సెకండరీ హెల్త్ కేర్ సిస్టమ్.. అన్నింటికీ హైదరాబాద్ రావాల్సిన పనిలేదు!

తెలంగాణలో సెకండరీ హెల్త్ కేర్ సిస్టమ్ మీద ఫోకస్ చేస్తున్నట్టుగా మంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడించారు. జిల్లాల్లోనే అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు.

Updated on: Nov 9, 2026, 16:24:15 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

తెలంగాణలోని ప్రజలకు అన్ని రకాల వైద్య సేవలు వారి సొంత జిల్లాల్లోనే అందుబాటులోకి తీసుకురావడం మా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి దామోదర రాజనర్సింహ చెప్పారు. ఈ లక్ష్య సాధనలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా హాస్పిటళ్లు, జిల్లా హాస్పిటళ్లు కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే సెకండరీ హెల్త్ కేర్ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి మౌలిక సదుపాయాలు, స్పెషలిస్ట్ వైద్య సేవలు, అవసరమైన వైద్య సిబ్బంది, ఆధునిక డయాగ్నస్టిక్ సదుపాయాలను అందుబాటులోకి తీసుకువస్తున్నామన్నారు.

మంత్రి దామోదర రాజనర్సింహ
మంత్రి దామోదర రాజనర్సింహ

ఇటీవల డీఎస్‌హెచ్‌ పరిధిలో 1,616 మంది స్పెషలిస్ట్ వైద్యులను నియమించడంతో పాటు అవసరమైన నర్సులు, టెక్నీషియన్ల నియామకాలు కూడా చేపట్టామని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. ఈ నియామకాల ఫలితాలు ప్రజలకు అందాలంటే ప్రతి ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న సిబ్బందిని, వైద్య పరికరాలను సమర్థవంతంగా వినియోగించుకోవాలన్నారు.

'స్పెషలిస్ట్ వైద్యులు ఉన్నప్పటికీ అవసరమైన పరికరాలు, సిబ్బంది లేక వైద్య సేవలు అందించలేని పరిస్థితి ఉండకూడదు. అందుకే ప్రతి ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న వైద్య సేవలు, అవసరమైన స్పెషాలిటీ విభాగాలు, వైద్యులు, నర్సింగ్, పారామెడికల్ సిబ్బంది, వైద్య పరికరాలు, డయాగ్నస్టిక్ సదుపాయాలపై సమగ్ర సమీక్ష చేపట్టాలి.' అని దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు.

30, 50, 100 పడకలు, అంతకంటే ఎక్కువ సామర్థ్యం కలిగిన ఆసుపత్రులకు వాటి స్థాయికి అనుగుణంగా వైద్య సేవల పరిధిని నిర్ణయించాలన్నారు మంత్రి. సీహెచ్‌సీలు, ఏరియా హాస్పిటళ్లు, జిల్లా హాస్పిటళ్లలో అవసరమైన స్పెషాలిటీ విభాగాలు, పడకలు, ఆపరేషన్ థియేటర్లు, ల్యాబ్‌లు, ఇతర సదుపాయాలపై స్పష్టమైన ప్రణాళిక రూపొందించాలని సూచించారు.

కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన ఇండియన్ పబ్లిక్ హెల్త్ స్టాండర్డ్స్(IPHS) మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్రంలోని సెకండరీ హెల్త్ కేర్ ఆసుపత్రులను అభివృద్ధి చేయాలని ఆదేశించారు దామోదర రాజనర్సింహ. ప్రస్తుతం ఉన్న సిబ్బంది, మంజూరైన పోస్టులు, అవసరమైన సిబ్బంది సంఖ్యను పోల్చి చూసి, లోటుపాట్లను గుర్తించి, అవసరమైన అదనపు పోస్టులపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు.

ప్రతి జిల్లాలో డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ కార్యాలయాలను ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్రస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు స్పష్టమైన పరిపాలనా బాధ్యతలు, నిరంతర పర్యవేక్షణ వ్యవస్థ ఉండాలని భావిస్తున్నామని చెప్పారు మంత్రి. రోగులకు ఎదురవుతున్న సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి పరిష్కరించడం, వైద్య సేవల నాణ్యతను పెంచడం, ఆసుపత్రుల పనితీరును మెరుగుపరచడం తమ ప్రాధాన్యత అన్నారు.

ప్రజలకు నాణ్యమైన వైద్యం వారి జిల్లాల్లోనే అందుబాటులో ఉండాలని మంత్రి దామోదర రాజనర్సింహ చెప్పారు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకూ హైదరాబాద్‌కు వెళ్లాల్సిన పరిస్థితి తగ్గాలని, ప్రతి జిల్లాలో మెరుగైన వైద్య సేవలు అందించాలన్న లక్ష్యంతో సెకండరీ హెల్త్ కేర్ వ్యవస్థను పటిష్టం చేస్తున్నామన్నారు.

సచివాలయంలో డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ కేర్(తెలంగాణ వైద్య విధాన పరిషత్ – TVVP) పునర్వ్యవస్థీకరణపై నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో ఈ అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా(ASCI) రూపొందించిన అధ్యయన నివేదికలోని ప్రతిపాదనలను సమీక్షించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే తమ ప్రభుత్వ సంకల్పమన్నారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More