Telangana Aviation Academy : తెలంగాణ యువతకు సూపర్ ఛాన్స్ - విమానయాన రంగంలో ప్రాక్టికల్ శిక్షణ..! ఇవిగో వివరాలు
Telangana Aviation Academy MoU : తెలంగాణలో విమానయాన రంగానికి ప్రాక్టికల్ శిక్షణ అందించేందుకు సాంకేతిక విద్యాశాఖ, టీజీఎస్ఏఏ ఎంవోయూ కుదుర్చుకున్నాయి. ఏఎంఈ డిప్లొమా విద్యార్థులకు 2,100 గంటల పరిశ్రమ ఆధారిత శిక్షణ దక్కనుంది.
Telangana Aviation Academy MoU : రాష్ట్రంలోని యువతకు విమానయాన (ఏవియేషన్) రంగంలో అత్యుత్తమ నాణ్యమైన సాంకేతిక, ప్రాక్టికల్ శిక్షణను అందుబాటులోకి తెచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బేగంపేట పాత ఎయిర్‌పోర్ట్‌లోని తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీ (TGSAA)తో రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ చారిత్రాత్మక అవగాహన ఒప్పందం (MoU) కుదుర్చుకుంది.

ఏఎంఈ కోర్సుకు పరిశ్రమ ఆధారిత శిక్షణ…
ఈ ఒప్పందం ద్వారా హైదరాబాద్ రామంతాపూర్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ ప్రభుత్వ పాలిటెక్నిక్ (JNGP) కళాశాలలో నిర్వహిస్తున్న మూడేళ్ల ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్ (AME) డిప్లొమా కోర్సు రూపురేఖలు మారనున్నాయి. విద్యార్థులకు ఇప్పటివరకు లభించే సైద్ధాంతిక విద్యతో (థియరీ) పాటు అత్యాధునిక ల్యాబొరేటరీ ప్రాక్టికల్స్, ప్రత్యక్ష విమానాల పరిచయం, సంక్లిష్టమైన ఎయిర్‌క్రాఫ్ట్ సిస్టమ్స్‌పై పూర్తిస్థాయి శిక్షణ దక్కుతుంది. కోర్సు చివరి సంవత్సరంలో నేరుగా విమానయాన పరిశ్రమలో పనిచేసే ప్రత్యక్ష అనుభవాన్ని (పరిశ్రమ ఆధారిత వర్క్ ఎక్స్‌పీరియన్స్) ఈ భాగస్వామ్యం ద్వారా కల్పించనున్నారు.
ఈ విద్యా విధానంలో మొదటి రెండు సంవత్సరాల కాలంలో జేఎన్‌జీపీ, టీజీఎస్ఏఏ సంయుక్త ఆధ్వర్యంలో థియరీ తరగతులు, ల్యాబరేటరీ ప్రాక్టికల్స్, ఎయిర్‌క్రాఫ్ట్ ఫ్యామిలియరైజేషన్, సిస్టమ్స్ ట్రైనింగ్ అందిస్తారు. అయితే, ఈ ఎంవోయూలోని అత్యంత ప్రధానమైన ప్రత్యేకత ఏమిటంటే.. చివరి ఏడాదిలో విద్యార్థులు నేరుగా టీజీఎస్ఏఏ ప్రాంగణంలోనే పూర్తిస్థాయిలో గడిపి, ఒక సంవత్సరం పాటు దాదాపు 2,100 గంటల ప్రాక్టికల్ వర్క్ ఎక్స్‌పీరియన్స్, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ పొందుతారు.
టీజీఎస్ఏఏలోని అత్యంత అనుభవజ్ఞులైన నిపుణులు, శిక్షకులు విద్యార్థులకు మార్గదర్శకత్వం వహిస్తారు. ప్రయోగశాలల సౌకర్యాలు, ప్రత్యేక విమానాల ప్రాప్యత (యాక్సెస్), విమాన నిర్వహణ, మెయింటెనెన్స్ హాంగర్లలో నేరుగా పనిచేసే అవకాశాన్ని లభించేలా చేస్తారు. దీనివల్ల డిప్లొమా పూర్తయ్యే నాటికే విద్యార్థులకు ప్రముఖ ఎయిర్‌లైన్స్ సంస్థలు, ఫ్లయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్స్ (FTO), ఎయిర్‌క్రాఫ్ట్ ఆపరేటర్లు, మెయింటెనెన్స్ రిపేర్ అండ్ ఓవర్‌హాల్ (MRO) కేంద్రాలు, ఏరోనాటికల్ తయారీ సంస్థలు మరియు ఏరోస్పేస్ రంగాలపై సమగ్రమైన అవగాహన, పరిశ్రమ అనుభవం లభిస్తాయి.
ఏవియేషన్ సేఫ్టీ ప్రమాణాలకు ప్రాధాన్యత….
విమానయాన రంగంలో భద్రత అత్యంత కీలకమైన అంశం కాబట్టి, శిక్షణ సమయంలో సేఫ్టీ ప్రమాణాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. విద్యార్థులకు తప్పనిసరిగా సేఫ్టీ అండ్ సెక్యూరిటీ బ్రీఫింగ్స్ నిర్వహించడంతో పాటు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI), బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (BCAS) నిబంధనలకు అనుగుణంగా శిక్షణా కార్యక్రమాలను రూపొందించారు.
ఈ అవగాహన ఒప్పందం సంతకం చేసిన నాటి నుంచి ఐదేళ్ల పాటు అమలులో ఉంటుంది. అనంతరం ఇరు వర్గాల పరస్పర అంగీకారంతో ఒప్పందాన్ని పొడిగించుకునే వెసులుబాటు కల్పించారు. సాంకేతిక విద్యాశాఖ - పరిశ్రమ అనుసంధానంలో తెలంగాణ ప్రభుత్వం వేసిన ఈ అడుగు యువతకు విమానయాన రంగంలో విస్తృత ఉద్యోగావకాశాలు కల్పిస్తుందని విద్యావేత్తలు భావిస్తున్నారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

