ప్రాణం తీసిన పెన్సిల్.. పరిగెడుతూ జారిపడి గొంతులో గుచ్చుకుని బాలుడు మృతి!

ఖమ్మం జిల్లాలో దారుణమైన ఘటన జరిగింది. ఆరేళ్ల విద్యార్థికి గొంతులో పెన్సిల్ గుచ్చుకుని ప్రాణాలు కోల్పోయాడు.

Published on: Dec 24, 2025 10:02 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నాయకన్ గూడెంలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో బుధవారం జరిగిన ప్రమాదంలో ఆరేళ్ల యూకేజీ విద్యార్థి పెన్సిల్ గుచ్చుకుని మరణించాడు. ఈ ఘటనలో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి. రోజూలాగే విహార్ అనే విద్యార్థి జేబులో పెన్సిల్ పెట్టుకున్నాడు. కానీ అదే అతడి ప్రాణాలు తీసింది. పూర్తి వివరాళ్లోకి వెళ్తే..

పెన్సిల్ గుచ్చుకుని బాలుడు మృతి (Unsplash)
పెన్సిల్ గుచ్చుకుని బాలుడు మృతి (Unsplash)

ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నాయకన్ గూడెంలోని ఒక ప్రైవేట్ పాఠశాలలో విహార్ యూకేజీ చదువుతున్నాడు. రోజూలాగే పాఠశాలకు తాను రాసుకునే పెన్సిల్ తీసుకెళ్లాడు. చొక్కా జేబులో పెట్టుకున్నాడు. బాలుడు మధ్యాహ్నం విరామ సమయంలో టాయిలెట్ వెళ్లాడు. తర్వాత తన తరగతి గదికి తిరిగి పరిగెడుతుండగా.. జారి కిందపడిపోయాడు.

అదే సమయంలో జేబులో ఉన్న పెన్సిల్ ప్రమాదవశాత్తు విహార్ గొంతులో గుచ్చుకుంది. దీని వలన తీవ్ర రక్తస్రావం జరిగింది. పాఠశాల సిబ్బంది, చుట్టుపక్కలవారు వెంటనే విహార్‌ను 108 అత్యవసర వాహనం ద్వారా కుసుమంచి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి చేరుకునేలోపే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.

ఈ ఆకస్మిక మరణం విహార్ కుటుంబాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. పాఠశాలలో విషాదఛాయలు అలుముకున్నాయి. కళ్ల ముందే తిరిగిన బాబు కనిపించని లోకాలకు వెళ్లడంపై తల్లిదండ్రులు, బంధువులను ఓదార్చలేని స్థితి నెలకొంది. నాయకన్ గూడెం గ్రామం మొత్తం దుఃఖంలో మునిగిపోయింది.

చలాన్ లింక్‌‌తో 6 లక్షలు మాయం

ఓ వ్యక్తి తన ఫోన్‌కు టెక్స్ట్ మెసేజ్ ద్వారా వచ్చిన ట్రాఫిక్ చలాన్ లింక్‌ను ఓపెన్ చేశాడు. రూ.500 జరిమానా చెల్లించడానికి ప్రయత్నించి సైబర్ నేరగాళ్ల చేతిలో రూ.6 లక్షలు పోగొట్టుకున్నాడని హైదరాబాద్ సీపీ సజ్జనార్ వెల్లడించాడు. నిజానికి బాధితుడికి ట్రాఫిక్ ఉల్లంఘన చేశారని వాహనంపై రూ. 500 జరిమానా విధించినట్లు సందేశం వచ్చింది. ఆ సందేశంలో ఒక లింక్ ఉంది. దాన్ని బాధితుడు క్లిక్ చేయగానే చలాన్ చెల్లించమని ఒక వెబ్‌సైట్‌కు వెళ్లింది లింక్. అయితే అది కూడా పోలీస్ అధికారిక పోర్టల్‌లాగే ఉంది. బాధితుడు నిజమేనని నమ్మేశాడు.

బాధితుడు కొన్ని అంకెలను టైప్ చేయడం ద్వారా చలాన్ మొత్తాన్ని చెల్లించడానికి ప్రయత్నించాడు. దీంతో దాదాపు రూ. 6 లక్షలు పోగొట్టుకున్నాడు. మోసగాళ్ళు అతని ఫోన్‌ను హ్యాక్ చేసి అనధికార లావాదేవీలు జరిపారు అని సీపీ సజ్జనార్ వెల్లడించారు. ఇలాంటి మోసాలకు బలైపోవద్దని, చలాన్లు చెల్లించమని అడుగుతూ టెక్స్ట్ సందేశం, ఇమెయిల్‌లు లేదా వాట్సాప్ ద్వారా వచ్చే సందేశాలను నమ్మవద్దని కోరారు. సైబర్ మోసాలకు గురైతే 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More