పండుగల వేళ స్వగ్రామాలకు వెళ్లే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే మరో అప్డేట్ ఇచ్చింది. రాబోయే దీపావళి, ఛత్ పూజా ఉత్సవాల సందర్భంగా రైళ్లలో తీవ్రంగా పెరుగుతున్న ప్రయాణికుల రద్దీని అదుపు చేసేందుకు హైదరాబాద్‌లోని చర్లపల్లి నుంచి బీహార్‌లోని రక్సాల్ మధ్య ప్రత్యేక రైళ్లను ప్రకటించింది.
- చర్లపల్లి - రక్సాల్ స్పెషల్ ట్రైన్ (రైలు సంఖ్య- 07007) : ఈ ప్రత్యేక రైలు చర్లపల్లి నుంచి ప్రతి బుధవారం మధ్యాహ్నం 15:15 గంటలకు బయలుదేరుతుంది. శుక్రవారం ఉదయం 05:55 గంటలకు రక్సాల్ చేరుకుంటుంది. ఈ రైలు నవంబర్ 11, నవంబర్ 18 మరియు నవంబర్ 25, 2026 తేదీల్లో సేవలు అందిస్తుంది. మొత్తం 3 సర్వీసులు అందుబాటులో ఉంటాయి.
- రక్సాల్ - చర్లపల్లి స్పెషల్ ట్రైన్ (రైలు సంఖ్య - 07008) : తిరుగు ప్రయాణంలో ఈ రైలు రక్సాల్ నుంచి ప్రతి శుక్రవారం రాత్రి 19:15 గంటలకు బయలుదేరి, ఆదివారం ఉదయం 10:00 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది. ఈ రైలు నవంబర్ 13, నవంబర్ 20 మరియు నవంబర్ 27, 2026 తేదీల్లో సర్వీసులు నిర్వహిస్తుంది. ఈ మార్గంలో కూడా 3 సర్వీసులు అందుబాటులో ఉంటాయి.
ఆగే ప్రధాన రైల్వే స్టేషన్లు….

ఈ పండుగ ప్రత్యేక రైళ్లు రెండు వైపులా ప్రయాణించేటప్పుడు తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లోని ముఖ్యమైన స్టేషన్లలో ఆగుతాయి.
తెలంగాణలో కాజీపేట, రామగుండం, సిర్పూర్ కాగజ్‌నగర్ స్టేషన్లలో ఈ రైళ్లకు నిలుపుదల కల్పించారు. అలాగే బల్లార్షా, సేవారామ్, నాగ్‌పూర్, ఇటార్సి, మదన్ మహల్, కాట్ని, సత్నా, మాణిక్‌పూర్, ప్రయాగ్‌రాజ్ ఛోకి, పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ (మొఘల్ సరాయ్), బక్సర్, ఆరా, దానాపూర్, పాట్లీపుత్ర, హాజీపూర్, ముజఫ్ఫర్‌పూర్, సీతామఢీ, బైరగ్నియా స్టేషన్లలో ఈ రైళ్లు ఆగుతాయి.
ప్రయాణికుల సౌకర్యార్థం ఈ ప్రత్యేక రైళ్లలో థర్డ్ ఏసీ (3AC), స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లను ఏర్పాటు చేశారు. ఈ ప్రత్యేక రైళ్ల సేవలను వినియోగించుకోవాలని దక్షిణ మధ్య రైల్వే కోరింది.