ఈసారి ఎక్కువగానే అక్రిడిటేషన్ల కార్డులు మంజూరు చేస్తాం - మంత్రి పొంగులేటి
అక్రిడిటేషన్ కార్డులు తగ్గుతాయనే ప్రచారం వాస్తవం కాదని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. గతంలో కంటే ఎక్కువగానే అక్రిడిటేషన్ల మంజూరు చేస్తామన్నారు. జీవో 252లో మార్పులు చేర్పులు చేస్తామని వివరించారు.
జర్నలిజం గౌరవాన్ని నిలబెట్టి ఆ వృత్తికి వన్నెతెచ్చే జర్నలిస్టులందరికీ రాష్ట్ర ప్రభుత్వం అన్నివిధాలా అండదండగా ఉంటుందని రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఏ ఒక్కరి గౌరవాన్ని తగ్గించాలని గాని, చిన్నబుచ్చాలని గాని తమ ప్రభుత్వ ఉద్దేశ్యం కాదని స్పష్టం చేశారు.

జీవోలో మార్పులు చేస్తాం - మంత్రి పొంగులేటి
జీవో 252 పై శనివారం నాడు సచివాలయంలోని తన కార్యాలయంలో 14 జర్నలిస్టు సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ… సమావేశంలో జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు విలువైన సూచనలు, సలహాలు ఇచ్చారని వారు ప్రస్తావించిన అంశాలను విజ్ఞప్తులను పరిశీలించి సానుకూలమైన నిర్ణయం తీసుకుంటామన్నారు. జీవో 252లో మార్పులు చేర్పులు చేస్తామని హామీ ఇచ్చారు.
ఈసారి ఎక్కువగానే కార్డులు …
అక్రిడిటేషన్ కార్డులు తగ్గుతాయని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేశారు. గతంలో ఉన్న సుమారు 23వేల అక్రిడిటేషన్ కార్డుల సంఖ్య కంటే ఈ సారి ఇచ్చే కార్డుల సంఖ్య ఎక్కువ ఉంటుందని వెల్లడించారు. అక్రిడిటేషన్ కార్డుల జారీలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం మొదటివరుసలో ఉందని అన్నారు. అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు ఇవ్వాలనే సదుద్దేశంతో శాస్త్రీయ పద్దతిలో అధ్యయనం చేయడం జరిగిందని పలుమార్లు సమావేశాలు నిర్వహించామని వివరించారు. దేశ వ్యాప్తంగా ఉన్ననియమ నిబంధనలను పరిశీలించడం జరిగిందని ఫలితంగా కొత్త కార్డుల మంజూరులో కొంత జాప్యం జరిగిందని అన్నారు.
మీడియా కార్డుకు, అక్రిడిటేషన్ కార్డుకు ఎలాంటి వ్యత్యాసం లేదని అక్రిడిటేషన్ కార్డుదారులకు ప్రభుత్వ పరంగా అందే ప్రతి ప్రయోజనం మీడియా కార్డుదారులకు కూడా అందుతాయని ఇందులో ఎలాంటి అనుమానాలకు తావులేదని మరోమారు స్పష్టం చేశారు.
తాము అక్రిడిటేషన్ కార్డుల మంజూరు విషయంలో ఎటువంటి భేషజాలకు పోవడం లేదని కానీ ఈ వ్యవస్ధను గాడిలో పెట్టేందుకు గాను ప్రభుత్వ పరంగా సర్క్యులేషన్, ఇతర సంబంధిత వివరాలను ఖచ్చితంగా సేకరిస్తామని చెప్పారు. ఛార్టెడ్ అకౌంటెంట్ సర్టిఫికేట్ల పరిశీలన కూడా చేస్తామని దీనివలన అసలైన పత్రికలు, పాత్రికేయలకు న్యాయం జరుగుతుందని అన్నారు.
రాష్ట్రంలో మండలానికో విలేకరి ప్రాతిపదికన గాక జనాభా వారీగా అక్రిడిటేషన్‌లు మంజూరు చేస్తే ఎలా ఉంటుందన్న విషయంలో కూడా ఆలోచిస్తామని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు. దీనిపై పాత్రికేయ సంఘాలు స్పందించాలని అన్నారు. అక్రిడిటేషన్ కమిటీలలో ఉర్ధూ జర్నలిస్టులకు అవకాశం కల్పిస్తామని క్రీడా, సాంస్కృతిక, క్రైమ్, కేబుల్ టీవీ తదితర విభాగాల పాత్రికేయులకు అక్రిడిటేషన్ సౌకర్యం తప్పక ఉంటుందని స్పష్టం చేశారు. మహిళా జర్నలిస్టుల విజ్ఞప్తి మేరకు అక్రిడిటేషన్ కార్డుల జారీలో ప్రత్యేక కోటా కేటాయిస్తామని హామీ ఇచ్చారు.
దేశంలోని తొలిసారిగా తెలంగాణ రాష్ట్రంలోనే డిజిటల్ మీడియా కార్డులు మంజూరు చేశామని తెలియజేశారు. సమావేశంలో పలువురు పాత్రికేయ సంఘాల ప్రతినిధులు ఇండ్ల స్ధలాలు, పెన్షన్, బస్‌పాసులు, పాత్రికేయులకు బీమా తదితర అంశాలను ప్రస్తావించగా మంత్రి పొంగులేటి గారు సావధానంగా వారికి సమాధానమిచ్చారు.
జర్నలిస్టులకు ఇండ్ల స్ధలాల అంశంపై కొంతమంది ప్రతినిధులు అడిగిన ప్రశ్నలపై మంత్రిగారు స్పందిస్తూ.. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న జర్నలిస్టులకు ఇండ్ల స్ధలాల అంశాన్ని పరిష్కరించి జవహర్ లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీకి భూమిని అప్పగించడం జరిగిందన్నారు. ఆ తర్వాత సుప్రీంకోర్టు ఈ అంశాన్ని కొట్టివేయడంతో సమస్య మొదటికి వచ్చిందని అయినా కూడా ఇండ్ల స్ధలాల విషయంలో తమ ప్రభుత్వం ఎప్పుడూ సానుకూలంగా ఉంటుందని అన్నారు.ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచన మేరకు ఎటువంటి కోర్టు అడ్డంకులు లేని విధానాన్ని రూపొందిస్తామని తెలిపారు
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

