...
...
Next Story

TCS HyperVault AI Centre : హైదరాబాద్‌లో దేశంలోనే అతిపెద్ద AI డేటా సెంటర్ - రూ.70 వేల కోట్ల పెట్టుబడి!

TCS HyperVault AI Centre in Hyderabad : హైదరాబాద్‌లో దేశంలోనే అతిపెద్ద ఏఐ (AI) డేటా సెంటర్ క్యాంపస్‌ను ఏర్పాటు చేయనున్నట్లు టీసీఎస్​ అనుబంధ సంస్థ హైపర్ వాల్ట్ ప్రకటించింది. అందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.

Published on: Sep 5, 2026, 18:23:12 IST
Advertisement

TCS HyperVault AI Centre in Hyderabad : తెలంగాణ ఐటీ రంగ చరిత్రలో మరో అధ్యాయం ఆవిష్కృతం కానుంది. గ్లోబల్ ఐటీ హబ్‌గా దూసుకుపోతున్న భాగ్యనగరం ఇప్పుడు 'గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) క్యాపిటల్'గా మారే దిశగా కీలక ఒప్పందం జరిగింది. దేశంలోనే అత్యంత భారీ, అత్యాధునిక ఏఐ డేటా సెంటర్ క్యాంపస్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్నట్లు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) అనుబంధ సంస్థ 'హైపర్ వాల్ట్' (HyperVault) అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుకు సంబంధించి శనివారం సచివాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో యాజమాన్యం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.

హైదరాబాద్‌లో దేశంలోనే అతిపెద్ద AI డేటా సెంటర్
హైదరాబాద్‌లో దేశంలోనే అతిపెద్ద AI డేటా సెంటర్

హైదరాబాద్ పరిధిలో దాదాపు 250 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో, 1 గిగావాట్ (1,000 మెగావాట్లు) భారీ సామర్థ్యంతో ఈ ఏఐ డేటా సెంటర్ రూపుదిద్దుకోనుంది. హైపర్ వాల్ట్ తన భాగస్వామ్య సంస్థలతో కలిసి ఈ ప్రాజెక్టు నిర్మాణం, నిర్వహణ కోసం రూ.70,000 కోట్ల భారీ నిధులను వెచ్చించనుంది. ఈ మెగా ప్రాజెక్ట్ ద్వారా తెలంగాణలోని నైపుణ్యమున్న యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 7,000 ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.

సీఎంతో కీలక భేటీ - కీలక అంశాలపై చర్చ

ఈ కీలక ఒప్పందానికి ముందు టీసీఎస్ అగ్రనాయకత్వం సచివాలయంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డితో సమావేశమైంది. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌తో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, సీనియర్ అధికారులు ఈ భేటీలో పాల్గొన్నారు. టీసీఎస్ సీఈఓ కె. కృతివాసన్, సీఓఓ ఆర్తి సుబ్రమణియన్, హైపర్ వాల్ట్ ప్రెసిడెంట్ వి. రాజన్న, సీఈఓ దీపేష్ నందా నేరుగా హాజరవ్వగా…. అమెరికా నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 'ఓపెన్ ఏఐ' చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ ఉదయ్ రుద్రరాజు పాల్గొన్నారు.

ఒప్పందం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఇది తెలంగాణకే కాకుండా మొత్తం దేశానికే ఒక చారిత్రాత్మక ఘట్టమని అభివర్ణించారు. "నా కల నెరవేరింది. ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి ఇది బలమైన పునాది. తెలంగాణ రైజింగ్ విజన్-2047లో భాగంగా నిర్దేశించుకున్న 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్య సాధనలో ఈ ప్రాజెక్టు గేమ్‌చేంజర్‌గా నిలుస్తుంది" అని స్పష్టం చేశారు.

ఐదు పోటీ రాష్ట్రాలను అధిగమించి తెలంగాణ ఈ ప్రాజెక్టును సాధించడం విశేషమని అధికారవర్గాలు తెలిపాయి. 2026 జనవరిలో దావోస్ పర్యటనలో టాటా సన్స్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్‌తో సీఎం జరిపిన ప్రాథమిక చర్చలే నేడు ఈ భారీ పెట్టుబడికి పునాది వేశాయని చెప్పుకొచ్చాయి.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe