కాకతీయుల నాటి అత్యంత అరుదైన శిల్పకళా సౌందర్యానికి జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం దక్కింది. తెలంగాణలోని ములుగు జిల్లా పాలంపేట గ్రామంలోని చారిత్రక గొల్లల గుడి(Gollala Gudi) దేవాలయాన్ని జాతీయ ప్రాధాన్యం కలిగిన కట్టడంగా (Monument of National Importance) ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) అధికారికంగా ప్రకటించింది.

యునెస్కో (UNESCO) ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించిన ప్రసిద్ధ కాకతీయ రుద్రేశ్వర (రామప్ప) దేవాలయానికి నైరుతి దిశలో ఈ గొల్లల గుడి ఉంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 31న తన అధికారిక గెజెట్‌లో ఈ నోటిఫికేషన్‌ను ప్రచురించినట్లు కేంద్ర పురాతత్వ శాఖ అధికారులు వెల్లడించారు.
పురావస్తు శాఖ నిపుణుల కథనం ప్రకారం గొల్లల గుడి త్రికూటాలయ నిర్మాణ శైలిలో నిర్మించారు. తూర్పు ముఖంగా విశాలమైన ఒక స్తంభాల మండపం ఉంటుంది. ఉత్తరం, దక్షిణం, పడమర దిక్కుల్లో మూడు గర్భగుడులు ఉన్నాయి. వీటిలో ప్రధానమైన మధ్య గర్భగుడిలో శివలింగం కొలువై ఉంది.
ఈ ఆలయ పారాపెట్ గోడలు అద్భుతమైన శిల్పాలతో అలంకరించబడ్డాయి. ఆలయ శైలికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచే జాలీ(రంధ్రాల పనితనం) డిజైన్లతో కూడిన హంసల వరుసలు, రాతి ద్వారబంధాలు ఎంతో ఆసక్తిగా ఉంటాయి. ప్రధాన ఆలయానికి ఎదురుగా రెండు వేర్వేరు చిన్న ఉప ఆలయాలు ఉన్నాయి. వీటిపై అత్యంత సూక్ష్మంగా చెక్కిన ద్వారపాలక విగ్రహాలు, అద్భుతమైన కపోతాలు, రాతి తెరలు దర్శనమిస్తాయి.
గొల్లల గుడి ఎత్తైన రాతి పీఠంపై నిర్మించారు. ఈ పీఠం అంతటా జంతువుల బొమ్మలు, నృత్య భంగిమలు, పూల డిజైన్లు చెక్కబడి ఉన్నాయి. ఆలయ అంతర్గత గోడల గూళ్లలో విష్ణువు, లక్ష్మీదేవి, గణపతి, మహిషాసురమర్దిని విగ్రహాలు చెక్కబడి భక్తులను, సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటాయి.
జాతీయ స్మారక చిహ్నంగా ప్రకటించిన నేపథ్యంలో ఈ ఆలయ సంరక్షణకు ఏఎస్ఐ సమగ్ర కార్యాచరణను రూపొందించింది. ఆలయ పైకప్పు మరమ్మతులు, వాటర్ప్రూఫింగ్ పనులు చేపడుతారు. చుట్టూ ఉన్న నేలను సమతలం చేయడం, దెబ్బతిన్న రాతి ఫ్లోరింగ్‌ను పునరుద్ధరించడంచేస్తారు. పర్యాటకులు, పరిశోధకులు సులభంగా రాకపోకలు సాగించేలా ప్రత్యేక మౌలిక వసతులు కల్పిస్తారు.
{{/usCountry}}జాతీయ స్మారక చిహ్నంగా ప్రకటించిన నేపథ్యంలో ఈ ఆలయ సంరక్షణకు ఏఎస్ఐ సమగ్ర కార్యాచరణను రూపొందించింది. ఆలయ పైకప్పు మరమ్మతులు, వాటర్ప్రూఫింగ్ పనులు చేపడుతారు. చుట్టూ ఉన్న నేలను సమతలం చేయడం, దెబ్బతిన్న రాతి ఫ్లోరింగ్‌ను పునరుద్ధరించడంచేస్తారు. పర్యాటకులు, పరిశోధకులు సులభంగా రాకపోకలు సాగించేలా ప్రత్యేక మౌలిక వసతులు కల్పిస్తారు.
{{/usCountry}}కాకతీయులు తెలుగు నేలకు అపూర్వమైన శిల్పకళను, సాగునీటి చెరువుల వ్యవస్థను అందించారు. నేటి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలతో పాటు కర్ణాటక, తమిళనాడు, ఒడిశాలోని కొన్ని భాగాలకు వీరి సామ్రాజ్యం విస్తరించింది. రామప్ప దేవాలయం సరసన ఇప్పుడు గొల్లల గుడికి కూడా జాతీయ గుర్తింపు లభించడంతో ములుగు జిల్లా పరిధిలోని పర్యాటక రంగానికి మరింత గుర్తింపు లభించనుంది. శతబ్దాల చరిత్రను తనలో దాచుకున్న గొల్లల గుడికి ఇప్పుడు జాతీయ ప్రాధాన్య కట్టడంగా గుర్తింపు వచ్చింది.