...
...
Next Story

జిల్లా పరిషత్ ఎన్నికలకు సిద్ధమవ్వండి - పార్టీ నేతలకు కేటీఆర్ పిలుపు

ప్రజా బలంతో పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తిరుగులేని విజయం సాధించిందని కేటీఆర్ అన్నారు. పార్టీంతా కూడా జిల్లా పరిషత్ ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఆ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ సత్తా చాటాలని…. భువనగిరి కోటపై గులాబీ జెండా ఎగరాలన్నారు.

Published on: Dec 18, 2025, 18:53:58 IST
Advertisement

బీఆర్ఎస్ పార్టీకి పూర్వవైభవం ప్రారంభమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో సాధించబోయే అఖండ విజయాలకు యాదాద్రి భువనగిరి జిల్లా గడ్డ పునాది వేసిందన్నారు. జిల్లా పార్టీ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యుల అభినందన సభలో పాల్గొన్న ఆయన… కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ కార్యకర్తల్లో నూతనోత్సాహాన్ని నింపారు.

కేటీఆర్
కేటీఆర్

రెండేళ్ల కిందట అసెంబ్లీ ఎన్నికల్లో కొద్దిపాటి ఓట్ల తేడాతో నిరాశ ఎదురైందని కేటీఆర్ గుర్తు చేశారు. కానీ నేడు భువనగిరిలో 56 మంది, ఆలేరులో 74 మంది, మునుగోడులో 15 మంది, తుంగతుర్తిలో 9 మంది, నకిరేకల్‌లో 7 మంది.. ఇలా జిల్లా వ్యాప్తంగా మొత్తం 161 మంది సర్పంచులను గెలిపించుకోవడం సామాన్య విషయం కాదని ఆయన కొనియాడారు. ఈ విజయం రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులకు వెయ్యి ఏనుగుల బలాన్ని ఇచ్చిందని…. లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులతో గులాబీ జెండా మళ్లీ రెపరెపలాడుతుందని ధీమా వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయం అత్యంత గలీజుగా మారిందని కేటీఆర్ మండిపడ్డారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ కార్యకర్తలపై జరుగుతున్న దాడులను ఆయన తీవ్రంగా ఖండించారు. నూతనకల్ మండలంలో మల్లయ్య యాదవ్‌ను కిరాతకంగా చంపడం, నల్గొండలో అభ్యర్థిపై దాడి చేసి అమానవీయంగా మూత్రం తాగించి అవమానించడం వంటి ఘటనలు కాంగ్రెస్ నాయకుల వికృత మనస్తత్వానికి నిదర్శనమని ధ్వజమెత్తారు.

పదేళ్ల పాలనలో కేసీఆర్ ఎప్పుడూ ఇలాంటి చిల్లర రాజకీయాలకు తావివ్వలేదని గుర్తు చేశారు. అధికారులు కూడా అధికార పక్షానికి కొమ్ముకాస్తూ, గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్థులను దొంగతనంగా ఓడించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. 150కి పైగా గ్రామాల్లో జరుగుతున్న ఈ అన్యాయంపై కోర్టుల ద్వారా న్యాయపోరాటం చేస్తామని హెచ్చరించారు.

ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఆగ్రహం…

తులం బంగారం ఇస్తామని, పింఛన్లు పెంచుతామని లంగ మాటలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, ఇప్పుడు రైతుబంధు రాక రైతులు అల్లాడుతున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. వచ్చే జిల్లా పరిషత్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటాలని, భువనగిరి కోటపై గులాబీ జెండా ఎగరాలని పిలుపునిచ్చారు. సర్పంచులు, ఎంపీటీసీలు సమన్వయంతో పనిచేయాలని…. పార్టీ బీ-ఫామ్ మీద జరిగే ఈ ఎన్నికల్లో కారు గుర్తుకు తిరుగులేని విజయం అందించాలని కోరారు.

ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు ఎవరి అత్త సొమ్ము కాదని, అవి రాజ్యాంగబద్ధంగా ప్రజలకు అందాల్సిన హక్కులని కేటీఆర్ స్పష్టం చేశారు. ఏ ఎమ్మెల్యే వాటిని ఆపలేడని భరోసా ఇచ్చారు. గత పదేళ్లలో కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ, ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లా సాధించిన అభివృద్ధిని కేటీఆర్ వివరించారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks