KTR Comments : మూసీ ప్రాజెక్ట్ పేరిట లక్షన్నర కోట్ల అవినీతి - కేటీఆర్
సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ పేరిట లక్షన్నర కోట్ల రూపాయల అవినీతికి తెరలేపారని ఆరోపించారు. ఇళ్లు కూల్చకుండా, భూములు స్వాధీనం చేసుకోకుండా శాస్త్రీయ పద్ధతిలో మూసీ శుద్ధి చేస్తే బీఆర్‌ఎస్ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు.
మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ పేరిట లక్షన్నర కోట్ల రూపాయల అవినీతి జరుగుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. బెదిరింపుల రాజకీయాలతో సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను భయపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణ భవన్‌లో నిర్వహించిన గ్రేటర్ హైదరాబాద్ బీఆర్ఎస్వీ సమావేశంలో మాట్లాడిన ఆయన… తన స్కాములు, అవినీతి గురించి ప్రశ్నిస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బెదిరింపులకు దిగుతున్నారని కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మైనింగ్ అక్రమాలను ప్రశ్నించిన సందర్భంలో కూడా ప్రతిపక్షాన్ని బెదిరించే ధోరణి ప్రదర్శించారని ఆయన అన్నారు. రేవంత్ రెడ్డికి బెదిరింపులు అలవాటైపోయాయని, అలాంటి బెదిరింపులకు బీఆర్‌ఎస్ ఎప్పటికీ భయపడదని స్పష్టం చేశారు.
భారీ అంచనాలతో అవినీతి - కేటీఆర్
మూసీ ప్రాజెక్ట్ పేరుతో జరుగుతున్న అవినీతి పై కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుకు ఒక్క రూపాయి లేదని చెప్పే సీఎం….. తన అవినీతి సొమ్ముల కోసం మూసీ పేరిట లక్షన్నర కోట్ల రూపాయలు ఖర్చు చేస్తానని ప్రకటించడం దారుణమని అన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం 16 వేల కోట్లతో రూపొందించిన సమగ్ర ప్రణాళికను పక్కన పెట్టి…. భారీ అంచనాలతో అవినీతి కార్యక్రమాన్ని చేపట్టడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
గత ప్రభుత్వం మూసీ నదిలో మురుగునీటి శుద్ధి కేంద్రాల నిర్మాణాన్ని దాదాపుగా పూర్తి చేసిందని, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీటిని మూసీలోకి పంపించే ప్రణాళిక కూడా సిద్ధంగా ఉందని గుర్తుచేశారు. అయినప్పటికీ ప్రస్తుత ప్రభుత్వం అంచనాలను అనవసరంగా పెంచి అవినీతికి మార్గం సుగమం చేస్తోందని విమర్శించారు. మూసీ ప్రాజెక్ట్ పేరుతో లక్షలాది ఇళ్లను కూల్చివేయడానికి, దాదాపు 3000 ఎకరాల భూమిని సేకరించి కార్పొరేట్ కంపెనీలకు అప్పగించే ప్రయత్నం జరుగుతోందని కేటీఆర్ ఆరోపించారు.
ఒకవైపు మూసీ ఒడ్డున ఉన్న ఇళ్లు చట్ట విరుద్ధమని చెప్పే ప్రభుత్వం…. అదే ప్రాంతంలో భారీ హోటళ్లు, బిజినెస్ సెంటర్లు నిర్మించాలనుకోవడం ద్వంద్వ వైఖరి అని అన్నారు. మూసీ పేరిట జరుగుతున్న అవినీతి చర్యలను జాతీయ స్థాయి ప్రముఖులు కూడా వ్యతిరేకిస్తున్నారని గుర్తు చేశారు. గాంధీ కుటుంబ సభ్యులు సైతం దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారని కేటీఆర్ పేర్కొన్నారు. అయినప్పటికీ ఇప్పుడు దేవుడి పేరును ఉపయోగించి ప్రజలను మోసం చేసే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. తాను చేస్తున్న అవినీతి ప్రశ్నిస్తే “శివతాండవం చేస్తాను” అంటూ సీఎం మాట్లాడటం ఆయన అహంకారానికి నిదర్శనమని అన్నారు.
రేవంత్ రెడ్డి తన అధికార అహంకారాన్ని తగ్గించుకొని, మూసీ ప్రాజెక్ట్‌ను ప్రజలకు ఇబ్బంది కలగకుండా అమలు చేయాలని, లేదంటే లక్షలాది ఇళ్లను కూల్చిన వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోతారని హెచ్చరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రం “పిచ్చోడి చేతిలో రాయి” లాగా మారిందని కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
మూసీ ప్రాజెక్ట్‌పై అసలు ప్రణాళికలు లేకుండా, డీపీఆర్ కూడా సిద్ధం చేయకుండా అడ్డగోలుగా నిర్ణయాలు తీసుకుంటున్నారని కేటీఆర్ ఆరోపించారు. బఫర్ జోన్ పేరుతో పేదల ఇళ్లు కూల్చివేస్తూ, పెద్దల ఇళ్లను వదిలేస్తున్నారని, ఇది ప్రభుత్వ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ నగరాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత యువతపై ఉందని చెప్పారు. మూసీ పునరుజ్జీవం పేరుతో పేదల జీవితాలను నాశనం చేయడాన్ని అడ్డుకోవాలని పిలుపునిచ్చారు.
ఇళ్లు కూల్చకుండా, భూములు స్వాధీనం చేసుకోకుండా శాస్త్రీయ పద్ధతిలో మూసీ శుద్ధి చేస్తే బీఆర్‌ఎస్ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. ప్రస్తుతం వేలాది కుటుంబాలు భయాందోళనలో ఉన్నాయని, ఇల్లు అనేది ప్రతి కుటుంబానికి భావోద్వేగ అంశమని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం గత రెండు సంవత్సరాలలో ప్రజలకు ఉపయోగపడే ఒక్క కార్యక్రమం కూడా చేయలేదని విమర్శించారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

