మావోయిస్టుల లొంగుబాటులో లేడీ ఐపీఎస్ ఆఫీసర్ మార్క్.. ఇంతకీ ఆమె ఎవరు?
ఇటీవల మావోయిస్టు అగ్రనేతలు లొంగిపోయిన విషయం తెలిసిందే. అయితే వారి లొంగుబాటులో కీలక పాత్ర పోషించారు ఐపీఎస్ ఆఫీసర్ బి.సుమతి. ఇప్పుడే కాదు.. 2004 చర్చల సమయంలోనూ దగ్గర ఉండి పరిశీలించారు.
తెలంగాణ డీజీపీ బీ శివధర్ రెడ్డి ఎదుట మావోయిస్టు టాప్ కమాండర్ తిప్పిరి తిరుపతి అలియాస్ దేవూజీ, అగ్రనేతలు మల్లా రాజిరెడ్డి, బడె చొక్కారావు, నూనె నరసింహారెడ్డి ఇటీవల లొంగిపోయారు. అయితే ఆ సమయంలో వేదికపైన చీర కట్టులో కనిపించిన వ్యక్తి ఎవరో కాదు.. ఐపీఎస్ అధికారిణి బి.సుమతి. మావోయిస్టులు లొంగిపోవడంలో కీలక పాత్ర పోషించారు. ఎలాంటి సమస్య లేకుండా సాఫీగా లొంగుబాట్లు అయ్యేలా చూడటంలో ముందు ఉన్నారు.

మావోయిస్టు అగ్రనేతలు ఆయుధాలు వదులుకుని జనజీవన స్రవంతిలోకి వచ్చేందుకు ఒప్పించడంలో సక్సెస్ అయ్యారు సుమతి. తెలంగాణ పోలీస్ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్‌కు ఐజీగా పని చేస్తున్నారు. మావోయిస్టులు జన జీవన స్రవంతిలోకి వచ్చేలా చాలా కాలంగా పని చేస్తున్నారు. బయటకు వస్తే కలిగే ఉండే ప్రయోజనాలు, ఉద్యమం ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో నడవలేదని వారికి అర్థమయ్యేలా చెప్పడంలో విజయం సాధించారు.
దేవూజీ లొంగిపోయిన సందర్భంగా డీజీపీ శివధర్ రెడ్డి మీడియా ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఐపీఎస్ అధికారిణి సుమతి, గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఎస్ఐబీ టీమ్‌ను అభినందించారు. 'స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఐజీ సుమతి, ఎస్ఐబీ బృందం చేసిన అద్భుతమైన ప్రయత్నాల కారణంగా మావోయిస్టులు లొంగిపోయారు. మావోయిస్టులు ప్రస్తుత పరిస్థితులను అర్థం చేసుకోవడంలో, ప్రధాన స్రవంతిలో చేరడంలో కీలక పాత్ర పోషించారు.' అని రెడ్డి అన్నారు.
నిజానికి సీనియర్ మావోయిస్టులు లొంగిపోవడానికి ఎస్ఐబీ టీమ్ చాలా ప్రొఫెషనల్ ఇంటెలిజెన్స్ పనితో ముందుకు వెళ్లింది. ఎలాంటి హడావుడి లేకుండా, ఒక్క తూటా పేలకుండా అగ్రనేతలను జనజీవన స్రవంతిలోకి వచ్చేందుకు కృషి చేసింది.
ఎస్ఐబీ ఒక్కటే నమ్మింది.. మావోయిస్టులు ఎన్‌కౌంటర్లలో ప్రాణాలు కోల్పోతే 'అమరవీరులు' అవుతారు. వారిని అరెస్టు చేస్తే 'హీరోలు' అవుతారు, అదే వారు లొంగిపోతే 'జీరోలు' అవుతారు' అనే సూత్రంతో పనిచేసింది. గత ఏడాది అక్టోబర్‌లో మహారాష్ట్ర ప్రభుత్వం ముందు లొంగిపోయిన కీలక మావోయిస్టు నాయకుడు మల్లోజుల వేణుగోపాల్ రావు అలియాస్ సోను మాదిరిగా కాకుండా దేవూజీకి మావోయిస్టు మార్గాన్ని విడిచిపెట్టే ఆలోచన లేదు అని తెలుస్తోంది. కానీ ఆయన లొంగిపోయేలా చేయడంలో ఐపీఎస్ సుమతి చాలా సక్సెస్ అయ్యారని, ఇందుకోసం చాలా శ్రమించారని సమాచారం.
బి.సుమతి గతంలో కౌంటర్-ఇంటెలిజెన్స్ సెల్‌లో పనిచేసినప్పుడు సీక్రెట్ ఆపరేషన్స్ అమలు చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషించారు. 2001 బ్యాచ్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా సుమతి మొదట వరంగల్‌లో నియమితులయ్యారు ఆ తర్వాత 2007లో ఐపీఎస్‌గా పదోన్నతి పొందారు. ఆమె సీఐడీలో డీఐజీగా కూడా పనిచేశారు. కేవలం 25 ఏళ్ల వయసున్న సమయంలో 2004లో శాంతి చర్చలను దగ్గర ఉండి చూశారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


