...
...
Next Story

Telangana : 'ఎల్ నినో' కరువు ముప్పు - సంక్రాంతి తర్వాత ప్రత్యేకంగా ఉపాధి పథకం

తెలంగాణలో రాబోయే 8-10 నెలలు కరువు పరిస్థితులు ఉండవచ్చని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. సంక్రాంతి నుండి మే వరకు 4 నెలల ప్రత్యేక ఉపాధి పథకం అమలు చేయనున్నట్లు ప్రకటిస్తూ, సాగునీటి కంటే తాగునీటికే ప్రాధాన్యమని స్పష్టం చేశారు.

Published on: Oct 24, 2026, 09:18:53 IST
Advertisement

రాష్ట్రంలో ఎల్ నినో ప్రభావంతో తలెత్తుతున్న తీవ్ర కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఎనిమిది నుంచి పది నెలల పాటు కరువు పరిస్థితులు కొనసాగే అవకాశముందని స్పష్టం చేస్తూ….. గ్రామీణ ప్రాంత ప్రజలు, కూలీలను ఆదుకునేందుకు సంక్రాంతి పండుగ ముగిసిన తర్వాత నుంచి మే నెల వరకు నాలుగు నెలల పాటు ప్రత్యేక ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు.

ఎల్ నినో కరువు ముప్పు - సీఎం రేవంత్ కీలక సమీక్ష
ఎల్ నినో కరువు ముప్పు - సీఎం రేవంత్ కీలక సమీక్ష

శుక్రవారం హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులతో ఏర్పాటు చేసిన విస్తృత స్థాయి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా నీటి ఎద్దడి తీవ్రంగా ఉందని, అందువల్ల రైతులు కేవలం వర్షాధార పంటలు, కూరగాయలు మాత్రమే సాగు చేయాలని విజ్ఞప్తి చేశారు.

తాగునీటికే తొలి ప్రాధాన్యం….

రాష్ట్రంలో ఉన్న దాదాపు 30 లక్షల వ్యవసాయ పంపుసెట్లలో ఇప్పటికే 15 లక్షల పంపుసెట్లు ఎండిపోయాయని సీఎం రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాజెక్టులలో నీటి నిల్వలు వాటి మొత్తం సామర్థ్యంలో 20 శాతం కంటే తక్కువకు పడిపోయాయని, కొన్ని ప్రాజెక్టులు ఇప్పటికే డెడ్ స్టోరేజ్ స్థాయికి చేరుకున్నాయని వెల్లడించారు.

"ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీరు 200 టీఎంసీలకు మించి లేదు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో సాగునీటికి నీటిని విడుదల చేయడం సాధ్యం కాదు. ఉన్న నీటిని కేవలం తాగునీటి అవసరాలకే ప్రాధాన్యతగా కేటాయిస్తాం," అని ఆయన స్పష్టం చేశారు.

తాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా నిరంతరం పర్యవేక్షించాలని కేబినెట్ సబ్‌కమిటీకి, అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక టోల్ ఫ్రీ నంబర్‌ను అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపారు.

ప్రత్యేక ఉపాధి పథకం….

ఈ ఉపాధి హామీ పథకం కింద వ్యవసాయ పొలాలకు వెళ్లే దారులు, కాలువలు, చెరువులు, కుంటల పునరుద్ధరణ పనులను చేపడతారు. రైతుల్లో అవగాహన కల్పించేందుకు 'కళాజాతా' బృందాలతో ప్రచారం నిర్వహిస్తారు. గ్రామాల్లో పశువుల కోసం తాగునీరు, దాణా అందించేందుకు ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేస్తామని, ఉపాధి హామీ కింద అదనపు పనిదినాలు కల్పిస్తామని సీఎం భరోసా ఇచ్చారు.

ఎల్ నినో ప్రభావం, కరువు నివారణ చర్యలను వేగవంతం చేయడానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశామని సీఎం తెలిపారు. అలాగే ఈ అంశంపై దుష్ప్రచారాలను అరికట్టేందుకు, పర్యవేక్షణ కోసం సీనియర్ అధికారి కే రామకృష్ణారావును ప్రత్యేక అధికారిగా నియమించినట్లు చెప్పారు. ఖరీఫ్ సీజన్‌లో నీటి సంక్షోభం రాకుండా ప్రభుత్వం విజయవంతంగా నిర్వహించిందని, పండించిన పంటల రక్షణ, కొనుగోలు బాధ్యత కూడా ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు.

తీవ్రమైన ఎండలు, నీటి కొరత కారణంగా రాష్ట్రంలో విద్యుత్ వినియోగం ఊహించని రీతిలో పెరిగిందని సీఎం తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమయంలో అత్యధిక విద్యుత్ డిమాండ్ 13,000 మెగావాట్లుగా ఉంటే, ఇప్పుడు ఏకంగా 20,000 మెగావాట్లకు చేరిందని వెల్లడించారు. ఎంత ఖర్చయినా విద్యుత్ కొనుగోలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ, మార్కెట్‌లో విద్యుత్ లభ్యత లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు విద్యుత్‌ను కేవలం అత్యవసర అవసరాలకే వినియోగించాలని పిలుపునిచ్చారు.

గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం దామరచర్లలో థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయడంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముడిసరుకు సులభంగా లభించే ప్రాంతాల్లోనే విద్యుత్ ప్రాజెక్టులు నిర్మించాలని, సింగరేణి ప్రాంతంలో నిర్మించిన ప్రాజెక్టుల నుంచి విద్యుత్ యూనిట్‌కు రూ.4 నుంచి రూ.5 కే లభిస్తోందని గుర్తుచేశారు.

"4,000 మెగావాట్ల యాదాద్రి పవర్ ప్లాంట్ కోసం అదనంగా రూ.8,000 కోట్లు వెచ్చించడంతో విద్యుత్ ఉత్పత్తి వ్యయం యూనిట్‌కు రూ.6 దాటిపోయింది. అదే ప్రాజెక్టును రామగుండం, కొత్తగూడెం లేదా మంచెరియాల వంటి ప్రాంతాల్లో నిర్మించి ఉంటే రూ.28,000 కోట్లతో 2019 నాటికే పూర్తయ్యేది. దానివల్ల బొగ్గు రవాణా ఖర్చుల రూపంలో ఏటా రూ.2,000 కోట్లు ఆదా అయ్యేవి," అని సీఎం వివరించారు.

రాష్ట్రంలో నెలకొన్న కరువుకు ఎల్ నినో కారణం కాదని, కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని బీఆర్‌ఎస్ నాయకులు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు చేస్తున్న ఆరోపణలను సీఎం తిప్పికొట్టారు. ఎల్ నినో ప్రభావం ప్రపంచవ్యాప్తంగా 100 దేశాలపై పడిందని, భారత్‌లోని మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులతో పాటు బ్రిటన్‌లోనూ కరువు పరిస్థితులు ఉన్నాయని వివరించారు. రాజకీయం కోసమే హరీష్ రావు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, రైతులు బీఆర్‌ఎస్ మాటలు నమ్మవద్దని కోరారు. గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కరోనా సమయంలో జరిగిన మరణాలను ప్రస్తావిస్తూ…. మాజీ సీఎం చేసిన వ్యాఖ్యల వల్ల ప్రజలు కరోనా తీవ్రతను అంచనా వేయలేక తీవ్రంగా నష్టపోయారని ఆరోపించారు. నీ

నవంబర్ 1న ఢిల్లీలో ఎస్ఐఆర్ ప్రక్రియకు వ్యతిరేకంగా నిర్వహించే భారీ నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని సీఎం పిలుపునిచ్చారు. ఓటర్ల జాబితా ప్రక్షాళన పేరిట పేదల హక్కులను కాలరాస్తున్న బీజేపీ వైఖరిపై రాహుల్ గాంధీ పోరాడుతున్నారని, తెలంగాణ నుండి 10,000 నుండి 15,000 మంది కార్యకర్తలను తరలించాలని ఆదేశించారు.

రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై సమీక్షిస్తూ, ప్రతి అర్హులైన గ్రాడ్యుయేట్‌ను ఓటర్‌గా నమోదు చేయించాలని సీఎం సూచించారు. మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ స్థానంలో ఇప్పటివరకు 36 శాతం మాత్రమే ఓటర్ల నమోదు జరిగిందని, ఇంకా 64 శాతం నమోదు కావాల్సి ఉందన్నారు. ఈ స్థానాలకు పార్టీ అభ్యర్థులుగా సామ రామ్మోహన్ రెడ్డి, రామిరెడ్డి సర్వోత్తమ్ రెడ్డిలను ఖరారు చేశామని…. అందరూ కలిసికట్టుగా పనిచేసి విజయం సాధించాలని కోరారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks