నదీ జలాలపై అవగాహన లేని సీఎం మాకు ఉపన్యాసాలు ఇస్తారా..? కేటీఆర్

అసెంబ్లీలో బీఆర్ఎస్ కు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. నదీ జలాలపై అవగాహన లేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాకు ఉపన్యాసాలు ఇస్తారా..? అని ప్రశ్నించారు. 2 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఎకరానికైనా అదనంగా నీళ్లు అందించిందా..? అని నిలదీశారు.

Published on: Jan 1, 2026, 18:24:20 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

శాసనసభలో ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలనుకుంటే, ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్‌ఎస్‌కు కూడా అదే అవకాశం కల్పించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్‌లో ఈరోజు మీడియాతో మాట్లాడిన కేటీఆర్…. సభలోకి అడుగుపెట్టిన తర్వాత ముఖ్యమంత్రి, సాధారణ సభ్యుడు అనే తేడా ఉండదన్నారు. 120 మంది శాసనసభ్యులకు సమాన హక్కులు ఉంటాయని స్పష్టం చేశారు.

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

మాకు కూడా అవకాశం ఇవ్వండి - కేటీఆర్

“మేము అడిగింది చాలా సింపుల్, “మీరు మీ వెర్షన్ చెప్పండి, మేము మా వెర్షన్ చెబుతాం. మాకు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌కు అవకాశం ఇవ్వండి అని మాత్రమే కోరుతున్నాం. మేము ప్రధాన ప్రతిపక్షం. గత పదేళ్లలో తెలంగాణ వ్యవసాయాన్ని, సాగునీటిని ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్లామో సభలో వివరించేందుకు సిద్ధంగా ఉన్నాం” అని కేటీఆర్ తెలిపారు.

గతంలో 2016 మార్చి 31న కేసీఆర్ శాసనసభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ దాన్ని బాయ్‌కాట్ చేసిందని కేటీఆర్ గుర్తు చేశారు. ఇది పార్లమెంటరీ సంప్రదాయాలకు విరుద్ధమని విమర్శించిన విషయాన్ని చెప్పారు. “అప్పుడు తప్పు అన్న కాంగ్రెస్ పార్టీకి, ఈరోజు అదే పద్ధతి సరైనదిగా ఎలా మారింది?” అని కేటీఆర్ ప్రశ్నించారు. ఈ అంశంపై స్పీకర్ కి లేఖ కూడా ఇచ్చామని… వారు ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూస్తామని తెలిపారు.

నదీ జలాలపై, సాగునీటి అంశాలపై కనీస అవగాహన లేని ముఖ్యమంత్రి మాకు శాసనసభలో ఉపన్యాసాలు ఇవ్వబోతున్నారంటూ కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు. స్వాతంత్య్ర దినోత్సవం నాడు భాక్రా నంగల్ ప్రాజెక్ట్‌ను తెలంగాణలో ఉన్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారని…. అసలు ఆ ప్రాజెక్ట్ హిమాచల్ ప్రదేశ్‌లో ఉందన్న విషయం కూడా తెలియని స్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. దేవాదుల ప్రాజెక్ట్ ఏ నదీ బేసిన్‌లో ఉందో కూడా తెలియని ముఖ్యమంత్రితో గోదావరి–కృష్ణా జలాలపై ఈరోజు చర్చ చేయాలా….? అని ప్రశ్నించారు.

శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ సొరంగం కూలి ఎనిమిది మంది కార్మికులు మరణించిన ఘటనలో ఇప్పటివరకు వారి మృతదేహాలను కూడా వెలికి తీయలేని అసమర్థ ప్రభుత్వం ఇది అని కేటీఆర్ మండిపడ్డారు. సుంకిశాల ప్రాజెక్ట్ పూర్తిగా కూలిపోయినా, ఇప్పటివరకు సరైన సమాధానం చెప్పలేని దుస్థితి ఉందన్నారు. ఆ ఘటనకు బాధ్యులైన ఇంజనీరింగ్ సంస్థను బ్లాక్‌లిస్ట్ చేయాలని హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ సిఫార్సు చేసినప్పటికీ…. ఆ సంస్థపై చర్యలు తీసుకోలేని స్థాయిలో ప్రభుత్వం చేతకానితనాన్ని ప్రదర్శిస్తోందని విమర్శించారు. వట్టెం పంప్ హౌస్ మునిగిపోతుంటే చేతులు కట్టుకుని చూస్తూ నిలిచిపోయిన ప్రభుత్వం ఇది అని కేటీఆర్ ఆరోపించారు.

“మేము మీ దగ్గర ఏం నేర్చుకోవాలి? చెక్‌డ్యాంలు ఎలా ఫెయిల్ చేయాలో నేర్పిస్తారా? మేడిగడ్డ ఎలా పేల్చామో చెబుతారా? సుంకిశాల ఎలా కూల్చామో వివరిస్తారా? వట్టెం పంప్ హౌస్ ఎలా ముంచామో చూపిస్తారా? లేక కృష్ణా నదిలో తెలంగాణకు ఉన్న హక్కులన్నింటినీ కేఆర్ఎంబీకి ఎలా ధారాదత్తం చేశారో పవర్ పాయింట్‌లో చూపిస్తారా?” అంటూ కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం గత రెండేళ్లుగా పూర్తిగా పక్కన పెట్టిందని కేటీఆర్ ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తరచూ “పండబెట్టి తొక్కుతాం” అంటారని, నిజంగానే ఆ పథకాన్ని పండుకోబెట్టి, తెలంగాణ రైతాంగాన్ని – ముఖ్యంగా పాలమూరు రైతాంగాన్ని తొక్కుతున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More