...
...
Next Story

తెలంగాణలోని నాలుగు జిల్లాల్లో భారీ వర్షపాత లోటు.. ఈ జిల్లాలో 77 శాతం!

Rainfall deficit : దేశంపై ఎల్‌నినో ప్రభావం కనిపిస్తుంది. తెలంగాణలోనూ దీంతో వర్షపాత లోటు కొన్ని జిల్లాల్లో భారీగానే నమోదైంది. నాలుగు జిల్లాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది.

Updated on: Sep 10, 2026, 11:42:12 IST
Advertisement

తెలంగాణలోని నాలుగు జిల్లాల్లో భారీ వర్షపాత లోటు నమోదైంది. ఇందులో నల్గొండ జిల్లా అత్యధికంగా 77 శాతం లోటును నమోదు చేయగా ఆ తర్వాతి స్థానాల్లో ఆదిలాబాద్ (74 శాతం), నిర్మల్ (64 శాతం), పెద్దపల్లి (61 శాతం) ఉన్నాయి. అందిన గణాంకాల ప్రకారం ఆగస్టు నెలలో తెలంగాణలోని 33 జిల్లాల్లో 29 జిల్లాలు సాధారణం కంటే తక్కువ వర్షపాతాన్ని నమోదు చేశాయి. కేవలం నాలుగు జిల్లాలు కామారెడ్డి, మెదక్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట మాత్రమే సాధారణ స్థాయి వర్షపాతాన్ని నమోదు చేశాయి.

తెలంగాణ వర్షపాత లోటు
తెలంగాణ వర్షపాత లోటు

నల్గొండ జిల్లాలో సాధారణ వర్షపాతం 153.4 మి.మీ కాగా కేవలం 35.6 మి.మీ వర్షపాతం మాత్రమే నమోదైంది. దీంతో ఇది అత్యంత తీవ్రంగా ప్రభావితమైన జిల్లాగా నిలిచింది. ఆదిలాబాద్‌లో సాధారణం 294.8 మి.మీ కాగా 77 మి.మీ, నిర్మల్‌లో సాధారణం 276.7 మి.మీ కాగా 100.1 మి.మీ వర్షపాతం నమోదైంది. పెద్దపల్లిలో సాధారణం 260.1 మి.మీ కాగా 100.4 మి.మీ వర్షపాతం నమోదైంది.

ఇతర అనేక జిల్లాల్లో కూడా గణనీయమైన వర్షపాత లోటు నమోదైంది. జోగులాంబ గద్వాల జిల్లాలో 57 శాతం లోటు నమోదు, ములుగు, సంగారెడ్డి, వరంగల్ జిల్లాల్లో 56 శాతం చొప్పున లోటు నమోదైంది. జగిత్యాల, జనగామ జిల్లాల్లో 52 శాతం లోటు, భద్రాద్రి కొత్తగూడెం, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో 51 శాతం లోటుగా ఉంది.

రాష్ట్ర స్థాయిలో చూస్తే.. ఆగస్టులో సాధారణ వర్షపాతం 226.1 మి.మీ కాగా 130.2 మి.మీ వర్షపాతం మాత్రమే నమోదైంది. దీనివల్ల సుమారు 42 శాతం లోటు ఏర్పడింది. మొత్తం రుతుపవన వర్షపాత లోటు ప్రస్తుతం 23 శాతంగా ఉంది. వర్షపాతంలో గణనీయమైన మెరుగుదల లేకపోతే.. ఈ సీజన్ ముగిసే సమయానికి లోటు దాదాపు 30 శాతానికి పెరిగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

సెప్టెంబర్ 11-12 తేదీల ప్రాంతంలో నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంటున్నారు. దీనితో కొంత ఉపశమనం లభించే అవకాశం ఉంది. వాతావరణ వ్యవస్థ ఏర్పడి, అనుకూల మార్గంలో పయనిస్తే, తెలంగాణలో నాలుగు నుంచి ఐదు రోజుల పాటు మంచి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. మొత్తం వర్షపాత లోటు నుంచి కాస్త మెరుగుదల ఉండవచ్చంటున్నారు.

ఇక హైదరాబాద్‌లో సాధారణంగా కురవాల్సిన 189.3 మిల్లీమీటర్లకు బదులుగా 109.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది 42 శాతం లోటును సూచిస్తుంది. రాజధాని చుట్టుపక్కల ఉన్న ఇతర జిల్లాల్లో కూడా సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. మెడ్చల్ మల్కాజిగిరిలో 46 శాతం, రంగారెడ్డిలో 37 శాతం లోటు నమోదైంది.

కామారెడ్డిలో సాధారణంగా కురవాల్సిన 253.6 మిల్లీమీటర్లకు బదులుగా 280.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది 11 శాతం అధిక వర్షపాతాన్ని సూచిస్తుంది. రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో సాధారణ సగటుకు అనుగుణంగానే వర్షపాతం నమోదవ్వగా, స్వల్ప లోటు ఉన్నప్పటికీ మెదక్, సిద్దిపేట జిల్లాల్లో సాధారణ స్థాయిలోనే వర్షపాతం నమోదైంది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks