ఫోన్ ట్యాపింగ్ కేసులో శుక్రవారం విచారణకు హాజరుకావాలంటూ సిట్ ఇచ్చిన నోటీసులపై కేసీఆర్ స్పందించారు. విచారణను రీషెడ్యూల్ చేయాలని కోరారు. మున్సిపల్ ఎన్నికలు ఉన్నందున సమయం ఇవ్వాలని కోరారు. ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లోనే విచారించాలని… విచారణకు సహకరిస్తానని స్పష్టం చేశారు. ఈ మేరకు జూబ్లీహిల్స్ ఏసీపీకి లేఖ రాశారు.

“మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా సిట్ ముందుకు రాలేను. అభ్యర్థుల జాబితా ఖరారు చేసే పనిలో బిజీగా ఉన్నాను. విచారణ కోసం మీకు అనువుగా ఉన్న మరో తేదీని తెలుపగలరు” అని సిట్ కు రాసిన లేఖలో కేసీఆర్ పేర్కొన్నారు.
ప్రస్తుతం మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలకు నామినేషన్లు జరుగుతున్నాయి. 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు నామినేషన్లు దాఖలు చేయడానికి శుక్రవారం చివరి తేదీ. ఈ దృష్ట్యా, పార్టీ ప్రాతిపదికన ఎన్నికలు జరుగుతున్నందున చాలా మందికి భీఫారమ్ లు అందజేసే పనుల్లో ఉన్నాను" అని కేసీఆర్ తన లేఖ ద్వారా సమాచారం ఇచ్చారు.
మరోవైపు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లేఖపై సిట్ కూడా స్పందించింది. కేసీఆర్‌కు సమయం ఇవ్వాలని సిట్ నిర్ణయించింది. తదుపరి విచారణ తేదీని ప్రకటించే అవకాశం ఉంది.