Telangana 22A Lands Issue : తెలంగాణలో భూముల కొనుగోళ్లు, అమ్మకాల విషయంలో ఎంతోమంది ప్రజలను, రైతులలో గందరగోళానికి గురిచేస్తున్న 22ఏ (నిషేధిత భూముల జాబితా) సమస్యల పరిష్కారం దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సమస్యను సమగ్రంగా అధ్యయనం చేసి, క్షేత్రస్థాయిలో ఉన్న చిక్కుముళ్లను విప్పేందుకు వీలుగా ప్రభుత్వం ఒక అత్యున్నత స్థాయి కమిటీని (హైలెవల్ కమిటీ) గురువారం ఏర్పాటు చేసింది.
ఉన్నతాధికారులతో కమిటీ…

ముగ్గురు ఐఏఎస్, ఉన్నతాధికారులతో కూడిన ఈ కమిటీ బాధ్యతలను స్వీకరించనుంది. ఈ కమిటీకి ఛైర్మన్‌గా సీసీఎల్‌ఏ (భూపరిపాలన ప్రధాన కమిషనర్) వ్యవహరిస్తారు. కమిటీలో సభ్యులుగా రాష్ట్ర న్యాయశాఖ కార్యదర్శి, అలాగే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఐజీలు బాధ్యతలు నిర్వర్తిస్తారు.
రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్ చట్టం పరిధిలోని 22ఏ జాబితాలో చేర్చడం వల్ల లక్షలాది ఎకరాల భూములు కొనుగోళ్లు, అమ్మకాలకు నోచుకోక స్తంభించిపోయాయి. దశాబ్దాలుగా ఉన్న భూ వివాదాలు, ప్రభుత్వ, దేవాదాయ, వక్ఫ్, అసైన్డ్ భూముల రక్షణ పేరిట సాధారణ పౌరుల భూములు కూడా ఈ నిషేధిత జాబితాలోకి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
కొత్తగా ఏర్పాటైన ఈ ఉన్నతాధికారుల కమిటీ 22ఏ పరిధిలో ఉన్న భూములపై సమగ్రంగా విచారణ జరిపి…. నిజమైన యజమానులకు న్యాయం జరిగేలా ప్రభుత్వానికి నివేదిక మరియు సిఫార్సులు సమర్పించనుంది. ఈ నిర్ణయంతో భూముల సమస్యలతో సతమతమవుతున్న వేలాది మంది భూయజమానులకు పెద్ద ఊరట లభించే అవకాశం ఉంటుందని అధికారిక వర్గాలు అభిప్రాయపడుతున్నారు.