రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు, వాటి అనుబంధ కళాశాలల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్ష (TG CPGET) చివరి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తయింది. ఈ ఆఖరి విడత కౌన్సెలింగ్‌లో మొత్తం 5,385 మంది విద్యార్థులు ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ వంటి వివిధ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో సీట్లు దక్కించుకున్నారు.
చివరి విడత కౌన్సెలింగ్ పరిధిలో రాష్ట్రవ్యాప్తంగా వివిధ కళాశాలల్లో మొత్తం 34,059 పీజీ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సీట్ల భర్తీ కోసం నిర్వహించిన వెబ్ ఆప్షన్ల ప్రక్రియలో మొత్తం 9,606 మంది విద్యార్థులు పోటీపడ్డారు. విద్యార్థుల మెరిట్, రిజర్వేషన్ ఆధారంగా వారిలో 5,385 మందికి సీట్లు కేటాయించినట్లు అధికారులు స్పష్టం చేశారు.
రిపోర్టింగ్ తేదీలివే…
సీట్లు పొందిన అభ్యర్థులు వెంటనే ఆన్‌లైన్ విధానంలో నిర్ణీత ఫీజు చెల్లించి అలాట్‌మెంట్ ఆర్డర్ డౌన్‌లోడ్ చేసుకోవాలని ప్రవేశాల కన్వీనర్ ఆచార్య ఐ. పాండురంగారెడ్డి తెలిపారు. అలాట్‌మెంట్ పొందిన విద్యార్థులు ఈ నెల 27వ తేదీలోగా తమకు సీటు వచ్చిన కళాశాలల్లో నేరుగా హాజరై, సర్టిఫికెట్లతో రిపోర్ట్ చేయాలని ఆయన సూచించారు. నిర్దేశిత గడువు లోగా ఫీజు చెల్లించకపోయినా లేదా కళాశాలలో రిపోర్ట్ చేయకపోయినా సీటు రద్దవుతుందని స్పష్టం చేశారు.
అలాట్‌మెంట్ లెటర్ డౌన్లోడ్ విధానం ఇలా…
- అభ్యర్థులు ముందుగా అధికారిక ప్రవేశాల పోర్టల్ https://cpgetadmissions.com/new/ ఓపెన్ చేయాలి.
- హోమ్ పేజీలో కనిపించే 'Allotment Login' లింక్‌పై క్లిక్ చేయాలి.
- మీ హాల్ టికెట్ నంబర్, సాధించిన ర్యాంక్, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ మరియు పుట్టిన తేదీ వివరాలను సరిగ్గా నమోదు చేయాలి.
- వివరాలు నమోదు చేసిన తర్వాత 'Submit' బటన్‌పై క్లిక్ చేస్తే మీ సీటు కేటాయింపు వివరాలు (Allotment Details) స్క్రీన్‌పై కనిపిస్తాయి.
- అనంతరం 'Print' లేదా 'Download' ఆప్షన్ ద్వారా అలాట్‌మెంట్ కాపీని సేవ్ చేసుకుని ప్రింటవుట్ తీసుకోవాలి.