రైల్వే ప్రయాణికుల సౌకర్యార్థం కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్‌లోని వివిధ స్టేషన్ల నుంచి 8 కొత్త రైళ్లను ప్రకటించింది. కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి చొరవతో వచ్చిన ఈ కొత్తరైళ్లు వీక్లీ ట్రైన్స్‌గా ప్రయాణికులకు సేవలందిచనున్నాయి. హైదరాబాద్ నుంచి తిరుపతి, తిరుచానూరు(ఆంధ్రప్రదేశ్), శ్రీ గంగానగర్, జైపూర్ (రాజస్థాన్), భువనేశ్వర్ (ఒడిశా)లకు రెగ్యులర్ ట్రైన్స్ నడపాలని డిమాండ్లు వచ్చాయి. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఈ విషయంపై రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్‌తో చర్చించారు.

దీంతో హైదరాబాద్ నగరంలోని కాచిగూడ, చర్లపల్లి, నాంపల్లి స్టేషన్ల నుంచి కొత్త రైళ్లను నడపాలని రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతి, తిరుచానూరు వంటి పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులకోసం 5 రైళ్లు కొత్తగా అందుబాటులోకి వస్తాయి. అంతేకాదు భువనేశ్వర్, జైపూర్, శ్రీగంగానగర్ వంటి సుదూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు కూడా ఉపయోగకరంగా ఉండనుంది.
కొత్త రైలు సర్వీసులు
- 17607/17608 నెంబరుతో కాచిగూడ నుంచి ప్రతి గురువారం రాత్రి 9.30కు తిరుచానూరు (ఆంధ్రప్రదేశ్) వెళ్లే వీక్లీ స్పెషల్ ట్రైన్ 15 మే, 2026 నుంచి ప్రారంభం కానుంది.
- 17601/17602 నెంబరుతో కాచిగూడ నుంచి ప్రతి శనివారం రాత్రి 10 గంటలకు శ్రీ గంగానగర్ (రాజస్థాన్) వెళ్లే వీక్లీ స్పెషల్ ట్రైన్ 14 జూలై, 2026 నుంచి ప్రారంభం కానుంది.
- 17047/17048 నెంబరుతో చర్లపల్లి నుంచి ప్రతి బుధవారం సాయంత్రం 6.55 గంటలకు తిరుచానూరు వెళ్లే వీక్లీ స్పెషల్ ట్రైన్ 7 మే, 2026 నుంచి స్టార్ట్ అవ్వనుంది.
- 17441/17442 నెంబరుతో చర్లపల్లి నుంచి ప్రతి బుధవారం రాత్రి 9.20 గంటలకు తిరుపతి వెళ్లే వీక్లీ స్పెషల్ ట్రైన్ 14 మే, 2026 నుంచి ప్రారంభం కానుంది.
- 17443/17444 నెంబరుతో చర్లపల్లి నుంచి ప్రతి శుక్రవారం సాయంత్రం 4.20 గంటలకు తిరుపతి వెళ్లే.. వీక్లీ స్పెషల్ ట్రైన్ 15మే, 2026 నుంచి ప్రారంభం అవుతుంది.
- 17059/17060 నెంబరుతో ప్రతి ఆదివారం రాత్రి 9.15 గంటలకు చర్లపల్లి నుంచి తిరుచానూరు వెళ్లే.. వీక్లీ స్పెషల్ ట్రైన్ 11 మే, 2026 నుంచి మెుదలవుతుంది.
- 17067/17068 నెంబరుతో ప్రతి సోమవారం సాయంత్రం 6.10 నిమిషాలకు చర్లపల్లి నుంచి భువనేశ్వర్ (ఒడిశా) వెళ్లే వీక్లీ స్పెషల్ ట్రైన్.. 5 మే, 2026 నుంచి ప్రారంభిస్తారు.
- 17079/17080 నెంబరుతో ప్రతి శుక్రవారం రాత్రి 7.50 గంటలకు నాంపల్లి నుంచి జైపూర్ (రాజస్థాన్) వెళ్లే వీక్లీ స్పెషల్ ట్రైన్ కూడా త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ రైలు ప్రారంభ తేదీని దక్షిణ మధ్య రైల్వే త్వరలోనే ప్రకటిస్తుంది.