...
...
Next Story

Telangana Cabinet Decisions : స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ... EV ఆటోలకు రూ.1.5 లక్షల సబ్సిడీ, కేబినెట్ నిర్ణయాలివే

Telangana Cabinet Decisions : సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం ముగిసింది. అర్హులైన రేషన్ కార్డుదారులకు స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. .

Published on: Aug 14, 2026, 18:08:59 IST
Advertisement

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో సమావేశమైన రాష్ట్ర మంత్రివర్గం ముగిసింది. పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఆమోదముద్ర వేసింది. అధికారంలోకి వచ్చిన తర్వాత చేపడుతున్న వివిధ సంక్షేమ పథకాల అమలు, పారిశ్రామికాభివృద్ధి, విద్యా, వ్యవసాయ రంగాల పురోగతిపై కేబినేట్ సుదీర్ఘంగా చర్చించి కీలక తీర్మానాలు చేసింది.

కేబినెట్ లో చర్చించిన అంశాలు - నిర్ణయాలు :

  • ఆగస్ట్ 15వ తేదీన రాష్ట్రంలోని అర్హులైన రేషన్ కార్డుదారులకు స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ మేరకు అన్ని జిల్లాల్లో తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించింది. గతంలో రాష్ట్రంలో 2 కోట్ల 81 లక్షల మంది రేషన్ కార్డు లబ్ధిదారులు ఉండగా, కొత్తగా ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొత్త కార్డులు జారీ చేయడంతో పాటు కుటుంబ సభ్యుల పేర్లను చేర్చింది. దీనివల్ల అదనంగా 62 లక్షల మందికి లబ్ధి చేకూరింది. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం రేషన్ లబ్ధిదారుల సంఖ్య 3 కోట్ల 42 లక్షలకు చేరింది. వీరందరికీ స్మార్ట్ కార్డులు అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది.
  • రాష్ట్రానికి భారీగా పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా 'తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2.0' నిర్వహణకు కేబినేట్ ఆమోదం తెలిపింది. ప్రాథమికంగా డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో ఈ సదస్సు నిర్వహించాలని నిర్ణయించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వివేక్ వెంకటస్వామితో కూడిన సబ్ కమిటీని, నిర్వహణ కోసం ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. 'ఇన్వెస్ట్ తెలంగాణ' థీమ్‌తో నిర్వహించే ఈ సదస్సులో 'ఫ్యూచర్ సిటీ ప్లాన్'ను ఆవిష్కరించనున్నారు. ముఖ్యంగా డిఫెన్స్, ఏరోస్పేస్, ఫార్మా రంగాల్లో తెలంగాణలో ఉన్న అపారమైన పెట్టుబడి అవకాశాలను ప్రపంచానికి చాటిచెప్పేలా ఈ సదస్సును తీర్చిదిద్దుతారు.
  • వానాకాలం పంటకు సంబంధించి 7 రకాల సన్న ధాన్యం సాగును ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామ పంచాయతీ భవనాలు, రైతు వేదికల ద్వారా రైతులకు అవగాహన కల్పించనున్నారు. ఈ ఏడాది నుంచే ఈ 7 రకాల సన్న ధాన్యానికి క్వింటాలుకు రూ.500 బోనస్ చెల్లించాలని కేబినేట్ తీర్మానించింది.
  • యాసంగి ధాన్యం సేకరణలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. రికార్డు స్థాయిలో 81.16 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మద్దతు ధరకు ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఇందులో కేంద్ర ప్రభుత్వం 63.62 లక్షల మెట్రిక్ టన్నులను సేకరించగా, మిగిలిన 17.54 లక్షల మెట్రిక్ టన్నుల మిగులు ధాన్యాన్ని ఈ-వేలం ద్వారా విక్రయించేందుకు ఆమోదం తెలిపింది. క్వింటాలుకు రూ.2,389 ప్రాథమిక ధరగా నిర్ణయించి వేలం వేయనున్నారు.
  • రాష్ట్రంలోని ఐటీఐలు, ఏటీసీలు, పాలిటెక్నిక్ కాలేజీలను 'యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ' పరిధిలోకి తీసుకురావాలని నిర్ణయించారు. వీటిని తెలంగాణ ఎడ్యుకేషన్ యాక్ట్ నుంచి తొలగించి, పరిశ్రమల శాఖ నుంచి ఇంధన (శక్తి) శాఖ పరిధిలోకి విలీనం చేసేందుకు కేబినేట్ ఆమోదం తెలిపింది.
  • ఆదిలాబాద్, నిర్మల్, ముధోల్, బోథ్, సిర్పూర్, గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గాల్లో 'యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల' నిర్మాణానికి ఆమోదం లభించింది. దీంతో ఇప్పటివరకు ఆమోదం పొందిన పాఠశాల కాంప్లెక్స్‌ల సంఖ్య 86కి చేరింది. నిర్మాణాలు పూర్తయిన చోట వచ్చే విద్యా సంవత్సరం నుంచే తరగతులు ప్రారంభించాలని సీఎం ఆదేశించారు.
  • హైదరాబాద్ నగరంలో కాలుష్యాన్ని తగ్గించేందుకు 'తెలంగాణ ఆటో రిక్షా ఎలక్ట్రిక్ కన్వర్షన్ స్కీమ్'కు రూ.200 కోట్లతో ఆమోదం తెలిపారు. నగరంలో ఉన్న 18,766 పెట్రోల్, డీజిల్ ఆటోలను విద్యుత్ (ఈవీ) ఆటోలుగా మార్చేందుకు ఒక్కో వాహనానికి గరిష్టంగా రూ.1.50 లక్షల సబ్సిడీ అందిస్తారు.
  • హైదరాబాద్‌లోని కాలుష్య కారక పరిశ్రమలను నగరం వెలుపలికి తరలించే HILT పాలసీ దరఖాస్తు గడువును అక్టోబర్ 31 వరకు మరో 3 నెలలు పొడిగించారు.
  • మక్తల్-నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల ఫేజ్-2 పనుల కోసం రూ.2,100 కోట్ల అంచనా వ్యయానికి కేబినేట్ ఆమోదం తెలిపింది. దీని ద్వారా లక్ష ఎకరాలకు సాగునీరు, తాగునీరు అందుతాయి.
  • గూడెం దొడ్డి పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టు సామర్థ్యాన్ని 1.19 టీఎంసీల నుంచి 15 టీఎంసీలకు పెంచడంతో పాటు సోలార్ విద్యుత్ ఉత్పత్తిపై అధ్యయనానికి కన్సల్టెంట్‌ను నియమించాలని నిర్ణయించారు.

తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు (ఫైల్ ఫొటో)
తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు (ఫైల్ ఫొటో)
 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe