...
...
Next Story

నేటి నుంచే నాంపల్లి నుమాయిష్.. టికెట్ ధర పెంచారా? ట్రాఫిక్ మళ్లింపు ఇలా!

హైదరాబాద్ నాంపల్లిలో నుమాయిష్ నేటి నుంచి ప్రారంభమైంది. నెలన్నరపాటు జరగనుంది. టికెట్ ధర పెంచారని సోషల్ మీడియాలో వైరల్ అయింది. మరోవైపు పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు కూడా పెట్టారు.

Published on: Jan 1, 2026, 10:06:14 IST
Advertisement

హైదరాబాద్‏లో ఏటా జరిగే నుమాయిష్‌ మెుదలైంది. సుమారు నెలా పదిహేను రోజులపాటు నాంపల్లి నుమాయిష్ జరుగుతుంది. జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15వ తేదీ వరకు నిర్వహిస్తారు. సాయంత్రం 4 నుంచి రాత్రి 10 గంటల వరకు వెళ్లవచ్చు. సెలవు దినాల్లో రాత్రి 11 గంటల వరకు నుమాయిష్ ఉంటుంది.

హైదరాబాద్ నుమాయిష్ 2026 (X)
హైదరాబాద్ నుమాయిష్ 2026 (X)

నుమాయిష్ కోసం వచ్చేవారి కోసం నగర శివారు ప్రాంతాల నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది. మెట్రో రైలు సేవలను కూడా వినియోగించుకోవచ్చు. మెట్రో సేవలు రోజులలో రాత్రి 11.30 గంటల వరకు, వారాంతాల్లో, ప్రభుత్వ సెలవు దినాలలో అర్ధరాత్రి వరకు పనిచేస్తాయి. సెక్యూరిటీపై ఎక్కువ ఫోకస్ చేసింది పాలకవర్గం. అజంతాగేట్, గాంధీభవన్, మాలకుంట రోడ్, ప్రవేశ ద్వారాల వద్ద మెటల్ డిటెక్టర్లను ఏర్పాటు చేశారు. తనిఖీ చేసిన తర్వాతే సందర్శకులను లోపలికి పంపిస్తారు. వృద్ధుల కోసం వాలంటీర్లతో వీల్ చైర్లు ఉన్నాయి.

అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన 2026(నుమాయిష్) టిక్కెట్ ధరను పెంచినట్లు అనేక వార్తలు వచ్చాయి. జనవరి 2025లో రుసుమును రూ.40 నుండి రూ.50కి పెంచారు. ఈసారి కూడా 50 రూపాయలే.. దానిలో ఎటువంటి మార్పు లేదు. ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు ప్రవేశం ఉచితం. 45 రోజుల పాటు జరగనుంది.

దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 1,050 మంది తయారీదారులు, చేతివృత్తులవారు, స్థానికులు ఈ ప్రదర్శనలో తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తారు. అంతేకాకుండా వివిధ ప్రభుత్వ విభాగాలు ప్రైవేట్ ప్రదర్శనకారులతో పాటు స్టాల్స్‌ను ఏర్పాటు చేస్తాయి. నుమాయిష్‌లో వివిధ రకాల వంటకాలను అందించే 20 ఫుడ్ స్టాల్స్ కూడా ఉంటాయి.

ట్రాఫిక్ మళ్లింపు

సుల్తాన్ బజార్, జంబాగ్ నుండి వచ్చే ఆర్టీసీ జిల్లా బస్సులు , ప్రైవేట్ బస్సులు, భారీ వాహనాలను ఎంజే మార్కెట్ వద్ద అబిడ్స్ వైపు మళ్లిస్తారు.

అదేవిధంగా బషీర్ బాగ్, పోలీస్ కంట్రోల్ రూమ్ ప్రాంతం నుండి వచ్చే వాహనాలను ఏఆర్ పెట్రోల్ పంప్, బీజేఆర్ విగ్రహం వద్ద అబిడ్స్ వైపు మళ్లిస్తారు.

బేగంబజార్ చత్రి నుండి మలకుంట వైపు వెళ్లే భారీ, మధ్యస్థ వాహనాలను అలాస్కా జంక్షన్ వద్ద దారుసలం, ఏక్ మినార్ మీదుగా మళ్లిస్తారు.

దారుసలం నుండి అఫ్జల్‌గంజ్ లేదా అబిడ్స్ వైపు వెళ్లే వాహనాలను అలాస్కా జంక్షన్ వద్ద బేగంబజార్, సిటీ కాలేజ్, నయాపూల్ వైపు మళ్లిస్తారు.

మూసా బౌలి, బహదూర్‌పురా నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులు సహా భారీ, మధ్య తరహా వాహనాలను సిటీ కాలేజీ వద్ద నయాపూల్, ఎంజే మార్కెట్ వైపు మళ్లిస్తామని పోలీసులు తెలిపారు .

ప్రయాణికులు పలు సమయాల్లో ఎంజే మార్కెట్, గాంధీ భవన్, నాంపల్లి జంక్షన్ మార్గాన్ని నివారించాలని అధికారులు సూచించారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks