రైతులకు అలర్ట్.... పంట సమస్యలా..? ఈ టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేస్తే చాలు!

వ్యవసాయ సందేహాలు, పంట తెగుళ్లు, ప్రభుత్వ పథకాల ఫిర్యాదుల పరిష్కారానికి 'కిసాన్ హెల్ప్‌లైన్ సెంటర్' అందుబాటులోకి వచ్చింది. 1800-180-1551 ఉచిత టోల్ ఫ్రీ నంబర్ కు కాల్ చేసి సేవలను పొందొచ్చు.

Published on: Oct 9, 2026, 10:07:01 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

రాష్ట్రంలోని నిరుపేద, మారుమూల గ్రామీణ ప్రాంత రైతులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని, ఆధునిక వ్యవసాయ యాజమాన్య పద్ధతులను చేరువ చేసేందుకు వ్యవసాయ శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. వ్యవసాయ విస్తరణ అధికారి (AEO) నుంచి కమిషనరేట్ స్థాయి అధికారుల వరకు క్షేత్రస్థాయిలో అందుతున్న సేవలకు అదనంగా…. రైతన్నలు తమ అరచేతిలోని మొబైల్ ఫోన్ ద్వారానే తక్షణ పరిష్కారాలు, సలహాలు పొందేందుకు "కిసాన్ హెల్ప్‌లైన్ సెంటర్" (KHC) అందుబాటులోకి వచ్చింది.

కిసాన్ హెల్ప్లైన్ సెంటర్
కిసాన్ హెల్ప్లైన్ సెంటర్

టోల్ ఫ్రీ నంబర్….

రైతులు తమ పొలాల్లో పంటకు ఏదైనా తెగులు సోకినా, ఎరువుల వినియోగం ఎంత మోతాదులో చేయాలో తెలియకపోయినా, పంట మార్పిడిపై సందేహాలు ఉన్నా ఈ సెంటర్ ను సంప్రదించవచ్చు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందక ఇబ్బంది పడుతున్నా సరే.. ఏమాత్రం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వెంటనే ఉచిత టోల్ ఫ్రీ నంబర్ 1800-180-1551 కి కాల్ చేస్తే చాలు….. సంబంధిత వ్యవసాయ రంగానికి చెందిన నిపుణులు నేరుగా మన మాతృభాష తెలుగులోనే రైతుల సందేహాలను నివృత్తి చేస్తారు.

టైమింగ్స్ ఇలా….

ఈ హెల్ప్‌లైన్ సేవలు ప్రతిరోజూ ఉదయం 6:00 గంటల నుంచి రాత్రి 10:00 గంటల వరకు పనిచేస్తాయి. వారంలో 7 రోజులూ ఈ సేవలు నిరంతరాయంగా రైతులకు అందుబాటులో ఉంటాయి. కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 2004 నుంచి దేశవ్యాప్తంగా అమలవుతున్న ఈ ప్రత్యేక కేంద్రం….. తెలంగాణ రాష్ట్ర రైతుల కోసం హైదరాబాద్‌లోని వ్యవసాయ కమిషనర్, సంచాలకుల కార్యాలయంలో ప్రత్యేకంగా పనిచేస్తోంది.

కేవలం వ్యవసాయ సలహాలు, సూచనలు మాత్రమే కాకుండా, వివిధ రకాల ప్రభుత్వ వ్యవసాయ పథకాలకు సంబంధించిన రైతుల ఫిర్యాదులను కూడా ఈ టోల్ ఫ్రీ నంబర్ ద్వారా అధికారులకు నమోదు చేయవచ్చు. "రైతుల ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ" కూడా ఇదే డిజిటల్ వేదికపై అందుబాటులో ఉన్నందున, రైతుల సమస్య తీవ్రతను బట్టి క్షేత్రస్థాయి అధికారులను సమన్వయం చేసి తక్షణమే పరిష్కార చర్యలు తీసుకునేలా ఈ కేంద్రం ఎంతగానో సహాయపడుతుంది.

ఈ డిజిటల్ వ్యవసాయ సేవా ఫలాలు మారుమూల గ్రామాల్లోని చివరి రైతుకు కూడా చేరేలా క్షేత్రస్థాయి వ్యవసాయ విస్తరణ అధికారులు, మండల వ్యవసాయ అధికారులు రైతాంగానికి విస్తృతంగా అవగాహన కల్పించాలని వ్యవసాయ శాఖ సంచాలకులు డా. బి. గోపి ఆదేశించారు. సాంకేతికతను జోడించి అందిస్తున్న ఈ ఉచిత టోల్ ఫ్రీ సేవల ద్వారా….. రైతులు తమ సందేహాలను నివృత్తి చేసుకుని, పంట దిగుబడులను పెంచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More