నీళ్ల వివాదాలు కోరుకోవటం లేదు.. చర్చలకు సిద్ధం - సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

నీళ్ల వివాదాల నేపథ్యంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. చర్చల ద్వారా ఆంధ్రాతో నీటి సమస్యలను పరిష్కరించుకునేందుకు తెలంగాణ సిద్ధంగా ఉంటుందన్నారు. తాము వివాదాలను కోరుకోవటం లేదని చెప్పుకొచ్చారు.

Published on: Jan 9, 2026, 17:44:11 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

నదీ జలాల విషయంలో పక్క రాష్ట్రాలతో వివాదాలు కోరుకోవడం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోందని చెప్పారు. నదీ జలాలకు సంబంధించి పంచాయతీ కావాలా..! నీళ్లు కావాలా..! అని అడిగితే తెలంగాణ రాష్ట్రానికి నీళ్లు కావాలని కోరుకుంటామని తెలిపారు.

సీఎం రేవంత్ రెడ్డి
సీఎం రేవంత్ రెడ్డి

నదీ జలాలపై రాజకీయ ప్రయోజనం పొందాలని ప్రభుత్వం భావించడం లేదన్నారు. రాజకీయాలకు అతీతంగా చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని కోరుకుంటున్నామని అన్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాలలోని ఈ-సిటీలో నెలకొల్పిన సుజెన్ మెడికేర్‌ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం మాట్లాడారు.

వివాదాలు కోరుకోవటం లేదు - సీఎం రేవంత్

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో తెలంగాణ జల వివాదాలను ప్రస్తావించారు. “పక్క రాష్ట్రాలతో తెలంగాణ వివాదాలను కోరుకోవడం లేదు. న్యాయస్థానాల ముందుకు లేదా మరెవరి వద్దనో పంచాయతీ పెట్టుకునే కన్నా సమస్యపై కూర్చొని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి. నీటి వివాదాల విషయంలో తెలంగాణ శాశ్వత పరిష్కారం కోరుకుంటోంది. అభివృద్ధి సాధించాలంటే పక్క రాష్ట్రాల సహకారం, సయోధ్య ఉండాలి. రాజకీయాలకు అతీతంగా పరిష్కారం కోసం అందరూ సహకరించాలి..” అని పక్క రాష్ట్ర ప్రజా ప్రతినిధులకు విజ్ఞప్తి చేశారు.

కృష్ణా నదిపై ఉమ్మడి రాష్ట్రంలో మంజూరైన ప్రాజెక్టులకు అడ్డంకులు సృష్టించరాదని ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. జల వివాదాలపై శాశ్వత పరిష్కారం, రాష్ట్ర ప్రయోజనాలపై వివాదాలను కోరుకోవడం లేదని, సమస్యల పరిష్కారం కోసం సహకరించాలని కోరారు.

ఉమ్మడి రాష్ట్రంలో మంజూరైన పాలమూరు – రంగారెడ్డి, కల్వకుర్తి, డిండి, ఎస్ఎల్బీసీ, బీమా, నెట్టెంపాడు వంటి ప్రాజెక్టులకు ఆంధ్రప్రదేశ్ అభ్యంతరాల వల్ల పర్యావరణం, సీడబ్ల్యూసీ నుంచి సమస్యలు తలెత్తుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి రావలసిన నిధులు, అనుమతులు కూడా రావడం లేదని, తద్వారా రాష్ట్రంపై ఆర్థిక భారం పడుతోందని చెప్పారు.

రాజకీయ ప్రయోజనాలకన్నా ప్రజలు, రైతుల ప్రయోజనాల కోసం ఆలోచన చేస్తున్నామని, పరస్పర సహకారం అవసరమని అన్నారు. పోర్టు కనెక్టివిటీ లేని తెలంగాణకు మచిలీపట్నం పోర్టుతో కనెక్టివిటీ కోసం 12 లేన్ల గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ వే, రైల్వే కనెక్టివిటీతో సహా అనుమతి అడిగామని, ఆ కనెక్టివిటీని అభివృద్ధి చేయాలంటే పక్క రాష్ట్రం సహకారం అవసరమని చెప్పారు.

అలాగే ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధి చెందాలంటే తెలంగాణ సహకారం అవసరం ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. పరస్పరం సహకరించుకుంటేనే సమస్యలు పరిష్కారమవుతాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలతో పరస్పర సహకారాన్ని మాత్రమే కోరుకుంటున్నామని చెప్పారు. రాష్ట్రాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వెళ్లాలని, చర్చల ద్వారా సమస్యల సంపూర్ణ పరిష్కారం కోసం ముందుంటామని అన్నారు.

తెలంగాణ సమగ్రాభివృద్ధి కోసం రాష్ట్రాన్ని క్యూర్, ప్యూర్, రేర్ మూడు భాగాలుగా అభివృద్ధి లక్ష్యాలను నిర్దేశిస్తూ గ్లోబల్ సమ్మిట్ లో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ విడుదల చేశామని వివరించారు. తెలంగాణ ప్రపంచంలో జర్మనీ, జపాన్, సౌత్ కొరియా, న్యూయార్క్ లతో పోటీ పడాలని సంకల్పించామని, అందులో భాగంగానే యువ పారిశ్రామిక వేత్తలు ప్రారంభించే పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు.

“ప్రపంచ నగరాలతో పోటీ పడే విధంగా ఐటీ, ఫార్మా, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్, డేటా సెంటర్స్ వాటిల్లో పోటీ పడగలుగుతున్నాం. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలంటే ప్రైవేటు రంగంలో పెట్టుబడులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది” అని సీఎం చెప్పారు.

“రాష్ట్రం అభివృద్ధి సాధించడానికి పారిశ్రామిక, విద్యుత్, పర్యాటక, దేవాదాయ, వైద్య రంగాల్లో ప్రభుత్వం పాలసీలు తీసుకొచ్చిందని, విద్యా రంగంలోనూ సరికొత్త పాలసీని ప్రకటించబోతున్నాం. పెట్టుబడులను ఆకర్షించడానికి పారదర్శకమైన ప్రణాళికలు రూపొందించాం. భారత్ ఫ్యూచర్ సిటీ వల్ల ఇక్కడి భూముల ధరలు పెరుగుతాయి. అభివృద్ధికి అందరూ సహకరించాలి. అందరి సహకారం ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి సాధ్యమవుతుంది” అని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు.

1995 నుంచి 2025 వరకు 30 ఏళ్ల నిరంతర శ్రమ వల్ల హైదరాబాద్ ప్రపంచ నగరాలతో పోటీ పడుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. జర్మన్ సాంకేతిక పరిజ్ఞానంతో దక్షిణ భారత దేశంలోనే ఐవీ ఫ్లూయిడ్స్ తయారీకి సంబంధించి సంస్థను ఏర్పాటు చేయడం అభినందనీయమని ప్రశంసించారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More