తెలంగాణ ప్రభుత్వం ఎక్సైజ్ సిబ్బందికి తుపాకులు ఇచ్చే ఆలోచనలో ఉంది : మంత్రి జూపల్లి
తెలంగాణ ప్రభుత్వం ఎక్సైజ్ సిబ్బందికి తుపాకులు ఇచ్చే ఆలోచనలో ఉందని మంత్రి జూపల్లి చెప్పారు. కానిస్టేబుల్ సౌమ్యపై దాడి తీవ్ర ఆందోళన కలిగించిందన్నారు.
మాదకద్రవ్యాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం రాజీలేని వైఖరితో ఉందని ఎక్సైజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఎక్సైజ్ సిబ్బందికి తుపాకులు జారీ చేయాలనే ప్రతిపాదన పరిశీలనలో ఉందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో తగిన సంప్రదింపుల తర్వాత దీనిపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. గంజాయి, ఇతర మాదకద్రవ్యాల పదార్థాలను అరికట్టడంతో పాటుగా ఎక్సైజ్ శాఖ సిబ్బంది సేఫ్టీని నిర్ధారించడం కోసం తుపాకులు ఇచ్చే ఆలోచన ఉందన్నారు.

గంజాయి స్మగ్లర్లను పట్టుకునే ప్రయత్నంలో గాయాలపాలై నిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్యను పరామర్శించిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. 'రాష్ట్రవ్యాప్తంగా నిఘాను ముమ్మరం చేశాం. ఫలితంగా ఇటీవలి కాలంలో 2,457 మందిపై 1,354 కేసులు నమోదు చేయగా, 5,196 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నాం. సౌమ్యపై దాడి జరిగిన నిజామాబాద్ జిల్లాలో 110 మంది నేరస్థులపై 70 కేసులు నమోదు చేశాం. ఇది ప్రభుత్వం ఈ సమస్యను ఎంత తీవ్రంగా పరిష్కరిస్తుందో ప్రతిబింబిస్తుంది.' అని మంత్రి జూపల్లి అన్నారు.
కానిస్టేబుల్ సౌమ్యపై దాడి తీవ్ర ఆందోళన కలిగించిందన్నారు మంత్రి జూపల్లి. సౌమ్య, ఆమె కుటుంబానికి ప్రభుత్వం పూర్తి సహాయాన్ని అందిస్తుందని హామీ ఇచ్చారు. అన్ని వైద్య ఖర్చులను రాష్ట్రమే భరిస్తుందని, ఆమె కుటుంబ శ్రేయస్సు కోసం అవసరమైన ఆర్థిక సహాయం అందిస్తామని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులపై దాడులను సహించేది లేదని, బాధ్యులపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఏం జరిగింది అంటే?
గంజాయి సరఫరా చేస్తున్నట్టుగా ముఠా సమాచారం నిజామాబాద్ ఎక్సైజ్ పోలీసులకు వచ్చింది. దీంతో పోలీసులు నగర శివారులోని మాధవనగర్ వద్ద జనవరి 23న గంజాయి ముఠాను గుర్తించి పట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కారువద్దకు వెళ్లగానే నిర్మల్‌కు చెందిన గంజాయి ముఠా సభ్యులు కారుతో ఢీకొట్టారు. ఈ ఘటనలో ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్యకు తీవ్ర గాయాలు అయ్యాయి. అనంతరం పోలీసులు వాహనాన్ని వెంబడించి ఇద్దరు గంజాయి స్మగ్లర్లను అరెస్ట్ చేశారు.
ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని నిమ్స్ వైద్యులు తెలిపారు. నిజామాబాద్‌లో జరిగిన దాడిలో ఆమె కడుపు భాగంలో తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రస్తుతం ఐసీయూలో వెంటిలేటర్, డయాలసిస్ సపోర్ట్‌తో చికిత్స అందిస్తున్నారు. ఘటన జరిగిన వెంటనే.. నిజామాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రిలో ఎమర్జెన్సీ చికిత్స అందించి.. ఆమె ఎడమ కిడ్నీ, స్ప్లీన్‌ను తొలగించారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం 25వ తేదీన అర్ధరాత్రి నిమ్స్‌కు తరలించారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


