...
...
Next Story

Varuna Yagam : నాగార్జునసాగర్‌ వద్ద ఇవాళ వరుణయాగం - సీఎం రేవంత్, మంత్రులు ప్రత్యేక పూజలు

Varuna Yagam Nagarjuna Sagar : వర్షాభావం, జలాశయాల్లో నీటి కొరత నేపథ్యంలో నాగార్జునసాగర్‌లో రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ వరుణయాగం తలపెట్టింది. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు పలువురు పాల్గొంటారు.

Published on: Aug 10, 2026, 06:47:31 IST
Advertisement

Varuna Yagam Nagarjuna Sagar : నైరుతి రుతుపవనాల కాలం సగానికి పైగా పూర్తయి, ఆగస్టు రెండో వారంలోకి ప్రవేశించినప్పటికీ తెలంగాణలోని ప్రధాన జలాశయాలు ఇంకా ఆశించిన స్థాయిలో భర్తీ కాలేదు. రాష్ట్రానికి ఆధారమైన కృష్ణ, గోదావరి నదుల్లోకి ఎగువ నుంచి తగినంత నీటి ప్రవాహాలు రాకపోవడంతో సాగు, తాగునీటి వ్యవస్థలపై ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, జలాశయాలు జలకళతో నిండాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా 'వరుణయాగం' నిర్వహించాలని నిర్ణయించింది.

యాదాద్రి నుంచి రుత్వికులు….

నాగార్జున సాగర్ (ఫైల్ ఫొటో)
నాగార్జున సాగర్ (ఫైల్ ఫొటో)

నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ ప్రాజెక్టు ప్రాంగణంలో ఈ వేద క్రతువును అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ యాగానికి సంబంధించి ఏర్పాటు చేసిన 'పూర్ణాహుతి' కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా పాల్గొంటారు. ప్రసిద్ధ యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయానికి చెందిన 108 మంది రుత్వికులు, వేద పండితులు ఈ యాగాన్ని నిర్వహిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా 11 హోమ గుండాలను ఏర్పాటు చేశారు. ఇవాళ్టి రోజంతా ఈ కార్యక్రమం కొనసాగుతోంది.

తెలంగాణ వ్యాప్తంగానే కాకుండా కృష్ణా, గోదావరి నదుల ఎగువ ఆయకట్టు ప్రాంతాల్లో సమృద్ధిగా, సమయానికి వర్షాలు కురవాలని, నదుల్లో పారే ప్రవాహాలు పెరగాలని… రైతాంగం సస్యశ్యామలంగా ఉండాలని భగవంతుడైన వరుణదేవుడిని ప్రార్థిస్తూ ఈ యాగం తలపెట్టారు.

కృష్ణా నదీ పరివాహక ప్రాంతం సుమారు 2.59 లక్షల చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ఇందులో కర్ణాటక వాటా సుమారు 44 శాతం కాగా, మహారాష్ట్ర వాటా మరో 27 శాతంగా ఉంది. ఈ రెండు ఎగువ రాష్ట్రాలు కలిపి కృష్ణా బేసిన్‌లో 70 శాతానికి పైగా భూభాగాన్ని కలిగి ఉన్నాయి. అందువల్ల పశ్చిమ కనుమలు, కర్ణాటక, మహారాష్ట్రలోని కృష్ణ, భీమా, తుంగభద్ర పరివాహక ప్రాంతాలలో కురిసే వర్షాలే తెలంగాణలోని జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులకు ఎంత నీరు వస్తుందో నిర్ణయిస్తాయి.

నాగార్జునసాగర్ పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 312.045 టీఎంసీలు కాగా…. ప్రస్తుతం కేవలం 145.65 టీఎంసీలు మాత్రమే ఉంది. అంటే ఇంకా 166.39 టీఎంసీల ఖాళీ నిల్వ సామర్థ్యం ఉంది. ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 590 అడుగులు కాగా…. ప్రస్తుతం 518 అడుగుల వద్దే నీరు ఉంది.

గత ఏడాది గణాంకాలతో పోల్చి చూస్తే ఈ వ్యత్యాసం మరీ స్పష్టంగా కనిపిస్తుంది. గత ఏడాది ఆగస్టు 9 నాటికి నాగార్జునసాగర్‌లో 310.25 టీఎంసీల నీరుంది, నీటిమట్టం 589.40 అడుగుల వద్ద ఉంది. అంటే దాదాపు ప్రాజెక్ట్ నిండిపోయింది. కానీ ఈ ఏడాది అదే రోజు నాటికి ప్రాజెక్టులో సగం కంటే తక్కువ నీరు మాత్రమే అందుబాటులో ఉంది.

వర్షాభావం, ఎల్ నినో ప్రభావంపై అధ్యయనం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం జులై 30న ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ప్రభుత్వం ముందు కొన్ని కీలక ప్రతిపాదనలు ఉంచింది. ప్రతికూల వర్షపాతం వల్ల రైతాంగం నష్టపోకుండా ఉండేందుకు బిందు, తుంపర (డ్రిప్, స్ప్రింక్లర్) సేద్యంపై సబ్సిడీలు ఇవ్వాలని కమిటీ సూచించింది. అలాగే ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో వర్షాభావ పరిస్థితులను తట్టుకునే ఆరుతడి పంటలను ప్రోత్సహించాలని సిఫార్సు చేసింది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe