TG Cheyutha Pensions : కొత్త పింఛన్లపై మరో అప్డేట్ - ధ్రువపత్రాలు లేకున్నా నమోదుకు ఛాన్స్! ఈ వివరాలు తెలుసుకోండి
TG Cheyutha Pensions Applications : చేయూత పింఛన్లకు ధ్రువీకరణ పత్రాలు లేకపోయినా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. గతంలో నిలిచిపోయిన వారు కూడా కొత్తగా దరఖాస్తు చేసుకోవచ్చని సెర్ప్ సీఈఓ ఉత్తర్వులు జారీ చేశారు.
TG Cheyutha Pensions Applications : చేయూత పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం మరో ముఖ్యమైన అప్డేట్ ఇచ్చింది. పలు రకాల పింఛన్లకు సంబంధించి కావాల్సిన ధ్రువీకరణ పత్రాలు (సర్టిఫికెట్లు) ప్రస్తుతం అందుబాటులో లేకపోయినప్పటికీ, ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసుకునేలా వెసులుబాటు కల్పించింది. అయితే……. అధికారులు క్షేత్రస్థాయిలో జరిపే పరిశీలన సమయానికి మాత్రం సంబంధిత ధ్రువీకరణ పత్రాలను కచ్చితంగా సమర్పించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

ఇంతకుముందు పింఛన్లు అందుకొని, పలు సాంకేతిక లేదా ఇతర కారణాల వల్ల మధ్యలోనే పింఛన్ నిలిచిపోయిన అర్హులైన లబ్ధిదారులు కూడా ఇప్పుడు మళ్లీ కొత్తగా దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు సెర్ప్ నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లకు స్పష్టమైన మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వులను జారీ అయ్యాయి.
- తహసీల్దారు జారీ చేసే ధ్రువీకరణ పత్రం తక్షణమే లేకున్నా దరఖాస్తు చేసుకోవచ్చు.
- సదరం (SADAREM) లేదా యూడీఐడీ (UDID) కార్టులు లేకపోయినా దరఖాస్తుకు అవకాశం ఇచ్చారు.
- చేనేత జౌళి శాఖ ఏడీ ధ్రువీకరణ పత్రం లేకుండానే దరఖాస్తు సమర్పించవచ్చు.
- ఆబ్కారీ శాఖ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఇచ్చే ధ్రువీకరణ పత్రం అందుబాటులో లేకపోయినా దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయవచ్చు.
పైన పేర్కొన్న వర్గాల వారు ప్రస్తుతానికి తమ ఆధార్ కార్డు, రేషన్ కార్డుల ఆధారంగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసుకునే వీలు ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న తర్వాత అధికారులు పరిశీలనకు వచ్చిన సమయంలో మాత్రం ఆయా కేటగిరీలకు సంబంధించిన అసలు ధ్రువీకరణ పత్రాలను తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది. ఈ నిర్ణయంతో సర్టిఫికెట్లు పొందడంలో ఆలస్యమై దరఖాస్తు చేసుకోలేకపోతున్న వేలాది మంది పేదలకు పెద్ద ఊరట లభించినట్లయింది.
ఈనెల 15 వరకు గడువు…
చేయూత పథకం కింద నూతనంగా మంజూరు చేయనున్న సామాజిక పింఛన్ల దరఖాస్తు స్వీకరణ గడువును సెప్టెంబర్ 15వ తేదీ వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. కాబట్టి అర్హులైన లబ్ధిదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని త్వరితగతిన దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ సర్కార్ సూచించింది.
రాష్ట్రవ్యాప్తంగా నూతనంగా 2.50 లక్షల మంది అర్హులకు సామాజిక భద్రతా పింఛన్లను మంజూరు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలోనే దరఖాస్తులు స్వీకరించే ప్రక్రియను ఈ నెల 9వ తేదీన శ్రీకారం చుట్టింది. అయితే ప్రాథమికంగా నిర్ణయించిన ఆఖరి తేదీ నాటికి వివిధ కారణాల వల్ల చాలామంది అర్హులు దరఖాస్తు చేసుకోలేకపోయారు. ఆగస్టు 31వ తేదీని దరఖాస్తు చివరి తేదీగా ప్రభుత్వం పేర్కొంది. ప్రజాప్రతినిధులు, లబ్ధిదారుల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిశీలించిన ప్రభుత్వం.. ఎవరూ నష్టపోకూడదనే ఉద్దేశంతో గడువును సెప్టెంబర్ 15 వరకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.
వెరిఫికేషన్ ఇలా….
గ్రామీణ ప్రాంతాలలో సంబంధిత పంచాయతీ కార్యదర్శులు ఇంటింటికీ వెళ్లి అర్హతలను పరిశీలిస్తారు. పట్టణ, నగర ప్రాంతాలలో మున్సిపల్ బిల్ కలెక్టర్లు క్షేత్రస్థాయి విచారణ చేపట్టి లబ్ధిదారులను ఖరారు చేస్తారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

