NTR Statue : ఇందిరమ్మ ఆశీస్సులు, ఎన్టీఆర్ స్ఫూర్తితో రాష్ట్రంలో ప్రజాపాలన - సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
NTR Statue Inauguration in Hyderabad : హైదరాబాద్ అమీర్‌పేట్‌లో స్వర్గీయ ఎన్టీ రామారావు విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఇందిరమ్మ ఆశీస్సులు, ఎన్టీఆర్ స్ఫూర్తి కలయికతోనే రాష్ట్రంలో ప్రజాపాలన సాగుతోందని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
NTR Statue Inauguration in Hyderabad : భారతదేశ ఉక్కు మహిళ ఇందిరా గాంధీ, తెలుగుజాతి గర్వించదగిన నాయకుడు ఎన్ టీ రామారావుల స్ఫూర్తితో రాష్ట్రంలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. తెలంగాణ రాష్ట్రాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలన్న సంకల్పంతో ప్రజాప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు.

హైదరాబాద్ అమీర్‌పేట్, మైత్రివనం చౌరస్తాలో ఏర్పాటు చేసిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీ రామారావు విగ్రహాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. మంత్రులు తుమ్మల, పొన్నం, అజారుద్దీన్ తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ…. ఎన్టీఆర్ సేవలను స్మరించుకున్నారు. “దేశ చరిత్రను ఎవరు చదవాలన్నా, స్ఫూర్తి పొందాలన్నా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారిని, ఉక్కు మహిళ ఇందిరా గాంధీ గారని, తెలుగుజాతి గర్వించదగిన నాయకుడు ఎన్టీఆర్ గారిని స్మరించుకోవాలి..” అని చెప్పుకొచ్చారు. ఈ దేశం ఉన్నంత కాలం వారి కీర్తి ప్రతిష్టలు నిలబడుతాయన్నారు.
“నీతి, నిజాయితీ, నిబద్ధత కలిగిన నాయకుడు NTR కులాలు, మతాలు, భాషలకు అతీతులు. ఈ దారిలో ప్రయాణించే వారిలో స్ఫూర్తిని నింపడానికి ఈ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నాం. నాకు జీవితకాలం గుర్తుండిపోయే మధుర సంఘటన. తెలంగాణ నుంచి అనేక మంది నాయకులకు ఎన్టీఆర్ రాజకీయ భిక్ష పెట్టారు. ఇది ఎవరూ మరువలేని చరిత్ర” అని అన్నారు.
“తెలంగాణ రాష్ట్రాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తాం. హైదరాబాద్‌లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. భవిష్యత్తులో నగరాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తాం. 30 వేల ఎకరాల్లో ప్రతిష్టాత్మక ఫ్యూచర్ సిటీ ని నిర్మించడమే కాకుండా ప్రపంచ దిగ్గజ కంపెనీలను ఇక్కడికి రప్పించబోతున్నాం. కంపెనీలను రప్పించడమే కాకుండా తెలంగాణ యువతను దిగ్గజ కంపెనీల యజమానులుగా తీర్చిదిద్దే ప్రణాళికలతో ముందుకు వెళుతున్నాం” అని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు.
“రాష్ట్రంలో 3.24 కోట్ల మందికి సన్నబియ్యం అందిస్తున్నాం. దానికి ఎన్టీఆర్ 2 రూపాయలకే కిలో బియ్యం పథకం. ఎన్టీఆర్ అమలు చేసిన కూడు, గుడ్డ, నీడ నుంచి స్ఫూర్తితో అనేక సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్నాం. ఎన్టీఆర్ అమలు చేసిన జనతా వస్త్రాల పథకం స్ఫూర్తిగా ఆడబిడ్డలకు సారెగా ఇందిరమ్మ చీరలను పంపిణీ చేస్తున్నాం” అని పలు పథకాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉదహరించారు.
వారి స్ఫూర్తితోనే పాలన - సీఎం రేవంత్
“ఇందిరమ్మ ఆశీర్వాదం, ఎన్టీఆర్ స్ఫూర్తి ప్రజాపాలనలో ప్రతిఫలిస్తుంది. ఇందిరమ్మ ఎంత ముఖ్యమో.. ఎన్టీఆర్ కూడా అంతే ముఖ్యం. వారిద్దరి కలయికనే ఈనాటి ప్రజాపాలన. వారి స్ఫూర్తితోనే అనేక కార్యక్రమాలు, పథకాలు అమలు చేస్తున్నాం” అంటూ సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
రాజీవ్ గాంధీ గారు స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తే ఎన్టీఆర్ వాటిని అమలు చేశారని గుర్తుచేశారు. ఆ స్ఫూర్తితో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, పార్లమెంట్‌లో అందుకు అందరం మద్దతునిస్తామని స్పష్టం చేశారు. ప్రజలు అండగా ఉండటం వల్లే ప్రజాపాలన ముందుకు సాగుతోందని పేర్కొంటూ భవిష్యత్తులోనూ సహకారం అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలను కోరారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

