...
...
Next Story

తెలంగాణ పల్లెలకు హైస్పీడ్ ఇంటర్నెట్ - భారత్‌నెట్ ప్రాజెక్ట్ కింద రూ. 3,189 కోట్లు

తెలంగాణలోని 12,769 గ్రామ పంచాయతీలకు ఫైబర్ ఇంటర్నెట్ అందించేందుకు కేంద్రం రూ. 3,189 కోట్లు మంజూరు చేసింది. 3 లక్షల గ్రామీణ ఇళ్లకు ఇంటర్నెట్ సదుపాయం కల్పించేలా ఒప్పందం కుదిరింది.

Published on: Nov 6, 2026, 22:16:48 IST
Advertisement

Telangana BharatNet Project : తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ నెట్‌వర్క్‌ను బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. అమెండెడ్ భారత్‌నెట్ పథకం కింద తెలంగాణకు రూ. 3,189 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

భారత్‌నెట్ ప్రాజెక్ట్ (Image Source Pixel)
భారత్‌నెట్ ప్రాజెక్ట్ (Image Source Pixel)

ఈ భారీ ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 12,769 గ్రామ పంచాయతీలకు డిజిటల్ నెట్‌వర్క్ విస్తరించడంతో పాటు సుమారు 3 లక్షల గ్రామీణ ఇళ్లకు నేరుగా హోమ్ ఫైబర్ కనెక్షన్లు అందించనున్నారు.

కీలక ఒప్పందం…

న్యూఢిల్లీ వేదికగా శుక్రవారం ఈ ప్రాజెక్ట్ అమలుకు సంబంధించిన ప్రతిష్టాత్మక ఒప్పందంపై సంతకాలు జరిగాయి. కేంద్ర టెలికాం శాఖ ఆధ్వర్యంలోని 'డిజిటల్ భారత్ నిధి' , తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ రూరల్ ఇంటర్నెట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ (TRIICL), భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL), తెలంగాణ ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్ లిమిటెడ్ ప్రతినిధులు ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు.

ఈ బృహత్తర ప్రాజెక్టును రాష్ట్ర-ఆధారిత నమూనాలో 'ట్రైకిల్' (TRIICL) సంస్థ ద్వారా అమలు చేయనున్నారు. పల్లెల్లో టెలికాం మౌలిక వసతులను పటిష్టం చేయడం, నెట్‌వర్క్ అంతరాయాలు లేని సాంకేతికతను తీసుకురావడం మరియు చివరి మైలు వరకు ఇంటర్నెట్ సేవలను అందించడమే ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశం.

ప్రాజెక్ట్ వివరాలు…

  • తొలి విడత భారత్‌నెట్‌లో కవర్ అయిన 1,946 గ్రామ పంచాయతీల్లో నెట్‌వర్క్ అంతరాయాలు రాకుండా 'లీనియర్' నుంచి 'రింగ్' టోపోలాజీ విధానానికి అప్‌గ్రేడ్ చేస్తారు.
  • రెండో విడత కింద 10,787 గ్రామ పంచాయతీలకు ఫైబర్ లైన్లు విస్తరిస్తారు. వీటితో పాటు కొత్తగా ఏర్పడిన 36 గ్రామ పంచాయతీలను కూడా కలుపుకుని, మొత్తం 12,769 గ్రామ పంచాయతీలకు ఇంటర్నెట్ సౌకర్యం లభించనుంది.
  • కేంద్ర ప్రభుత్వం అందించే సబ్సిడీ సాయంతో గ్రామీణ ఇళ్లకు సుమారు 3 లక్షల ఫైబర్ కనెక్షన్లు అందనున్నాయి. దీనివల్ల రిమోట్, మారుమూల గ్రామీణ ప్రాంతాల ప్రజలకు విస్తృతస్థాయిలో డిజిటల్ సేవలు అందుబాటులోకి వస్తాయి.
  • ఈ ఆధునిక ఇంటర్నెట్ కనెక్షన్ల ద్వారా ఈ-గవర్నెన్స్ సేవలు, ఆన్‌లైన్ విద్య, టెలిమెడిసిన్ ద్వారా వైద్య సేవలు, డిజిటల్ చెల్లింపులు, పౌర కేంద్రిక సేవలు సులభంగా అందుతాయని అధికారులు వెల్లడించారు.

2023లో కేంద్ర కేబినెట్ ఆమోదం

గతంలో 'యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్' (USOF)గా ఉన్న వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం 'డిజిటల్ భారత్ నిధి' (DBN)గా పునర్నామకరణం చేసి…. మారుమూల మరియు వెనుకబడిన గ్రామీణ ప్రాంతాల్లో టెలికాం సేవల విస్తరణకు నిధులు సమకూరుస్తోంది. తాజాగా కుదిరిన ఒప్పందంతో తెలంగాణ గ్రామీణ ప్రాంతాల డిజిటల్ మౌలిక సదుపాయాల విస్తరణ శరవేగంగా ముందుకు సాగనుంది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks