Telangana : గ్రామ పంచాయతీలకు మరో శుభవార్త - కేంద్రం నుంచి రూ. 387 కోట్లు విడుదల
రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం మరోసారి శుభవార్త చెప్పింది. ఆర్థిక సంఘం నిధుల కింద రూ. రూ.387 కోట్లను విడుదల చేసింది. మొదటి విడత, రెండో విడత కలిపి ఇప్పటివరకు రూ. 647 కోట్ల నిధులను రిలీజ్ చేసింది.
రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల్లో కొత్త పాలకమండళ్లు కొలువుదీరిన సంగతి తెలిసిందే. ఇటీవలనే ఎన్నికలు పూర్తి కాగా… సర్పంచ్ లు, ఉపసర్పంచ్ తో పాటు వార్డు సభ్యులు బాధ్యతలు చేపట్టారు. తాజాగా వారికి శిక్షణ తరగతులను కూడా నిర్వహిస్తున్నారు.

రెండో విడత నిధులు విడుదల…
ఇక రాష్ట్రంలో కొత్త పాలకమండళ్లు కొలువుదీరటంతో పంచాయతీలకు రావాల్సిన ఆర్థిక సంఘం నిధుల విడుదలకు లైన్ క్లియర్ అయిపోయింది. ఇటీవలనే తొలి విడతగా కేంద్ర ప్రభుత్వం రూ. 259.36 కోట్లు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే మరోసారి కేంద్రం తీపి కబురు చెప్పింది. రెండో విడత కింద నిధులను విడుదల చేసింది.
కేంద్రం ప్రభుత్వం రెండో విడతగా దాదాపు రూ. 387 కోట్లను విడుదల చేసింది. తొలి విడతగా ఇప్పటికే దాదాపు రూ. 260 కోట్లు విడుదల చేయగా.. మొత్తంగా ఈ ఏడాదిలో ఇప్పటివరకు తెలంగాణ గ్రామ పంచాయతీల కోసం రూ. 647 కోట్ల నిధులు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఇదే విషయాన్ని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు.
15వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం… తెలంగాణకు దాదాపు రూ. 3,000 కోట్లు వచ్చే అవకాశం ఉంది. మొదటి విడత కింద రూ. 259.36 కోట్లును కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. తాజాగా మరో 387 కోట్లను విడుదల చేయగా… ఈ నిధులన్నీ నేరుగా గ్రామ పంచాయతీల ఖాతాల్లోకి వెళ్తాయి. మిగిలిన నిధులను కూడా దశలవారీగా విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
నిజానికి కేంద్ర ఆర్థిక సంఘం నిధులు ఎప్పుడో రావాల్సి ఉంది. కానీ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు చాలా కాలం వాయిదా పడుతూ వచ్చాయి. 2024–25, 2025–26 ఆర్థిక సంవత్సరాలకు నిధులు రావాల్సి ఉన్నప్పటికీ… ఎన్నికల జాప్యం కారణంగా అవి నిలిచిపోయాయి. గ్రామ పంచాయతీ ఎన్నికలు పూర్తయిన తర్వాతే పెండింగ్‌లో ఉన్న గ్రాంట్లను విడుదల చేస్తామని కేంద్రం పలుమార్లు స్పష్టం చేస్తూ వచ్చింది. దీంతో చాలా గ్రామ పంచాయతీలు తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొవాల్సి వచ్చింది. చిన్న చిన్న పనులు చేసేందుకు కూడా పంచాయతీ కార్యదర్శులు, ప్రత్యేక పాలనాధికారులు ఇబ్బందులు పడ్డారు.
ఆర్థిక సంఘం నిధులు నిలిచిపోతే చాలా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని గ్రహించిన రాష్ట్ర ప్రభుత్వం… ఎన్నికల నిర్వహణకు మొగ్గు చూపింది. బీసీ రిజర్వేషన్లతో పాటు పలు అంశాలను పక్కనపెట్టి… ఎన్నికల నిర్వహణకు లైన్ క్లియర్ చేసింది.
గత ఏడాది డిసెంబర్ లో 3 విడతల్లో ఎన్నికలను పూర్తి చేసింది. ఆ తర్వాత వెంటనే సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యుల ప్రమాణస్వీకారాలను కూడా పూర్తి చేసేలా ఏర్పాట్లు చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలోని కొన్నిచోట్ల తప్పితే …. అన్ని గ్రామాల్లోనూ పాలకవర్గాలు కొలువుదీరాయి. దీంతో ఆర్థిక సంఘం నిధుల విడుదలకు లైన్ క్లియర్ అయినట్లు అయిపోయింది. నిధులు జమవుతున్న నేపథ్యంలో… గ్రామాల్లో అభివృద్ధి పనులకు అడ్డంగులు తొలగిపోనున్నాయి. కొత్త సర్పంచులు కూడా గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై ఫోకస్ పెట్టే పనిలో పడ్డారు.

E-Paper












