Konda Surekha Political Career : ఎంపీపీ నుంచి మంత్రి వరకు..! ఎన్నో మలుపులు... మరెన్నో అవకాశాలు!
Konda Surekha Political Career : ఎంపీపీగా ప్రస్థానం ప్రారంభించి…. మంత్రి స్థాయికి ఎదిగిన కొండా సురేఖ సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఎన్నో మలుపులు చోటు చేసుకున్నాయి. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో పార్టీలు మారుతూ వచ్చినప్పటికీ… వారి ప్రాబల్యాన్ని కొనసాగిస్తూనే ముందుకు సాగారు.
Konda Surekha Political Career : ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో కొండా కుటుంబం వ్యవహారశైలి, వారి రాజకీయ వ్యూహాలు ఎల్లప్పుడూ తీవ్ర చర్చకు దారితీస్తుంటాయి. స్థానిక సంస్థల స్థాయి నుంచి ఆరంభమైన కొండా సురేఖ రాజకీయ ప్రయాణం రాష్ట్ర కేబినెట్ హోదా వరకు సాగగా…. ఆమె భర్త కొండా మురళి తనదైన శైలిలో క్షేత్రస్థాయి రాజకీయాలను శాసిస్తూ వచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి నేటి తెలంగాణ వరకు అనేక రాజకీయనాయకులకు భిన్నంగా, సొంత వర్గాన్ని కాపాడుకుంటూ ఈ దంపతులు ముందుకు సాగారు. కొండా మురళి స్థానిక సంస్థల నుంచి రెండుసార్లు ఎమ్మెల్సీగా బాధ్యతలు నిర్వర్తించి…. జిల్లా రాజకీయాల్లో తనకంటూ బలమైన ముద్ర వేసుకున్నారు.

ఎంపీపీగా ప్రస్థానం….
స్థానిక సంస్థల ప్రతినిధిగా రాజకీయాల్లోకి వచ్చిన కొండా సురేఖ…. గీసుకొండ మండల పరిషత్ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించి తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా ఎదుగుతూ ఎమ్మెల్యేగా, ఉమ్మడి ఏపీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. అయితే వైఎస్ఆర్ అకాల మరణం తర్వాత చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలతో ఆమె తన మంత్రి పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ బయటకు వచ్చారు.
రాజకీయ జీవితాన్ని ప్రసాదించిన వైఎస్ఆర్ అంటే కొండా కుటంబానికి ఎంతో అభిమానం. ఆ అభిమానంతోనే కాంగ్రెస్ నుంచి బయటికి వచ్చిన సురేఖ…. జగన్ స్థాపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే పదవి రాజనామా చేశారు. అంతేకాదు తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున్న సాగుతున్న సమయంలో పరకాల అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికలో పోటీ చేసి రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించారు. ఆ ఉపఎన్నికలో ఎదురైన స్వల్ప ఓటమి అనంతరం….. ఆమె టీఆర్ఎస్(ప్రస్తుతం బీఆర్ఎస్) పార్టీలో చేరారు. 2014 ఎన్నికల్లో వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి భారీ మెజారిటీతో విజయం సాధించి శాసనసభలో అడుగుపెట్టారు.
కాలక్రమంలో బీఆర్ఎస్ అధిష్టానంతో తీవ్ర విభేదాలు రావడంతో…. 2018 ఎన్నికలకు ముందు ఆమె తిరిగి సొంత గూడైన కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2023 శాసనసభ ఎన్నికల్లో వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. అంతేకాకుండా రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వంలో అటవీ, దేవాదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు దక్కించుకున్నారు.
అయితే కొద్దిరోజులుగా ఆమె కుమార్తె కొండా సుష్మితా పార్టీ నాయకత్వం, ముఖ్యమంత్రి, ఇతర నేతలపై చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర వివాదాస్పదంగా మారాయి. కుటుంబ సభ్యుల రాజకీయ జోక్యం, పార్టీ క్రమశిక్షణా రాహిత్యానికి దారితీసిందన్న కారణంతో కాంగ్రెస్ అధిష్టానం ఆమె విషయంలో తీవ్ర నిర్ణయం తీసుకుంది. పరిణామాల తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం ఆమెను మంత్రివర్గం నుంచి తక్షణమే తొలగించింది.
కొండా సురేఖ రాజకీయ ప్రస్థానం….
1995 : గీసుకొండ మండల పరిషత్తు అధ్యక్షురాలిగా (MPP) ఎన్నిక
1996 : పీసీసీ (PCC) సభ్యురాలిగా బాధ్యతలు నిర్వర్తించారు.
1999 : శాయంపేట నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టారు.
2004 : శాయంపేట నుంచి రెండోసారి శాసనసభ్యురాలిగా ఎన్నికయ్యారు.
2009 : పరకాల ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కేబినెట్ లో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు
2014 : బీఆర్ఎస్‌లో చేరటంతో వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.
2018 : బీఆర్ఎస్ పార్టీని విబేధించి…. తిరిగి కాంగ్రెస్‌లో చేరారు. పరకాలలో పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
2023 : వరంగల్ తూర్పు నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. రేవంత్ రెడ్డి కేబినెట్ లో డిసెంబర్ 7న అటవీ, దేవాదాయ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం
2026 సెప్టెంబర్ 3 : తెలంగాణ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయ్యారు.
ఇక కొండా సురేఖ భర్తీ కొండా మురళి వంచనగిరి గ్రామ సర్పంచ్ గా 1987 లో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. అంతేకాకుండా రెండుసార్లు ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.
సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కొండా సురేఖ…. 2026 సెప్టెంబర్ 3న అనూహ్య పరిణామాల నడుమ తెలంగాణ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ కావటం సంచలనంగా మారింది. స్థానిక సంస్థల ప్రతినిధి నుంచి రాష్ట్ర మంత్రి వరకు ఆమె సాగించిన ప్రయాణం… తర్వాత రోజుల్లో ఎలా ఉంటుందనే దానిపై ఆసక్తి నెలకొంది. అధినాయకత్వం ఆమెపై వేటు నేపథ్యంలో… కొండా కుటుంబం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది కూడా టాక్ ఆఫ్ ది పాలిటిక్స్ గా మారింది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

