...
...
Next Story

ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్‌న్యూస్.. 2 డీఏల మంజూరుకు ఆమోదం

రాష్ట్రంలోని ఉద్యోగులు, పెన్షనర్లకు రెండు డీఏలు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో ప్రభుత్వంపై ఏటా రూ.2500 కోట్ల భారం పడనుంది.

Published on: Oct 2, 2026, 05:37:07 IST
Advertisement

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు, రిటైర్డ్ ఉద్యోగులకు రెండు డీఏలు మంజూరు చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2024 నుంచి బకాయి ఉన్న డీఏల్లో రెండు డీఏలను వెంటనే మంజూరు చేయాలని నిర్ణయించింది. ఎరియర్స్‌ను వాయిదాల్లో చెల్లిస్తారు.

సీఎం రేవంత్ రెడ్డి
సీఎం రేవంత్ రెడ్డి

ఆర్థికంగా భారమైనప్పటికీ ఇటీవల ఉద్యోగ సంఘాలతో జరిపిన చర్చల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగులకు డీఏ, పెన్షనర్లకు డీఆర్ మంజూరు చేసేందుకు ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు. ఈ నిర్ణయంతో ప్రభుత్వంపై ఏటా రూ.2500 కోట్ల భారం పడనుంది. మంత్రిమండలిలో తీసుకున్న నిర్ణయాలపై మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీడియాకు వెల్లడించారు.

రాష్ట్రంలో ఎల్‌నినో కారణంగా తలెత్తిన పరిస్థితులపై డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో జరిగిన మంత్రిమండలి సమావేశం సుదీర్ఘంగా చర్చించింది. ప్రస్తుత వర్షాకాలంలో దాదాపు 17 శాతం వర్షపాతం లోటు ఉంది. నిన్నటితో రుతుపవనాల కాలం కూడా ముగిసింది. దాదాపు 235 మండలాల్లో తీవ్ర వర్షభావంతో కరువు పరిస్థితులు నెలకొన్నాయి.

కరువు ప్రాంతాల్లో తక్షణం చేపట్టాల్సిన చర్యలపై కేబినెట్ సబ్‌కమిటీలో సమగ్రంగా చర్చించాలని సమావేశం నిర్ణయించింది. ఈ అంశంపై త్వరలోనే అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రైతు సంఘాలతో పాటు వివిధ రంగాల నిపుణులతో భేటీలు ఏర్పాటు చేస్తారు.

ఎల్‌నినో పరిస్థితులు, చేపట్టాల్సిన ఉపశమన చర్యలపై అన్ని వర్గాల నుంచి సలహాలు, సూచనలు స్వీకరిస్తారు. కరువు మండలాల ప్రకటనతో పాటు రాష్ట్రానికి తగిన సాయం అందించాలని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర మంత్రివర్గం విజ్ఞప్తి చేసింది. ఆ మేరకు మంత్రుల బృందం తొందరలోనే ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిలను నివేదించాలని మంత్రిమండలి నిర్ణయించింది.

ఎల్‌నినో పరిస్థితులతో నేపథ్యంలో రాష్ట్రంలో విద్యుత్తు వినియోగం గణనీయంగా పెరిగింది. రాష్ట్రంలో సాధారణంగా ఒక్క రోజుకు 15,000 మెగావాట్ల విద్యుత్తు వినియోగం ఉండగా.. ఈ సీజన్‌లో అది రికార్డు స్థాయిలో 19,892 మెగావాట్ల పీక్ డిమాండ్‌కు చేరింది. గత ఏడాది మొత్తంలో 16,613 మెగావాట్ల గరిష్ఠ వినియోగం నమోదైంది.

విద్యుత్తు డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్తు ఉత్పత్తి, తగినంత విద్యుత్తు సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నట్టు మంత్రులు వివరించారు. రాష్ట్రంలో ఎక్కడా విద్యుత్తు కోత లేకుండా సరఫరా చేసేందుకు అవసరమైనంత విద్యుత్తును సమకూర్చుకోవాలని, డిమాండ్ మేరకు కొనుగోలు చేయాలని నిర్ణయించింది.

భవిష్యత్తు డిమాండ్, అవసరాలను దృష్టిలో పెట్టుకొని కొత్తగా పునరుత్పాదక విద్యుత్తు ఉత్పత్తి, విద్యుత్తు సమీకరణపై దృష్టి పెట్టాలని నిర్ణయించింది. దాదాపు 7,800 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి లక్ష్యంగా యూనిట్లు నెలకొల్పేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

ఇందులో 3,000 మెగావాట్ల సోలార్ విద్యుత్తు, 4,000 మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్‌, 800 మెగావాట్ల పవన విద్యుత్తు యూనిట్ల ఏర్పాటు ప్రతిపాదనలపై మంత్రివర్గం చర్చించింది. కేంద్ర నిబంధనల మేరకు బిడ్డింగ్ విధానంలో ఈ ప్రాజెక్టులు చేపట్టాలని నిర్ణయించింది.

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కోహెడలో ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఇంటిగ్రేటెడ్ ఫ్రూట్ మార్కెట్ ఏర్పాటు పనులను వేగవంతం చేయాలని నిర్ణయం తీసుకుంది కేబినెట్. పూర్తిగా ప్రభుత్వ నిధులతోనే ఈ మార్కెట్ ఏర్పాటు చేయాలని సూచించింది.

దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పున: సమీక్షించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఈపీసీ విధానంలో చేపట్టిన ప్రాజెక్టులు అసంపూర్తిగా ఉంటే రద్దు చేయాలని అధికారులను ఆదేశించింది. ఇందులో భాగంగా 10 ఈపీసీ సాగునీటి ప్రాజెక్టులను నిలిపివేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

తెలంగాణలో డిజిటల్ మీడియా అడ్వర్టైజింగ్‌కు ప్రత్యేక పాలసీ అమలు చేసే ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసింది. కేంద్ర ప్రభుత్వ సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ రూపొందించిన డిజిటల్ అడ్వర్టైజ్‌మెంట్ పాలసీకి అనుగుణంగా రాష్ట్రంలో ఈ పాలసీ రూపొందించారు.

న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్ పోస్టుతో పాటు మరో నలుగురు గ్రూప్ 1 అధికారులను కూడా ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున పని చేసేందుకు నియమించాలని మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks