TG Land Rates : భూముల విలువ పెంపుపై సందేహాలా..? ఈ టోల్ ఫ్రీ నెంబర్లను సంప్రదించండి
రాష్ట్రంలో భూముల ధరలను క్రమబద్ధీకరించనున్నారు. ఈ నేపథ్యంలో వీటి విషయంలో ఏమైనా సందేహాలు, ఫిర్యాదులను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకు టోల్ ఫ్రీ నెంబర్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ వివరాలను రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.
రెవెన్యూ వ్యవస్థలో ప్రభుత్వం సమూల మార్పులకు శ్రీకారం చుట్టింది. ఓవైపు భూ భారతి సేవలు అందుబాటులోకి రాగా… తాజాగా భూముల ధరలను కూడా క్రమబద్ధీకరించనుంది. ఈనెల 5వ తేదీ నుంచి కొత్త ధరలు అమల్లోకి వస్తాయని కూడా సర్కార్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పలు కీలక నిర్ణయాలను వెల్లడించారు.

రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ చార్జీలను పెంచే ఆలోచన ప్రభుత్వానికి ఎంతమాత్రం లేదని మంత్రి పొంగులేటి తేల్చిచెప్పారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చార్జీలను 6 శాతం నుండి ఏకంగా 7.5 శాతానికి పెంచిందని ఆయన గుర్తుచేశారు. కేవలం ఒక శాతం చార్జీలు పెంచినా కూడా ప్రజలపై వేల కోట్ల రూపాయల అదనపు భారం పడుతుందన్న ప్రజాకోణంలోనే తమ ప్రభుత్వం ఆలోచించిందని తెలిపారు. అందుకే వాస్తవ పరిస్థితులకు దగ్గరగా, శాస్త్రీయ పద్ధతిలో కేవలం భూముల ప్రభుత్వ విలువలను మాత్రమే సవరించామని వివరించారు.
టోల్ ఫ్రీ నెంబర్లు….
గురువారం గచ్చిబౌలిలోని తాలిమ్‌లో కార్పొరేట్ స్థాయిలో నిర్మిస్తున్న అత్యాధునిక ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ నిర్మాణ పనులను మంత్రి స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా సచివాలయంలో విలేకరులతో మాట్లాడిన ఆయన…. భూముల విలువల సవరణకు సంబంధించి కొన్ని వివరాలను పేర్కొన్నారు.
- గ్రామీణ ప్రాంతాలు: వ్యవసాయ భూముల విలువ ఎకరానికి కనీసం రూ. 2.75 లక్షలు.
- మున్సిపల్ కార్పొరేషన్లు: ఎకరానికి కనీసం రూ. 5 లక్షలు.
- హెచ్ఎండీఏ (HMDA) పరిధి: ఎకరానికి కనీసం రూ. 10 లక్షలు.
- ఓఆర్ఆర్ (ORR) పరిధి: ఎకరానికి కనీసం రూ. 15 లక్షలు.
ఈ సవరించిన భూముల విలువలపై ఎక్కడైనా ఎక్కువ తక్కువలు ఉన్నట్లు గుర్తిస్తే వాటిని తిరిగి సమీక్షిస్తామని మంత్రి పొంగులేటి హామీ ఇచ్చారు. భూముల విలువలు, ఇతర సందేహాలు లేదా ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నెంబర్లను ప్రకటించారు. 1800 599 4788 లేదా వాట్సాప్ నెంబర్ 8247619983 ను సంప్రదించవచ్చని సూచించారు.
గత ప్రభుత్వంలో రిజిస్ట్రేషన్ అయిన అసైన్డ్ భూములను ఇప్పుడు నిషేధిత జాబితా (Prohibited List) లో పెట్టామని…. భూములకు సంబంధించిన ప్రతి డాక్యుమెంట్‌ను త్వరలోనే పూర్తిస్థాయిలో డిజిటలైజేషన్ చేస్తామని ప్రకటించారు. ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టును రద్దు చేయడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఫ్యూచర్ సిటీలో భూములను ఎవరికీ ఉచితంగా ఇవ్వడం లేదని…. ఒకవేళ ఇప్పుడు ఈ ప్రాజెక్టును రద్దు చేస్తే ప్రభుత్వం సదరు సంస్థలకు భారీగా డబ్బు తిరిగి చెల్లించాల్సి ఉంటుందని… ఇది ఆచరణలో సాధ్యమయ్యే పని కాదని వివరించారు.
మొదటి దశలో భాగంగా ఔటర్ రింగ్ రోడ్డు (ORR) పరిధిలోని 39 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను 13 క్లస్టర్‌లుగా విభజించారు. ప్రభుత్వంపై రూపాయి కూడా ఆర్థిక భారం పడకుండా…. ప్రైవేట్ నిర్మాణ రంగ సంస్థలతో (PPP మోడల్) వీటిని నిర్మిస్తున్నారు. ఈ భవనాల నిర్మాణంతో పాటు ఐదేళ్ల పాటు వాటి నిర్వహణ బాధ్యతలను కూడా ఆయా నిర్మాణ సంస్థలకే అప్పగించారు. ప్రతీ కార్యాలయాన్ని 3 నుండి 5 ఎకరాల విశాలమైన స్థలంలో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు.
- వివాహ రిజిస్ట్రేషన్ల కోసం ప్రత్యేకంగా ఒక 'మినీ మ్యారేజ్ హాల్'.
- గర్భిణీ స్త్రీలకు, చిన్న పిల్లల కోసం ప్రత్యేకంగా 'ఫీడింగ్ రూమ్' మరియు 'క్రెచ్' (శిశు సంరక్షణ కేంద్రం).
- వృద్ధులు, దివ్యాంగుల కోసం అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఆధునిక లిఫ్ట్ సౌకర్యం.
- ప్రజలందరి కోసం విశాలమైన వెయిటింగ్ ఏరియా మరియు ప్రత్యేక వసతులు.
ఇప్పటికే నాలుగు ఇంటిగ్రేటెడ్ భవనాలకు శంకుస్థాపనలు పూర్తి చేసుకుని పనులు వేగంగా జరుగుతున్నాయని మంత్రి పొంగులేటి తెలిపారు. ప్రస్తుతం పరిశీలించిన గచ్చిబౌలి భవనాన్ని రాబోయే డిసెంబర్ నాటికి పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామన్నారు. రాబోయే ఒకటి రెండు రోజుల్లో కోహెడలో కూడా శంకుస్థాపన చేయబోతున్నామని…. రెండవ విడతలో అన్ని జిల్లా కేంద్రాల్లో ఇలాంటి సమగ్ర భవనాలను నిర్మిస్తామని వెల్లడించారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

