...
...
Next Story

కర్రెగుట్టల్లో ఐఈడీలు అమర్చిన మావోయిస్టులు.. వరుసగా పేలుళ్లు.. భద్రతా సిబ్బందికి గాయాలు

ఛత్తీస్‌గఢ్‌-తెలంగాణ సరిహద్దుల్లో ఉన్న కర్రెగుట్టల్లో మావోయిస్టులు పెట్టిన ఐఈడీలు పేలాయి. దీంతో 11 మంది భద్రతా సిబ్బందికి గాయాలు అయ్యాయి.

Published on: Jan 26, 2026, 16:59:57 IST
Advertisement

ఛత్తీస్‌గఢ్‌-తెలంగాణ సరిహద్దుల్లో మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్ సందర్భంగా మావోయిస్టులు అమర్చిన ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ పరికరాలు (IEDలు) పేలి 11 మంది భద్రతా సిబ్బంది గాయపడ్డారని ఒక అధికారి తెలిపారు. తెలంగాణ సరిహద్దులోని ఉసూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కర్రెగుట్ట హిల్స్ ప్రాంతంలో మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్ కోసం భద్రతా సిబ్బంది సెర్చింగ్ చేస్తుండగా పేలుళ్లు సంభవించాయి. బీజాపూర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

రాష్ట్ర పోలీసులలోని రెండు విభాగాలైన డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్(DRG), బస్తర్ ఫైటర్స్, మరియు కమాండో బెటాలియన్ ఫర్ రిసొల్యూట్ యాక్షన్ (CoBRA - CRPF ఎలైట్ యూనిట్)కు చెందిన సిబ్బంది ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారని అధికారులు చెప్పారు.

ఆపరేషన్ సమయంలో ఆరు పేలుళ్లు జరిగాయి. ఇందులో కనీసం 11 మంది సిబ్బంది గాయపడ్డారని, వారిలో 10 మంది డీఆర్‌‌జీకి చెందినవారు, ఒకరు CoBRAకి చెందినవారని అధికారులు వెల్లడించారు. గాయపడిన కోబ్రా సిబ్బంది రుద్రేష్ సింగ్ 210వ బెటాలియన్‌లో సబ్-ఇన్‌స్పెక్టర్.

సింగ్‌తోపాటు ఇద్దరు డీఆర్‌జీ సిబ్బంది కాళ్లకు గాయాలయ్యాయి. మరో ముగ్గురి కళ్ళకు గాయాలయ్యాయని, గాయపడిన వారిని హెలికాప్టర్ ద్వారా రాయ్‌పూర్‌లోని ఆసుపత్రికి తరలించామని అధికారులు వెల్లడించారు. రాయ్‌పూర్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో గాయపడిన సిబ్బందికి చికిత్స అందించారు. శస్త్రచికిత్స జరిగిందని వైద్యులు తెలిపారు. గాయపడిన భద్రతా సిబ్బందికి ప్రాణాపాయం తప్పినట్టుగా అధికారులు తెలిపారు.

గత ఏడాది నవంబర్‌లో భద్రతా దళాలు కర్రెగుట్టలోని ఉసూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తడ్పాల గ్రామంలో ఒక శిబిరాన్ని ఏర్పాటు చేశాయి. ఇది సీనియర్ మావోయిస్టులకు సురక్షితమైన ఆశ్రయంగా పరిగణించేవారు. గత ఏడాది ఏప్రిల్-మే నెలల్లో కర్రెగుట్ట కొండల చుట్టూ ఉన్న దట్టమైన అడవుల్లో కేంద్ర, రాష్ట్ర భద్రతా దళాలు 21 రోజుల పాటు సమగ్ర ఆపరేషన్ నిర్వహించాయి. ఈ ఆపరేషన్‌లో 31 మంది మావోయిస్టులు హతమయ్యారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe