పెరోల్ మీద బయటకు వచ్చి, జైలు అధికారుల కళ్లు గప్పి ఏకంగా నాలుగు దశాబ్దాల పాటు సమాజంలో స్వేచ్ఛగా జీవించాడు. అంతేకాకుండా…. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం సాధించి, ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొంది, ప్రశాంతంగా రిటైర్ అయిన ఒక హత్య కేసు దోషి ఉదంతం తెలంగాణలో తీవ్ర కలకలం రేపింది. ఈ వ్యవహారంపై విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు జైలు అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు…. దోషి భార్య దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ సంచలన తీర్పునిచ్చింది.
కేసు వివరాలు ఇలా…..

కేసు రికార్డుల ప్రకారం... మహబూబాబాద్ జిల్లా పరిధిలోని దంపతాలపల్లికి చెందిన వీరన్న 1983లో ఓ హత్య కేసులో కోర్టు జీవిత ఖైదు విధించింది. జైలులో ఉన్న ఆయనకు 1983 డిసెంబర్ 17న 30 రోజుల పాటు అధికారులు పెరోల్ మంజూరు చేశారు. ఆ తర్వాత ఆ వ్యవధిని 1984 మార్చి 17 వరకు పొడిగించారు. నియమం ప్రకారం ఆయన 1984 మార్చి 18న తిరిగి జైలులో లొంగిపోవాల్సి ఉంది. కానీ ఆయన జైలు ముఖం చూడకుండా పరారయ్యాడు.
అలా పారిపోయిన దోషి, ప్రభుత్వ వ్యవస్థల్లోని లోపాలను ఆసరాగా చేసుకుని ఏకంగా ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగం సంపాదించాడు. 2004లో 'ఉత్తమ ఉపాధ్యాయుడి'గా పురస్కారం కూడా అందుకున్నాడు. 2013లో సర్వీస్ పూర్తి చేసుకుని గౌరవప్రదంగా రిటైర్ కూడా అయ్యాడు. దాదాపు 40 ఏళ్ల పాటు పోలీసుల కన్నుగప్పి తిరిగిన ఈ 73 ఏళ్ల వయోవృద్ధుడిని 2024 మే 16న ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఎట్టకేలకు పట్టుకుని జైలుకు తరలించారు.
పెరోల్ నిబంధనలు ఉల్లంఘించినందుకు గానూ అధికారులు ఆయనకు లభించిన 27 రోజుల రిమిషన్‌ను రద్దు చేయడంతో పాటు, మూడేళ్ల పాటు పెరోల్ పొందే అర్హత లేకుండా చర్యలు తీసుకున్నారు. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ…. తన భర్త వయోభారంతో అనారోగ్యంతో బాధపడుతున్నారని, పెరోల్ మంజూరు చేయాలని కోరుతూ ఆయన భార్య తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. 40 ఏళ్ల సుదీర్ఘ కాలం తర్వాత జైలు అధికారులు చర్యలు తీసుకోవడం సరికాదని వాదించింది.
ఈ పిటిషన్‌పై జస్టిస్ టి. మాధవీదేవి విచారణ జరిపారు. ప్రభుత్వ తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ... పెరోల్ అనేది ఖైదీల ప్రాథమిక హక్కు కాదని, నిబంధనలు ఉల్లంఘించినందునే జైలు నిబంధనల ప్రకారం శిక్ష విధించామని కోర్టుకు తెలిపారు.
{{/usCountry}}ఈ పిటిషన్‌పై జస్టిస్ టి. మాధవీదేవి విచారణ జరిపారు. ప్రభుత్వ తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ... పెరోల్ అనేది ఖైదీల ప్రాథమిక హక్కు కాదని, నిబంధనలు ఉల్లంఘించినందునే జైలు నిబంధనల ప్రకారం శిక్ష విధించామని కోర్టుకు తెలిపారు.
{{/usCountry}}ఇరువైపులా వాదనలు విన్న జస్టిస్ టి. మాధవీదేవి పిటిషన్‌ను కొట్టివేశారు. "పెరోల్‌పై వెళ్లిన ఒక ఖైదీ 40 ఏళ్ల పాటు అధికారుల కంటికి కనిపించకుండా ఉంటూ… ప్రభుత్వ ఉద్యోగం సాధించి రిటైర్‌మెంట్ వరకు అభ్యంతరం లేకుండా పనిచేయడం జైలు అధికారుల పర్యవేక్షణా లోపానికి నిదర్శనం. భద్రత లేకుండా పెరోల్‌పై విడుదల చేసే ఖైదీల కదలికలను జైలు అధికారులు సరిగ్గా గమనించకపోవడం వల్ల ఇతరులు కూడా ఇలాంటి అక్రమాలకు పాల్పడే ప్రమాదం ఉంది" అని న్యాయమూర్తి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
దోషి స్వచ్ఛందంగా జైలులో లొంగిపోలేదని… తన నేరాన్ని దాచిపెట్టి మోసపూరితంగా ప్రభుత్వ ఉద్యోగం పొందాడని కోర్టు స్పష్టం చేసింది. జీవితంలోని ముఖ్యమైన కాలాన్ని జైలు వెలుపల హాయిగా గడిపి అన్ని ప్రయోజనాలు అనుభవించారని వ్యాఖ్యానించింది. అలాగే జైలులోనే తగిన వైద్య సదుపాయాలు ఉన్నందున అనారోగ్య కారణాలతో పెరోల్ ఇవ్వలేమని తేల్చిచెప్పింది.
భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా ఉండేందుకు తెలంగాణ ప్రభుత్వం, జైళ్ల శాఖ తక్షణమే చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. పెరోల్‌పై వెళ్లే ఖైదీలు గడువు ముగియగానే తిరిగి జైలుకు వచ్చేలా నిరంతరం పర్యవేక్షించేందుకు, నిఘా ఉంచేందుకు ఒక ప్రత్యేక టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని, కఠినమైన మార్గదర్శకాలను రూపొందించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది.