...
...
Next Story

హైదరాబాద్‌ నుంచి రాహుల్ గాంధీకి అమిత్ షా ఛాలెంజ్.. రేవంత్ రెడ్డికి వార్నింగ్!

కేంద్రమంత్రి అమిత్ షా చేపట్టిన మహాపాదయాత్ర ముగిసింది. నిజాం కాలేజీ వద్ద బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహం నుంచి మొదలై మొజంజాహీ మార్కెట్ కూడలి వరకు సాగింది. ఆ తర్వాత బహిరంగ సభలో అమిత్ షా మాట్లాడారు.

Published on: Nov 2, 2026, 17:37:06 IST
Advertisement

హైదరాబాద్‌లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేపట్టిన మహాపాదయాత్ర ముగిసింది. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ బలోపేతం, భవిష్యత్ రాజకీయ వ్యూహాలపై దిశానిర్దేశం చేసేందుకు వచ్చిన ఆయన, భాగ్యనగరంలో చేపట్టిన ప్రచార కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఈ పర్యటనతో రాష్ట్ర బీజేపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. బీజేపీపై ప్రతిపక్షాల ఆరోపణలు, ప్రచారానికి కౌంటర్‌గా కాషాయ పార్టీ దేశవ్యాప్తంగా ప్రచారాన్ని ప్రారంభించింది.

మహా పాదయాత్రలో అమిత్ షా
మహా పాదయాత్రలో అమిత్ షా

హైదరాబాద్ చేరుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. చార్మినార్ దగ్గర భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అర్చకుల నుంచి ఆశీర్వచనాలు అందుకున్నారు. పూజా కార్యక్రమాల అనంతరం బషీర్‌బాగ్ సమీపంలోని నిజాం కాలేజీ వద్ద ఉన్న బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహానికి అమిత్ షా నివాళులర్పించారు. సాయంత్రం 4:15 గంటలకు అక్కడి నుంచే ఆయన ప్రచార పాదయాత్రను ప్రారంభించారు. ఈ పాదయాత్రలో కేవలం రాజకీయ నాయకులు, కమలం పార్టీ కార్యకర్తలే కాకుండా పెద్ద సంఖ్యలో న్యాయవాదులు, వైద్యులు, మేధావులు, సాధారణ ప్రజలు భాగస్వాములయ్యారు. ‘భారత్ మాతాకీ జై’ నినాదాలతో యాత్ర సాగిన మార్గమంతా కాషాయమయంగా మారింది.

నిజాం కాలేజీ నుంచి ప్రారంభమైన ఈ యాత్ర సాయంత్రం 5:15 గంటలకు ఎంజే మార్కెట్ కూడలి వద్దకు బహిరంగ సభ వరకు సాగింది. మొజంజాహీ మార్కెట్ కూడలి వద్ద ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో అమిత్ షా ప్రసంగించారు.

తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉపేక్షించేది లేదని, రాబోయే రోజుల్లో ఆ పార్టీని గద్దె దించడమే లక్ష్యంగా ప్రతి బీజేపీ కార్యకర్త నడుం బిగించాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అరాచక పాలనకు అంతం పలికి, ప్రజాస్వామ్యాన్ని కాపాడడమే బీజేపీ ప్రధాన ధ్యేయమని అమిత్ షా స్పష్టం చేశారు. నాడు భారత తొలి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ నిజాం మెడలు వంచి హైదరాబాద్‌ను ఏవిధంగా విముక్తి చేశారో, అదే స్ఫూర్తితో కార్యకర్తలు పనిచేయాలని ఆదేశించారు.

దేశంలో మరణించిన వారి పేర్లు, సుమారు కోటికి పైగా ఉన్న నకిలీ ఓట్లు, దేశంలో నివసించని 3 కోట్ల మంది ఓట్లను జాబితా నుంచి తొలగించాలా వద్దా అని సభ నుంచి అమిత్ షా ప్రశ్నించారు. ఈవీఎంలు, ఎస్‌ఐఆర్‌ల వల్లే బీజేపీ వరుసగా గెలుస్తోందన్న కాంగ్రెస్ ఆరోపణలకు అమిత్ షా గట్టి కౌంటర్ ఇచ్చారు. 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఎస్‌ఐఆర్ లేకపోయినా నరేంద్ర మోదీ నేతృత్వంలో బీజేపీ ఘనవిజయం సాధించలేదా అని నిలదీశారు.

'ఒకవేళ ఈవీఎంల వల్లే మేం గెలుస్తున్నామంటే.. మరి తెలంగాణలో కాంగ్రెస్ ఎలా అధికారంలోకి వచ్చింది? కేరళ, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్‌లలో ప్రతిపక్షాలు ఎలా విజయం సాధించాయి?' అని రాహుల్ గాంధీని, ఇండియా కూటమి నేతలను ప్రశ్నించారు.

ఈవీఎంలు, ఎస్‌ఐఆర్‌ వ్యవస్థలపై ఏ వేదికపైనైనా బహిరంగ చర్చకు సిద్ధమని భాగ్యనగరం వేదికగా రాహుల్ గాంధీకి సవాల్ విసిరారు. దాదాపు రూ. 12 లక్షల కోట్ల అవినీతికి పాల్పడిన కాంగ్రెస్ పార్టీని దేశ ప్రజలు ఇప్పటికే తిరస్కరించారని అమిత్ షా వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా ఉనికి కోల్పోయిన కాంగ్రెస్ ప్రస్తుతం వెంటిలేటర్‌పై ఉందనడంలో సందేహం లేదన్నారు. అటువంటి పార్టీ ప్రధాని నరేంద్ర మోదీతో పరుగుపందెంలో పోటీ పడలేదని ఎద్దేవా చేశారు.

తెలంగాణను కాంగ్రెస్ ఢిల్లీ అధిష్టానానికి ఏటీఎంలా మార్చుకుందని, రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్ పేరిట వసూళ్లు తీవ్రంగా జరుగుతున్నాయని ఆరోపించారు. ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని, కాంగ్రెస్ అధికారంలో ఉన్న ప్రతీ చోటా అవినీతి రాజ్యామేలుతోందని ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

హోంమంత్రి పర్యటన, భారీ పాదయాత్ర నేపథ్యంలో హైదరాబాద్ నగర పోలీసులు అప్రమత్తమై పటిష్ఠ భద్రతా చర్యలు చేపట్టారు. చార్మినార్, బషీర్‌బాగ్, ఎంజే మార్కెట్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టడమే కాకుండా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా బలగాలను మోహరించారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks