TG Vehicle Registrations : ఈనెల 23 నుంచి వాహనాల రిజిస్ట్రేషన్‌ లో కొత్త విధానం - ఇక ఆ భారం లేనట్లే...!

Telangana Vehicle Registrations : రాష్ట్రంలో వాహనాల రిజిస్ట్రేషన్ లో కీలక మార్పులు రాబోతున్నాయి. ఈ నెల 23 నుంచి వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ కేంద్ర ప్రభుత్వ ‘వాహన్‌’ పోర్టల్ ద్వారా జరుగనుంది. ఫలితంగా పలు మార్పులు ఉంటాయని ప్రభుత్వం తెలిపింది.

Published on: Mar 17, 2026, 20:42:53 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రాష్ట్రంలో వాహనాల రిజిస్ట్రేషన్‌ విధానంలో కీలక మార్పులు రాబోతున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర రవాణా శాఖ పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్లు జరుగుతుండగా… ఇకపై కేంద్ర ప్రభుత్వ ‘వాహన్‌’ పోర్టల్‌ ద్వారా రిజిస్ట్రేషన్లు జరగనున్నాయి. రిజిస్ట్రేషన్ అయ్యే ప్రతి వాహనం కూడా వాహన్‌తో అనుసంధానమవుతుంది.

‘వాహన్‌’లో రిజిస్ట్రేషన్లు
‘వాహన్‌’లో రిజిస్ట్రేషన్లు

‘వాహన్‌’తో అనుసంధానం…

కేంద్ర ప్రభుత్వ ‘వాహన్’ పోర్టల్ తో అనుసంధానం చేయడం వల్ల రాష్ట్రంలోని వాహనాల వివరాలు జాతీయ డేటాబేస్ లోకి వెళ్తాయి. ఫలితంగా వాహనాలకు సంబంధించిన అన్ని సేవలు ఆన్ లైన్ లోనే అందుబాటులోకి వస్తాయి. ఈ నిర్ణయంతో వాహనదారులకు గతంలో ఉన్న ఇబ్బందులు తప్పే అవకాశం ఉంటుంది.

ప్రస్తుత విధానంతో వాహన యజమాని చిరునామా, పేరు మార్పు, వాహన RC డూప్లీకేట్‌ కాపీ వంటి సేవలు ఆన్ లైన్ లో అందుబాటులో లేవు. ఈ సేవల కోసం ఆర్టీఏ ఆఫీసులకు వెళ్లాల్సి ఉండేది. కానీ వాహన్ పోర్టల్ అనుసంధానం ద్వారా…. ఈ తరహా సేవలన్నీ ఇక ఆన్‌లైన్‌లోకి వస్తాయి. ఆర్టీఏ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా…. ఇంట్లో కూర్చుని ఆన్ లైన్ లో వాహనాలకు సంబంధించిన పనులను పూర్తి చేసుకునే వీలు ఉంటుంది. ఫలితంగా దళారుల ప్రమేయం లేకుండానే పనులన్నీ పూర్తి చేసుకోవచ్చు.

తప్పనున్న అదనపు ట్యాక్స్…!

జాతీయ పోర్టల్ వాహన్ తో అనుసంధానంతో వాహనదారులకు మరో ప్రయోజనం ఉండనుంది. రెండో వాహనం కొనుగోలుపై అదనపు ట్యాక్స్ ఉండదు. సాధారణంగా ఒక వ్యక్తికి ఓ వాహనం ఉన్న తర్వాత… మరో వాహనం కొనుగోలు చేస్తే 2 శాతం అదనపు ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. ఇలా అదనపు ట్సాక్స్ చెల్లించే వారి సంఖ్య ప్రతి ఏడాది ఎక్కువగానే ఉంటోంది. వాహన్ తో అనుసంధానమైతే…. ఈ ట్యాక్స్ జనరేట్ కాదు.

రవాణశాఖ గణాంకాల ప్రకారం….. తెలంగాణ రాష్ట్రంలో ఏటా సగటున 7 లక్షల కొత్త ద్విచక్రవాహనాలు, రెండున్నర లక్షలకుపైగా కార్లు కొనుగోళ్లు జరుగుతున్నాయి. వీటిల్లో 1.91 లక్షల వరకు రెండో వాహనాల కేటగిరి కిందనే ఉంటున్నారు. వీరంతా కూడా 2 శాతం అదనపు లైఫ్‌ ట్యాక్స్‌ చెల్లిస్తున్నారు. ఫలితంగా రవాణా శాఖకు ఏటా రూ.80 కోట్ల నుంచి రూ.100 కోట్ల ఆదాయం వస్తోంది. పలు సమస్యలను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం… ఈ తరహా ట్యాక్స్ ను ఎత్తివేయాలని భావిస్తూ వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి కూడా పలుమార్లు సమీక్షించి… అధికారులకు పలు సూచనలు కూడా చేశారు.

ఈ ట్యాక్స్ రద్దు చేయటానికి ప్రత్యేకంగా కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా జాతీయ డిజిటల్ ప్లాట్‌ఫామ్ “వాహన్”లో రెండో వాహనం గుర్తించే ప్రత్యేక ఆప్షన్ లేదు. ఇది కూడా ఇబ్బందిగా మారింది. పైగా ఇతర రాష్ట్రాల్లో ఈ తరహా పన్ను లేవని ప్రభుత్వానికి నివేదికలు అందాయి. వీటన్నింటిని విశ్లేషించిన ప్రభుత్వం…. ఈ పన్నును పూర్తిగా ఎత్తివేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అంటే వాహన్ తో అనుసంధానం వల్ల రెండో వాహనం కొనుగోలు చేసే వారికి ఖర్చు తగ్గడంతో పాటు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా కాస్త సులభమవుతుంది.

ఇప్పటికే రాష్ట్రంలో కొత్తగా వాహనాలు కొనుగోలు చేస్తున్నవారు డీలర్ షోరూమ్ వద్దనే రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకుంటున్నారు. గతంలో వాహన కొనుగోలుదారులు తాత్కాలిక రిజిస్ట్రేషన్‌ను(టీఆర్‌) డీలర్‌ వద్ద చేసుకునే వారు. శాశ్వత రిజిస్ట్రేషన్‌కు ఆర్టీఏ కార్యాలయాలకు వెళ్లాల్సి వచ్చేది. కానీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో…. ప్రస్తుతం షోరూమ్ డీలర్ల వద్దనే వాహన శాశ్వత రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తవుతుంది. కొత్తగా వాహనం కొన్న వాహనదారుడు రిజిస్టేషన్ కోసం రవాణా శాఖ కార్యాలయానికి వెళ్లనవసరం ఉండదు.

వాహనాన్ని విక్రయించిన డీలరే….. వాహన శాశ్వత రిజిస్ట్రేషన్‌ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేస్తారు. అవసరమైన పత్రాలను సమర్పిస్తారు. వీటిని పరిశీలించిన తర్వాత ఆర్టీవో కార్యాలయం నుంచి నెంబర్ కేటాయిస్తారు. అవసరమనుకుంటే రవాణా శాఖ అధికారులు డీలర్‌ వద్ద షోరూంలోనే వాహనాన్ని తనిఖీ చేసే అవకాశం ఉంటుంది.

రవాణా శాఖలో తీసుకువస్తున్న కొత్త సంస్కరణల అమలు నేపథ్యంలో ఆర్టీవో కార్యాలయాల్లో స్లాట్‌ బుకింగ్‌, క్యూ లైన్‌లో వెయిటింగ్‌, కార్డు కోసం తిప్పలు తప్పినట్లు అయింది. ఈ నిర్ణయంపై వాహనదారులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. వాహన్ ద్వారా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ అందుబాటులోకి వస్తే…. చాలా సేవలు ఆన్ లైన్ లో ఉంటాయి.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More