...
...
Next Story

బియ్యం ధరల నియంత్రణకు ప్రభుత్వం నిర్ణయం.. రకాల వారీగా గరిష్ఠ ధరలు ఫిక్స్!

Telangana Rice Prices : తెలంగాణలో బియ్యం ధరల నియంత్రణకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రకాల వారీగా గరిష్ఠ ధరలు ఖరారు చేసింది.

Published on: Nov 9, 2026, 19:04:51 IST
Advertisement

ఎల్‌నినో ప్రభావంతో పెరిగిన నిత్యావసరాల ధరలకు అడ్డుకట్ట వేసేందుకు తెలంగాణ ప్రభుత్వం రంగంలోకి దిగింది. రాష్ట్రంలో బియ్యం ధరలను నియంత్రిస్తూ పౌరసరఫరాల శాఖ రకాల వారీగా ఎమ్మార్పీ ధరలను ఖరారు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న వర్షాభావ పరిస్థితుల కారణంగా మార్కెట్‌లో బియ్యం ధరలు ఆకాశాన్ని తాకుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం వినియోగదారులకు ఊరట కలిగించేందుకు కీలక చర్యలు చేపట్టింది.

తెలంగాణలో బియ్యం ధరలు
తెలంగాణలో బియ్యం ధరలు

విచ్చలవిడిగా పెరిగిన బియ్యం ధరలను అదుపులోకి తెచ్చేందుకు రకాలను బట్టి కిలో బియ్యం రూ. 66 నుండి రూ. 79 వరకు మాత్రమే విక్రయించాలని పౌరసరఫరాల శాఖ స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. కృత్రిమ కొరత సృష్టించి ఎక్కువ ధరలకు విక్రయించే రైస్ మిల్లర్లు, వ్యాపారులపై కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించింది.

రకాల వారీగా నిశ్చయించిన గరిష్ఠ బియ్యం ధరలు(MRP per Kg)ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని పౌరసరఫరాల శాఖ బియ్యం రకాలను బట్టి గరిష్ఠ విక్రయ ధరలను నిర్ధారించారు. బీపీటీ/కేఎన్ఎం రకాలు రూ.66, ఆర్ఎన్ఆర్/ తెలంగాణ సోనా రూ.74, హెచ్ఎంటీ/జేఎస్ఆర్ రకాలు రూ.79గా నిర్ణయించారు.

రాష్ట్రంలో బియ్యం కొరత ఉందంటూ వస్తున్న వార్తలు పూర్తి అసత్యమని తెలంగాణ చీఫ్ రేషనింగ్ ఆఫీసర్ జి.వి. శ్యామ్ ప్రసాద్ లాల్ వెల్లడించారు. వినియోగదారుల నుంచి అధిక ధరలు వసూలు చేసినా, నిల్వలను దాచిపెట్టి కృత్రిమ కొరత సృష్టించినా ఉపేక్షించేది లేదని తేల్చిచెప్పారు. దళారులు, బ్లాక్ మార్కెటీర్లపై పౌరసరఫరాల శాఖ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసింది.

పదేపదే నిబంధనలను ఉల్లంఘిస్తూ అక్రమాలకు పాల్పడే వ్యాపారులపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని అధికారులు స్పష్టం చేశారు. 25 కిలోల సంచిపై 26 కిలోల స్టిక్కర్ వేయడం లేదా వ్యాపారులు నకిలీ ఎంఆర్‌పీ స్టిక్కర్లతో అధిక ధరలకు బియ్యం అమ్మడం చట్టరీత్యా నేరమని, అటువంటి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

సరిగ్గా అమలు జరుగుతున్నాయో లేదో పరిశీలించేందుకు పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక తనిఖీ బృందాలు రాష్ట్రవ్యాప్తంగా సోదాలు నిర్వహించనున్నాయి. మార్కెట్‌లో ఏ వ్యాపారి అయినా ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే ఎక్కువకి బియ్యం విక్రయిస్తున్నా, లేదా తూకాల్లో మోసాలకు పాల్పడినా వినియోగదారులు వెంటనే పౌరసరఫరాల శాఖ అధికారులకు ఫిర్యాదు చేయాలని చీఫ్ రేషనింగ్ ఆఫీసర్ శ్యామ్ ప్రసాద్ లాల్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks