...
...
Next Story

ఆధునిక రోవర్స్‌తో భూ కొలతలు.. క్షేత్రస్థాయిలో లైసెన్స్‌డ్‌ సర్వేయర్లు : మంత్రి పొంగులేటి

భూ కొలతలు కచ్చితమైన, పారదర్శకంగా ఉండేలా లైసెన్స్ పొందిన సర్వేయర్లను నేరుగా క్షేత్ర స్థాయికి తీసుకువస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. ఇది భూ పరిపాలన వ్యవస్థలో ఒక పెద్ద మార్పును సూచిస్తుందన్నారు.

Published on: Jan 25, 2026, 22:13:25 IST
Advertisement

భూములకు సంబంధించి ప్రతి అంగుళాన్నిడిజిటలైజ్ చేసి, యజమానులకు శాశ్వత యాజమాన్య భద్రత కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వం ధరణి ద్వారా సృష్టించిన చిక్కుముడులను విప్పుతూ రైతులకు చుట్టంలా ఉండేలా భూభారతి చట్టాన్ని అమలులోకి తెచ్చామన్నారు. ఖమ్మం కలెక్టరేట్‌(ఐడీఓసీ)లో శిక్షణ పూర్తి చేసుకున్న లైసెన్స్‌డ్‌ సర్వేయర్లకు లైసెన్స్‌లను అందజేశారు మంత్రి.

మంత్రి పొంగులేటి
మంత్రి పొంగులేటి

భూ సర్వే కోసం గతంలోని టేపులు, గొలుసుల పద్ధతులకు స్వస్తి పలికి, సెంటీమీటర్ల తేడాతో ఖచ్చితత్వం వచ్చేలా రోవర్స్ సాంకేతికతను వాడుతున్నామన్నారు మంత్రి పొంగులేటి. ఇప్పటికే 600 రోవర్లను కొనుగోలు చేసి జిల్లాలకు పంపిణీ చేశామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా శిక్షణ పొందిన 5,500 మంది లైసెన్స్‌డ్‌ సర్వేయర్లను మండలాల వారీగా భూ విస్తీర్ణం ప్రాతిపదికన కేటాయించామని చెప్పారు. ఖమ్మం జిల్లాలో రెండో విడతలో అర్హత సాధించిన 47 మందికి ఈరోజు నియామక పత్రాలు అందజేసినట్టుగా వెల్లడించారు.

'గత పాలకులు తెచ్చిన ధరణిలో జరిగిన లోపాలపై ఇప్పటికే సిరిసిల్ల, సిద్ధిపేట జిల్లాల్లో ఫోరెన్సిక్ ఆడిట్ పూర్తి చేశాం, ఆ నివేదికలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా మిగిలిన 31 జిల్లాల్లోనూ ఆడిట్ నిర్వహిస్తాం. రిజిస్ట్రేషన్ల విషయంలో ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శల్లో వాస్తవం లేదు, భూభారతిపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. గత పాలనలో తెచ్చిన ధరణి లొసుగుల వల్లే ఈ రోజు ప్రభుత్వానికి రావాల్సిన సొమ్ము పక్కదారి పట్టింది. ధరణి లొసుగులను ఆసరాగా చేసుకుని అక్రమాలకు పాల్పడిన వారిని ఎట్టి పరిస్థితులలో ఉపేక్షించేది లేదు. ఎంతటి వారైనా విడిచిపెట్టం క్రిమినల్ కేసులు పెట్టి చట్ట పరంగా శిక్షిస్తాం.' అని మంత్రి పొంగులేటి వెల్లడించారు.

​ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ , ఖమ్మం మున్సిపల్ కమిషనర్, వైరా ఎమ్మెల్యే , గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

నాంపల్లి మృతుల కుటుంబాలకు పరిహారం

హైదరాబాద్‌ నాంపల్లి అగ్నిప్రమాద ఘటనపై మంత్రి పొంగులేటి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విదేశీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధితులకు అండగా ఉండాలని ఆదేశించారన్నారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ప్రభుత్వం ఆర్థిక సాయం అందజేస్తుందని భరోసా ఇచ్చారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks