున్నానని, ఆ సొమ్మును విడుదల చేయాలని కోరాడు.

Published on: Sep 16, 2026, 19:37:42 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

పైరసీ వెబ్‌సైట్ ఐబొమ్మ(iBomma) నిర్వహించిన ఇమంది రవికి సంబంధించిన వ్యవహారంలో మరోసారి తెరపైకి వచ్చింది. తన బ్యాంక్ ఖాతాల్లో ఫ్రీజ్ (సీజ్) చేసిన దాదాపు రూ. 3 కోట్లను విడుదల చేయాలంటూ ఆయన నాంపల్లి కోర్టును ఆశ్రయించాడు. ఖాతాలు స్తంభించిపోవడం వల్ల కుటుంబ పోషణ తీవ్ర భారంగా మారిందని, రోజువారీ అవసరాలకు సైతం ఇబ్బందులు పడుతున్నానని తన పిటిషన్‌లో పేర్కొన్నాడు.

ఐబొమ్మ రవి
ఐబొమ్మ రవి

ఈ పిటిషన్‌పై నాంపల్లిలోని 9వ అదనపు చీఫ్ జుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు విచారణ చేపట్టింది. భారతదేశంలోనే అత్యంత భారీ ఆన్‌లైన్ పైరసీ నెట్‌వర్క్‌పై విచారణలో భాగంగా సైబర్ క్రైమ్ పోలీసులు రవికి చెందిన బ్యాంక్ ఖాతాలు, ఆస్తుల డిపాజిట్లను సీజ్ చేసిన సంగతి తెలిసిందే.

విశాఖపట్నం జిల్లాకు చెందిన 39 ఏళ్ల ఇమంది రవి (ఐబొమ్మ రవి) కరిబీయన్ దేశ పౌరసత్వాన్ని కలిగి ఉన్నాడు. నవంబర్ 2025లో ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ చేరుకున్న ఆయనను, కుకట్‌పల్లిలోని ఓ అపార్ట్‌మెంట్‌లో హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ సైబర్ క్రైమ్ పోలీసులు పక్కా సమాచారంతో అరెస్ట్ చేశారు.

నాంపల్లి కోర్టు బెయిల్ తిరస్కరించడంతో ఆయన దాదాపు 90 రోజులు చంచల్‌గూడ జైలులోనే గడిపాడు. ఫిబ్రవరి 17, 2026న కోర్టు కఠినమైన షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఛార్జ్‌షీట్ దాఖలు చేసే వరకు రోజువారీగా విచారణాధికారి ముందు హాజరుకావాలని, పాస్‌పోర్ట్‌ను సమర్పించాలని, దేశం విడిచి వెళ్లకూడదని, ఎలాంటి పైరసీ సైట్లను నిర్వహించకూడదని కోర్టు ఆదేశించింది.

వెబ్ హోస్టింగ్, డెవలప్‌మెంట్‌లో మంచి అనుభవం ఉన్న రవి, 2019లో ఐబొమ్మ పోర్టల్‌ను ప్రారంభించాడు. కోవిడ్-19 లాక్‌డౌన్ సమయంలో కొత్త సినిమాలను హెచ్‌డీ క్వాలిటీతో ఉచితంగా అందించడంతో ఈ సైట్‌కు విపరీతమైన ఆదరణ పెరిగింది. ఆ తర్వాత 2022లో బప్పం అనే మరో వెబ్‌సైట్‌ను కూడా స్టార్ట్ చేశాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ నెట్‌వర్క్ నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్ సర్వర్ల ఆధారంగా దాదాపు 65 కి పైగా మిర్రర్ వెబ్‌సైట్ల ద్వారా నడిచింది. రవి వద్ద లభించిన హార్డ్ డిస్కుల్లో వివిధ భాషలకు చెందిన 21 వేల సినిమాలు, 50 లక్షల మంది సబ్‌స్క్రైబర్ల డేటా దొరికినట్లు అప్పటి పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ వెల్లడించారు.

కేవలం పైరసీ మాత్రమే కాకుండా, ఈ సైట్లలో అక్రమ బెట్టింగ్ ప్రకటనలను ప్రదర్శించి వినియోగదారులను బెట్టింగ్ యాప్‌ల వైపు మళ్లించేవాడని విచారణలో తేలింది. ఈ ప్రక్రియలో కోట్లాది అక్రమ లావాదేవీలను పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా ఇతరుల పేర్లతో పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ వంటి పత్రాలను తన కోసం ఉపయోగించినట్టుగా కూడా రవిపై ఆరోపణలు ఉన్నాయి.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More