క్యూర్ పరిధిలో ఇందిరమ్మ (తక్కువ ఆదాయ వర్గాల) ఫ్లాట్ల కోసం ఎదురుచూస్తున్న నిరుపేదలకు మరో ముఖ్యమైన అప్డేట్ వచ్చేసింది. ఈ పథకం కింద ఎంపికైన లబ్ధిదారులకు అలాట్‌మెంట్ లెటర్లు (కేటాయింపు పత్రాలు) జారీ చేసే ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమవుతుంది. ఈ మేరకు తెలంగాణ హౌసింగ్ బోర్డు ప్రకటన జారీ చేసింది.
డిజిటల్ విధానంలో….

లబ్ధిదారులు ఆఫీసుల చుట్టూ తిరిగే అవసరం లేకుండా తెలంగాణ ప్రభుత్వం పారదర్శకంగా డిజిటల్ విధానంలో ఈ పత్రాలను పంపిణీ చేస్తోంది. ఎంపికైన వారి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్లకు నేరుగా వాట్సాప్ (WhatsApp), ఎస్సెమ్మెస్ (SMS) ద్వారా ఈ అలాట్‌మెంట్ లేఖలను పంపుతున్నారు. దీనివల్ల లబ్ధిదారులు వేగంగా, ఎలాంటి మధ్యవర్తుల ప్రమేయం లేకుండా తమ వివరాలను సరిచూసుకునే అవకాశం లభిస్తుంది.
వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ ఇలా...
ఫోన్ ద్వారా మాత్రమే కాకుండా అధికారిక పోర్టల్ ( https://tghb.telangana.gov.in/cure-status ) నుంచి కూడా ఈ పత్రాలను పొందవచ్చు. లబ్ధిదారులు తెలంగాణ హౌసింగ్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి తమ వివరాలను నమోదు చేయడం ద్వారా నేరుగా అలాట్‌మెంట్ లెటర్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు. సందేహాలు ఉన్నవారు హౌసింగ్ బోర్డు సహాయక కేంద్రాన్ని సంప్రదించాలని సూచించారు.
తెలంగాణ హౌసింగ్ బోర్డు అధికారికంగా జారీ చేసే ప్రకటనలు, కేటాయింపు పత్రాలు, సంబంధిత అధికారుల సూచనలను మాత్రమే విశ్వసించాలని కమిషనర్ గౌతమ్ లబ్ధిదారులకు విజ్ఞప్తి చేశారు. మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దని కోరారు. ఇతర వ్యక్తులు తెలిపే ఖాతాలకు లేదా వ్యక్తిగత బ్యాంకు ఖాతాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ డబ్బులు జమ చేయవద్దని హెచ్చరించారు. ఇల్లు మంజూరు చేయిస్తామని ఎవరైనా డబ్బులు అడిగినా లేదా అనధికారిక ఖాతాలకు చెల్లించాలని కోరినా వెంటనే తెలంగాణ హౌసింగ్ బోర్డు అధికారులకు లేదా పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ఇటువంటి అక్రమాలకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.