...
...
Next Story

తెలంగాణ కథలో అసలైన హీరో కేసీఆర్.. విలన్ కాంగ్రెస్ పార్టీ : దీక్షా దివస్ సభలో కేటీఆర్

కేసీఆర్ పార్టీ పెట్టి 14 ఏళ్లలో లక్ష్యాన్ని సాధించారని కేటీఆర్ అన్నారు. కేసీఆర్ దీక్ష ప్రారంభమైన రోజు తనకు ఇంకా గుర్తుందన్నారు. కరీంనగర్ అలుగునూరు వద్ద కారును పోలీసులు అడ్డుకున్న విషయాన్ని గుర్తుచేసుకున్నారు.

Published on: Nov 29, 2026, 19:30:59 IST
Advertisement

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అలుగునూరులో నిర్వహించిన దీక్షా దివస్ స్ఫూర్తి బహిరంగ సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడారు. అధికార కాంగ్రెస్, కేంద్రంలోని బీజేపీలను తీవ్ర స్థాయిలో విమర్శించారు. తెలంగాణ సాధన చరిత్రను గుర్తుచేస్తూనే, ప్రస్తుత పాలకుల తీరుపై నిప్పులు చెరిగారు. తెలంగాణ జాతికి కొత్త ఊపిరి పోసిన రోజు దీక్షా దివస్ అని, యాచించి కాదు.. శాసించి రాష్ట్రాన్ని సాధించుకున్నామని ఆయన స్పష్టం చేశారు.

దీక్షా దివస్ సభలో కేటీఆర్
దీక్షా దివస్ సభలో కేటీఆర్

రాష్ట్రంలో ప్రస్తుతం జై తెలంగాణ అని మనస్ఫూర్తిగా నినదించలేని బానిసలు పాలకులుగా ఉన్నారని కేటీఆర్ విమర్శించారు. నాడు 1956లో ఉన్న తెలంగాణను ఏపీలో కలిపిందే కాంగ్రెస్ పార్టీ అని, ఆ పార్టీతోపాటు టీడీపీ, బీజేపీల వల్లే రాష్ట్ర ఏర్పాటు 60 ఏళ్లు ఆలస్యమైందని ఆరోపించారు. గులాబీ జెండా ఎగరకపోతే నేడు తెలంగాణ కాంగ్రెస్, బీజేపీలు గానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి గానీ ఉండేవి కావన్నారు. 'తెలంగాణ కథలో హీరో కేసీఆర్ అయితే.. ముమ్మాటికీ విలన్ కాంగ్రెస్ పార్టీయే.' అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

కేసీఆర్‌పై ఉన్న కక్షతో ప్రస్తుత పాలకులు రాష్ట్ర జీవనాడి అయిన కాళేశ్వరం ప్రాజెక్టును దెబ్బతీస్తున్నారని, పాలమూరు ప్రాజెక్టుపై పగబట్టారని కేటీఆర్ మండిపడ్డారు. నేడు రాష్ట్రంలో నీళ్లు ఆంధ్రాకు, నిధులు ఢిల్లీకి తరలిపోతుంటే.. నియామకాలు గాలిలో కలిసిపోయాయని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీని తెలంగాణ యువత మళ్లీ నిలదీసి, కాంగ్రెస్‌ను గద్దె దించే రోజు దగ్గరలోనే ఉందన్నారు.

మరోవైపు ప్రధాని మోదీ సైతం కడుపులో విషం పెట్టుకుని తెలంగాణ ఏర్పాటును కించపరిచేలా మాట్లాడారని కేటీఆర్ అన్నారు. బీజేపీకి ఈ గడ్డపై ఏనాడూ ప్రేమ లేదని విమర్శించారు. ఢిల్లీకి గులాంలుగా ఉందామా లేక గులాబీలను పార్లమెంటుకు పంపుదామా ప్రజలు ఆలోచించాలని పిలుపునిచ్చారు.

2009 నవంబర్ 29న ఇదే కరీంనగర్ గడ్డపై ఒక అగ్నిపర్వతం బద్దలైందని, 'కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో' అనే నినాదం నిప్పురవ్వలా మారిందని కేటీఆర్ గుర్తుచేసుకున్నారు. అలుగునూరు వద్ద కేసీఆర్ కారును పోలీసులు అడ్డుకున్న దృశ్యం 17 ఏళ్ల తర్వాత కూడా కళ్లముందే కదలాడుతోందన్నారు. 11 రోజుల పాటు కేసీఆర్ చేసిన ఆమరణ నిరాహార దీక్షతో రాష్ట్రం అగ్నిగుండంగా మారిందని, శ్రీకాంత్ చారి ఆత్మబలిదానం ఉద్యమాన్ని మలుపు తిప్పిందని పేర్కొన్నారు. వైద్యులు బ్రెయిన్ డెడ్ అవుతుందని హెచ్చరించినా వెనక్కి తగ్గకుండా కేసీఆర్ మొండి పట్టుదలతో దీక్ష కొనసాగించబట్టే ఢిల్లీ పీఠం కదిలిందన్నారు. ఒక పద్మవ్యూహంలాంటి తెలంగాణ సాధనలో అర్జునుడిలా, కృష్ణుడిలా రథం నడిపింది, రణం చేసింది కేసీఆరేనని కేటీఆర్ స్పష్టం అన్నారు. ఉద్యోగులు, విద్యార్థులతో బీఆర్ఎస్‌కు ఉన్నది విడదీయలేని పేగుబంధమని ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.

 

ABOUT THE AUTHOR

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks