హైదరాబాద్ శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం తన అంతర్జాతీయ ప్రయాణ సౌకర్యాలలో మరో చారిత్రాత్మక మైలురాయిని చేరుకుంది. శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఉజ్బెకిస్థాన్ రాజధాని తాష్కెంట్‌కు ప్రముఖ విమానయాన సంస్థ సెంట్రమ్ ఎయిర్ నేరుగా విమాన సర్వీసులను ప్రారంభించింది. దక్షిణ భారతదేశం నుంచి మధ్య ఆసియా ప్రాంతానికి నేరుగా డైరెక్ట్ ఫ్లైట్ కనెక్టివిటీ అందుబాటులోకి రావడం ఇదే తొలిసారి.

ఈ ప్రారంభోత్సవ వేడుకలను రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో జీహెచ్‌ఐఏఎల్ ఉన్నతాధికారులు, సెంట్రమ్ ఎయిర్ ప్రతినిధులు, ఇతర భాగస్వాముల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక కార్యక్రమం అనంతరం హైదరాబాద్ నుండి తొలి విమానం తాష్కెంట్‌కు బయలుదేరి వెళ్లింది.
వారానికి రెండు రోజులు సర్వీసులు ఉండనున్నాయి. ఈ కొత్త విమాన సర్వీసు వారానికి రెండు రోజులు అందుబాటులో ఉంటుంది. హైదరాబాద్‌తో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఇతర దక్షిణ భారత రాష్ట్రాల ప్రజలకు ఉజ్బెకిస్థాన్ వెళ్లేందుకు ఈ సర్వీస్ ఎంతో అనుకూలంగా మారనుంది.
దక్షిణాసియా, మధ్య ఆసియాల మధ్య రవాణా సులభతరం కావడంతో రెండు ప్రాంతాల మధ్య వ్యాపార, వాణిజ్య లావాదేవీలు మరింత పుంజుకుంటాయి. చారిత్రాత్మక నగరాలైన సమర్‌కండ్, బుఖారా, తాష్కెంట్‌లను సందర్శించాలనుకునే భారతీయ పర్యాటకులకు, మెడికల్ టూరిజం కోసం హైదరాబాద్ వచ్చే ఉజ్బెకిస్థాన్ పౌరులకు ఇది గొప్ప అవకాశంగా మారనుంది. ఉజ్బెకిస్థాన్‌లో వైద్య విద్య (MBBS) చదువుతున్న వేలాది మంది భారతీయ విద్యార్థులకు ఈ డైరెక్ట్ ఫ్లైట్ వల్ల ప్రయాణ సమయం, వ్యయం గణనీయంగా తగ్గుతాయి.
ఈ నూతన సర్వీస్ ప్రారంభం సందర్భంగా జీఎమ్‌ఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కధిర్ కధిరవన్ మాట్లాడుతూ ఆనందం వ్యక్తం చేశారు. 'హైదరాబాద్ నగరం సాంకేతికత, వ్యాపారం, ఆవిష్కరణలలో ప్రపంచ స్థాయి హబ్‌గా ఎదుగుతోంది. ఈ క్రమంలో కొత్తగా అభివృద్ధి చెందుతున్న అంతర్జాతీయ మార్కెట్లకు నేరుగా ఎయిర్ కనెక్టివిటీని పెంచడం ఎంతో అవసరం. దక్షిణ భారతదేశాన్ని మధ్య ఆసియాతో అనుసంధానించడంలో హైదరాబాద్-తాష్కెంట్ సర్వీస్ ఒక కీలక అడుగు. దక్షిణ భారతదేశంలో తొలిసారిగా తమ సర్వీసులను ఇక్కడి నుంచే ప్రారంభించిన సెంట్రమ్ ఎయిర్‌కు స్వాగతం పలుకుతున్నాం. ఈ మార్గం భారత్ - ఉజ్బెకిస్థాన్ మధ్య పర్యాటకం, విద్య, వ్యాపార సంబంధాలను మరింత బలోపేతం చేస్తుంది.' అని ఆయన పేర్కొన్నారు.