...
...
Next Story

ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లపై 'క్రిమినల్ వేస్ట్' కామెంట్స్ - సీఎంపై ప్రతిపక్షాలు ఆగ్రహం

ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ల ఉద్యోగార్హతలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ‘క్రిమినల్ వేస్ట్’ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. విద్యార్థుల సామర్థ్యాన్ని అవమానించారంటూ బీఆర్ఎస్, బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Published on: Jul 31, 2026, 07:51:24 IST
Advertisement

రాష్ట్రంలో ఇంజినీరింగ్ పూర్తి చేసిన విద్యార్థుల ఉద్యోగార్హతలు, నైపుణ్యాల కొరతపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. విద్యార్థుల సామర్థ్యాలను ఉద్దేశించి ఆయన ఉపయోగించిన 'క్రిమినల్ వేస్ట్' అనే పదంపై ప్రతిపక్ష పార్టీలు తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేశాయి. తెలంగాణలోని లక్షలాది మంది ఇంజినీరింగ్ విద్యార్థులను సీఎం దారుణంగా అవమానించారని అభిప్రాయపడుతున్నాయి.

సీఎం ఏమన్నారంటే..?

సీఎం రేవంత్ రెడ్డి
సీఎం రేవంత్ రెడ్డి

“టీచర్ ఇంటర్నేషనల్ ఎక్స్‌పోజర్ విజిట్ అండ్ ఎడ్యుకేషనల్ ఎక్సేంజ్‌” లో భాగంగా ఫిన్లాండ్, జర్మనీ దేశాల్లో విద్యా అధ్యయన పర్యటన పూర్తి చేసుకున్న ప్రతినిధులతో సీఎం రేవంత్ సమావేశమయ్యారు. హైదరాబాద్ ఎంసీఆర్ హెచ్ఆర్‌డీ దాశరథి ఆడిటోరియంలో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడిన సీఎం… ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ల ఉద్యోగార్హతలపై కొన్ని కామెంట్స్ చేశారు.

"రాష్ట్రంలో ప్రతి ఏటా దాదాపు 1.10 లక్షల మంది ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు పట్టాలు పుచ్చుకుంటున్నారు. కానీ వారిలో చాలా మంది కనీసం ఒక తెల్ల కాగితంపై ఉద్యోగం కోసం దరఖాస్తు కూడా రాయలేకపోతున్నారు. ఇది క్రిమినల్ వేస్ట్. ఇంజినీరింగ్ చదివానన్న భావనతో చిన్న చిన్న ఉద్యోగాలు చేయడానికి కూడా వారు ముందుకు రావడం లేదు, అలాగని కొత్త నైపుణ్యాలనూ నేర్చుకోవడం లేదు," అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. అయితే… తాను విద్యార్థులను తప్పుపట్టడం లేదని, విద్యా విధానంలో ఉన్న లోపాలనే వేలెత్తి చూపుతున్నానని ఆయన స్పష్టం చేశారు.

సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేత కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఇంజినీరింగ్ విద్యార్థుల నైపుణ్యాలను తక్కువ చేసి మాట్లాడేందుకు ముఖ్యమంత్రికి ఉన్న అర్హత ఏంటని ఆయన ప్రశ్నించారు.

రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి ఎన్.వి. సుభాష్ స్పందిస్తూ… కాంగ్రెస్ నాయకత్వంపై విమర్శలు గుప్పించారు. "కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గతంలో విద్యార్థులను 'ఇడియట్స్' అని సంబోధిస్తే, ఆయన శిష్యుడైన రేవంత్ రెడ్డి ఒక అడుగు ముందుకేసి ఇంజినీరింగ్ విద్యార్థులను 'క్రిమినల్ వేస్ట్' అని ముద్రవేశారు" అని సుభాష్ మండిపడ్డారు.

దేశ వికాసానికి ఇంజినీర్లు వెన్నుముక లాంటి వారని, వారిని అవమానించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ పెద్ద తప్పిదం చేసిందని ఆయన అన్నారు. "తమను తాము జెన్ జీ (Gen Z) కార్యకర్తలుగా చెప్పుకునేవారు ఇప్పుడు స్పందిస్తారా? లేదా తమ రాజకీయ యజమానుల నుంచి ఆదేశాలు వచ్చినప్పుడు మాత్రమే వారి ఆగ్రహం బయటకు వస్తుందా?" అని ఆయన నిలదీశారు.

సీఎం చేసిన ఈ వ్యాఖ్యలను మరో మాజీ మంత్రి హరీశ్ రావ్ తీవ్రంగా ఖండించారు. “రేవంత్ రెడ్డి ఇంజనీరింగ్ విద్యార్థులను క్రిమినల్ వేస్ట్ అనడం అత్యంత దురదృష్టకరం. మన పిల్లలు ఇంజనీరింగ్ చదివి ఎన్నో దేశాల్లో అద్భుతంగా రాణిస్తున్నారు. వెంటనే ఆ మాటలు వెనక్కి తీసుకోని ఇంజనీరింగ్ విద్యార్థులకు, టీచర్లకు క్షమాపణ చెప్పాలి” అని డిమాండ్ చేశారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe