PM Modi in Hyderabad : 'రేవంత్‌రెడ్డిజీ నా మాట వింటున్నారా...' కేంద్రం సహకారాన్ని గణాంకాలతో వివరించిన ప్రధాని మోదీ
PM Modi in Hyderabad : హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీ (HICC) వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ పలు కీలక అభివృద్ధి పథకాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ….సీఎం రేవంత్ ప్రస్తావించిన అంశాలకు తనదైన శైలిలో బదులిచ్చారు.
PM Modi in Hyderabad : హైదరాబాద్‌లోని హైటెక్ సిటీలో ఉన్న హెచ్‌ఐసీసీ (HICC)లో నిర్వహించిన సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా రూ.9,377 కోట్ల విలువైన పలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, ప్రజా సంక్షేమ పథకాలకు శంకుస్థాపనలు చేయడంతో పాటు… పూర్తయిన కొన్ని ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు.

ముందుగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి… తెలంగాణాభివృద్ధికి కేంద్రం సాకారం కావాలని కోరారు. తెలంగాణ అభివృద్ధి కోసం 2047 పాలసీ డాక్యుమెంట్ రూపొందించామన్నారు. 2047 నాటికి దేశ ఎకానమీని 30 ట్రిలియన్‌లకు చేర్చాలని ప్రధాని లక్ష్యంగా పెట్టుకున్నారని గుర్తు చేశారు. 3 శాతం జనాభా ఉన్న తెలంగాణ… దేశంలో 10 శాతం ఎకానమీని లక్ష్యంగా పెట్టుకుందన్నారు. 2047 నాటికి తెలంగాణ 3 ట్రిలియన్ల ఎకానమీ చేరుకోవడమే తమ లక్ష్యమని వ్యాఖ్యానించారు.
మీ సహకారం కావాలి - సీఎం రేవంత్
“ఆరోజు మన్మోహన్ లాగా…. ఇప్పుడు మీ(మోదీ) సహకారం కావాలి. దేశంలో 6 నగరాలను గ్రోత్ ఇంజిన్‌లాగా అభివృద్ధి చేయండి. టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేసి సింగిల్ విండో ద్వారా అనుమతులు ఇవ్వండి. దేశం అభివృద్ధి చెందుతున్నంత వేగంగా తెలంగాణ అభివృద్ధి చెందాలనుకుంటుంది. అందుకు మీ సహకారం కావాలి. మచిలీపట్నం పోర్టు వదరకు వేగంగా రైల్వే లైన్ వేయండి. పెండింగ్ ప్రాజెక్టులకు వెంటనే అనుమతులు ఇవ్వండి. మోడీది పెద్దమనసని బండి సంజయ్, కిషన్ రెడ్డి అంటారు. తెలంగాణపై కూడా పెద్ద మనసు చూపించండి” అంటూ సీఎం రేవంత్ ప్రసగించారు.
సీఎం రేవంత్ ప్రసంగం తర్వాత ప్రధాని మోదీ మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ… సీఎం ప్రస్తావించిన అంశాలను పేర్కొంటూ జవాబులిచ్చారు. ఈ పరిణామం అందర్నీ ఆకట్టుకుంది. ‘రేవంత్ రెడ్డిజీ నా మాట వినండి’ అంటూ… ప్రధాని మోదీ మాట్లాడగా సభలో నవ్వులు విరిశాయి.
తెలంగాణకు అందిస్తున్న కేంద్ర సహకారాన్ని ప్రధాని మోదీ గణాంకాలతో సహా వివరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన విజ్ఞప్తులకు సానుకూలంగా స్పందిస్తూనే….. గత పదేళ్లలో కేంద్రం తెలంగాణకు ఎంతటి ప్రాధాన్యతనిచ్చిందో ప్రధాని గుర్తు చేశారు. ముఖ్యంగా మౌలిక సదుపాయాల కల్పనలో తెలంగాణ వేగంగా దూసుకుపోతోందని ఆయన ఆకాంక్షించారు.
రేవంత్ రెడ్డిజీ నా మాట వినండి…
సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడుతూ.. "రేవంత్ రెడ్డిజీ… నా మాట వింటున్నారా..? గతంలో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని, ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధిని మీరు గమనించాలి. 2014 కంటే ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు రైల్వే బడ్జెట్ కేవలం వెయ్యి కోట్ల కంటే తక్కువగా ఉండేది. కానీ నేడు, కేవలం తెలంగాణ రాష్ట్రానికే బడ్జెట్‌లో ఏకంగా రూ. 5,500 కోట్లు కేటాయించాం" అని స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు రూ. 15 వేల కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులు వివిధ దశల్లో సాగుతున్నాయని ఆయన వెల్లడించారు.
హైదరాబాద్ నగరం దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా మారిందని ప్రధాని కొనియాడారు. "సైబరాబాద్ సామర్థ్యం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయికి చేరుకుంది. దేశాభివృద్ధిలో ఈ నగరం కీలక పాత్ర పోషిస్తోంది. నేడు మనం చేసుకున్న ప్రారంభోత్సవాల ద్వారా యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి," అని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు. రాబోయే కాలంలో ఉద్యోగాలకు హైదరాబాద్ ప్రధాన గమ్యస్థానంగా మారుతుందని పేర్కొన్నారు.
వరంగల్‌లో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'పీఎం మిత్ర పార్కు' (PM MITRA Park) ద్వారా భారతదేశ టెక్స్‌టైల్ రంగానికి గొప్ప ఊతం లభిస్తుందని ప్రధాని వివరించారు. దీనివల్ల తెలంగాణలోని నేత కార్మికులకు మరియు అనుబంధ రంగాల వారికి ఉపాధి లభిస్తుందని చెప్పారు. అదేవిధంగా, గత పదేళ్లలో రాష్ట్రంలో జాతీయ రహదారుల నిడివి రెట్టింపు అయిందని మోదీ గుర్తు చేశారు. దేశంలో రోడ్లు, రైల్వేలు మరియు విమానశ్రయాల కనెక్టివిటీని మెరుగుపరచడమే తమ ప్రభుత్వ లక్ష్యమని, ఆ దిశగా తెలంగాణలో మరిన్ని ప్రాజెక్టులు రాబోతున్నాయని ప్రధాని మోదీ భరోసా ఇచ్చారు.
“తెలంగాణకు 5 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఇచ్చాం. తెలంగాణకు 6 అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌లు ఇచ్చాం. తెలంగాణ అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుతుంది. రాజకీయాలు మాట్లాడనని రేవంత్ అన్నారు, నేను కూడా మాట్లాడను. పదేళ్లలో గుజరాత్‌కు ఎన్ని నిధులు ఇచ్చామో తెలంగాణకు అంతే ఇచ్చేందుకు సిద్ధం. అలా చేస్తే మీకు సగం నిధులే వస్తాయి” అంటూ ప్రధాని మోదీ ప్రసంగించారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

