అర్ధరాత్రి సీనియర్ జర్నలిస్టుల అరెస్టును ఖండిస్తున్నాం : జర్నలిస్టు సంఘాలు
మహిళా ఐఏఎస్ అధికారిపై కథనాలు ప్రసారం చేసిన కేసులో సీనియర్ జర్నలిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై పలు జర్నలిస్టు సంఘాలు స్పందించాయి. జర్నలిస్టులను అర్ధరాత్రి అరెస్ట్ చేయడం సరికాదని పేర్కొన్నాయి.
తెలంగాణలో మహిళా ఐఏఎస్ అధికారిపై వార్తలు ప్రసారం చేసిన కేసులో సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పోలీసులు దూకుడు పెంచారు. ఈ కేసులో ఐఏఎస్ అసోసియేషన్ తరఫున సీనియర్ ఐఏఎస్ అధికారి జయేశ్ రంజన్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఓ వార్త ఛానల్, డిజిటల్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. సిట్ కూడా ఏర్పాటైంది. తాజాగా ఈ కేసులో ఓ ఛానల్ ఇన్‌పుట్ ఎడిటర్‌తో పాటు ఇద్దరు రిపోర్టర్లను అరెస్ట్ చేశారు. ఈ అరెస్టులపై జర్నలిస్టు సంఘాలు మండిపడుతున్నాయి.

నోటీసులు ఇవ్వకుండా అరెస్టు ఏంటి : టీయూడబ్ల్యూజే
జర్నలిస్టులు దొంతు రమేష్, పరిపూర్ణ చారి, సుధీర్‌లను అర్ధరాత్రి పోలీసులు అరెస్టు చేయడాన్ని టీయూడబ్ల్యూజే ఖండించింది. జర్నలిస్టులుగానీ, ఆ వార్త సంస్థ గానీ నిరాధారమైన, అసత్య వార్త కథనాలు రాస్తే ఆ విషయంలో ఖండన కోరుకోవచ్చు అప్పటికీ వారు స్పందించకపోతే చట్ట పరమైన చర్యలు తీసుకోవచ్చు అని టీయూడబ్ల్యూజే అధ్యక్షుడు అల్లం నారాయణ అన్నారు. అర్ధరాత్రి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా వారిని అరెస్టు చేయడం సరైంది కాదన్నారు.
మహిళలు, వృద్ధులు, చిన్నారుల విషయంలో నిరాధారమైన వార్తలను ప్రసారం, ప్రచురించవద్దని, ఆధారాలు ఉంటేనే వార్తలు వేయాలని ఈ సందర్భంగా అల్లం నారాయణ గుర్తుచేశారు. ఎవరి వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసే విధంగా వార్త కథనాలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీడియా సంస్థలదే అన్నారు. సీనియర్ జర్నలిస్టు అరెస్టును టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతీ సాగర్, డిప్యూటీ జనరల్ సెక్రెటరీ కలుకూరి రాములు, టీఈఎంజేయూ అధ్యక్షుడు విష్ణు వర్ధన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎ.రమణ కుమార్ ఖండించారు.
జర్నలిస్టుల అరెస్ట్ అక్రమం : టీజేఎఫ్
సీనియర్ జర్నలిస్టులను అరెస్ట్ చేయటాన్ని తెలంగాణ జర్నలిస్టుల ఫోరమ్ తీవ్రంగా ఖండించింది. సిట్ ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం కనీసం సదరు జర్నలిస్టులకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా నేరుగా అరెస్ట్ చేయటం అత్యంత దారుణమని టీజేఎఫ్ అధ్యక్షుడు పల్లె రవికుమార్ మండిపడ్డారు. ఓ మీడియా కథనంలో ప్రసారమయ్యే కథనాలకు ఆ సంస్థ ఎడిటర్‌తో పాటు సంస్థ ఛైర్మన్ పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. సంస్థలో పని చేసే ఉద్యోగులను అరెస్ట్ చేయటమేంటని ప్రశ్నించారు.
ఈ వ్యవహారంపై నిష్పాక్షపాతంగా విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని టీజేఎఫ్ డిమాండ్ చేసింది. మంత్రిపై ప్రసారమైన కథనంపై నిష్పాక్షపాతంగా విచారణ జరిపించి, సంస్థ యాజమాన్యంపై కేసులు నమోదు చేసి విచారణ జరిపించాలని పేర్కొంది. సంస్థ యాజమాన్యం అనుమతి లేకుండా ఏ వార్త కూడా ప్రసారం కాదని, పెద్దలుగా ఉన్న వారిని విడిచిపెట్టి... సామాన్య ఉద్యోగులను బలి చేయటం చూస్తుంటే దీని వెనక ఏదో కుట్ర ఉందని అర్థమవుతోందని టీజేఎఫ్ వైస్ ప్రెసిడెంట్ పోగుల ప్రకాశ్, జనరల్ సెక్రటరీ మేకల కృష్ణ, డిప్యూటీ జనరల్ సెక్రటరీ ముద్దం స్వామి వ్యాఖ్యానించారు.
మీడియా స్వేచ్ఛను హరించడమే : క్రాంతి కిరణ్
సీనియర్ జర్నలిస్ట్ దొంతు రమేష్, చారి, సుధీర్‌ను అరెస్ట్ చేయడానికి.. సీనియర్ జర్నలిస్ట్, మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ మండిపడ్డారు. ఈ అరెస్టు మీడియా స్వేచ్ఛను హరించడమేనన్నారు. ఒక పత్రికలో లేదా మీడియాలో ఒక అంశంపై కథనం వచ్చినప్పుడు వాటిలోని నిజానిజాలపై అధికారులు విచారణ జరిపించాల్సిందని, ఒక అంశాన్ని బయటికి తీసుకొచ్చిన జర్నలిస్టులపై కేసులు పెట్టి వేధించడం కరెక్ట్ కాదని పేర్కొన్నారు. జర్నలిస్టులు వారి దృష్టికి వచ్చిన అంశాలను ప్రజలకు తెలియచెప్పే ప్రయత్నం చేస్తారని గుర్తు చేశారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


